hijab-clad chief: ఒవైసీకి బీజేపీ చురక.. హిజాబ్ మహిళ పార్టీ చీఫ్ ఎప్పుడని ప్రశ్న-when will aimim get hijab clad chief bjp leader digs on sunak debate
Telugu News  /  National International  /  When Will Aimim Get Hijab Clad Chief Bjp Leader Digs On Sunak Debate
అసదుద్దీన్ ఒవైసీకి బీజేపీ కౌంటర్
అసదుద్దీన్ ఒవైసీకి బీజేపీ కౌంటర్ (ANI)

hijab-clad chief: ఒవైసీకి బీజేపీ చురక.. హిజాబ్ మహిళ పార్టీ చీఫ్ ఎప్పుడని ప్రశ్న

26 October 2022, 11:34 ISTPraveen Kumar Lenkala
26 October 2022, 11:34 IST

hijab-clad chief: అసదుద్దీన్ వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్ విసిరింది.

భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ యూకే ప్రధాన మంత్రి అయ్యాక మొదలైన ‘ముస్లిం ప్రధాని’ చర్చలో బీజేపీ బుధవారం ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీపై విరుచుకుపడింది.

ఇండియాలో మెజారిటీవాద ప్రభుత్వం నడుస్తున్నందున ఇది సాధ్యం కాదంటూ ప్రతిపక్ష పార్టీల నేతలు వాదిస్తూ వచ్చారు. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ దానిని పునరుద్ఘాటిస్తూ హిజాబ్ ధరించిన అమ్మాయిని ఈ దేశ ప్రధానిగా చూడాలన్నది తన కల అని వ్యాఖ్యానించారు.

దీనికి బీజేపీ నేత షెహజాద్ పూనావాలా కౌంటర్ ఇస్తూ ముందు మీ పార్టీ హిజాబ్ ధరించిన మహిళను అధ్యక్షురాలిగా ఎప్పుడు ఎన్నుకుంటుందో చెప్పండి.. అంటూ ప్రశ్నించారు.

‘హిజాబ్ ధరించిన అమ్మాయి ఈ దేశ ప్రధాన మంత్రి అవుతుందని ఒవైసీకి విశ్వాసం ఉంది. రాజ్యాంగం ఎవరినీ నిరోధించదు. కానీ మీరు ముందు ఇది చెప్పండి.. హిజాబ్ ధరించిన అమ్మాయి ఏఐఎంఐఎం అధ్యక్షురాలిగా ఎప్పుడవుతుంది?’ అని పూనావాలా ట్వీట్ చేశారు.

కర్ణాటకలో హిజాబ్ వివాదం నడుస్తుండగా గతంలో ఒవైసీ మాట్లాడుతూ దేశంలో ఏదో ఒక రోజు హిజాబ్ ధరించిన మహిళ ప్రధాన మంత్రి అవుతుందని అన్నారు. తరువాత దానిపై స్పందిస్తూ తాను తప్పేమీ మాట్లాడలేదని, అలా జరగాలని ఆకాంక్షిస్తున్నాని అన్నారు.

రిషి సునాక్ బ్రిటన్ ప్రధాన మంత్రి పదవికి ఎన్నికవడంతో ఒవైసీ ఈ వ్యాఖ్యలను పునరుద్ఘాటించారు. ‘నేను ఇదివరకే చెప్పాను. దేవుడి దయ వల్ల నేను బతికున్న సమయంలో గానీ, ఆ తరువాత గానీ, దేశంలో హిజాబ్ ధరించిన మహిళ ప్రధాన మంత్రి అవుతారు.. ’ అని ఓ ప్రశ్నకు జవాబుగా స్పందించారు.