Pallonji Mistry dies | దిగ్గ‌జ బిజినెస్ మ్యాన్ పల్లోంజీ మిస్త్రీ క‌న్నుమూత‌-sp group s pallonji mistry dies at 93 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Sp Group's Pallonji Mistry Dies At 93

Pallonji Mistry dies | దిగ్గ‌జ బిజినెస్ మ్యాన్ పల్లోంజీ మిస్త్రీ క‌న్నుమూత‌

HT Telugu Desk HT Telugu
Jun 28, 2022 03:38 PM IST

Pallonji Mistry | ప్ర‌తిష్టాత్మ‌క షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్ చైర్మ‌న్ పల్లోంజీ మిస్త్రీ క‌న్నుమూశారు. 93 ఏళ్ల మిస్త్రీ `షాపూర్‌జీ పల్లోంజీ` పేరుతో ఒక వ్యాపార సామ్రాజ్యాన్నే నిర్మించారు.

షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్ చైర్మ‌న్ పల్లోంజీ మిస్త్రీ
షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్ చైర్మ‌న్ పల్లోంజీ మిస్త్రీ

`షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్` అంత‌ర్జాతీయంగా పేరుగాంచిన భార‌త వ్యాపార సంస్థ‌. ఈ గ్రూప వ్యాపారాల చైర్మ‌న్ ప‌ల్లోంజీ మిస్త్రీ సోమ‌వారం అర్ధ‌రాత్రి దాటిన తరువాత, ముంబైలోని త‌న నివాసంలో నిద్ర‌లోనే క‌న్నుమూశారు. మిస్త్రీ టాటా గ్రూప్‌లో 18.4% వాటాతో అతిపెద్ద వ్య‌క్తిత‌గ వాటాదారుగా ఉన్నారు.

షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్ ప్రారంభం

షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్ 150 ఏళ్ల క్రితమే ప్రారంభమైంది. ప్ర‌స్తుతం 50 దేశాల్లో ఈ కంపెనీ కార్య‌క‌లాపాలు సాగిస్తోంది. ఈ సంస్థ‌లో 50 వేల‌కు పైగా ఉద్యోగులున్నారు. రియ‌ల్ ఎస్టేట్‌, ఇన్ఫ్రా, క‌న్స్ట్ర‌క్ష‌న్‌, ఇంజినీరింగ్‌, ఎనర్జీ, ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్ త‌దిత‌ర రంగాల్లో ఈ సంస్థ వ్యాపార కలాపాలు సాగిస్తోంది. ముంబైలోని ఆర్బీఐ భ‌వ‌నం, ఒబెరాయ్ హోట‌ల్‌, ఒమ‌న్ లోని సుల్తాన్ ప్యాలెస్ `అల్ అల‌మ్‌`ను ఈ సంస్థే నిర్మించింది. ప‌ల్లోంజీ మృతి ప‌ట్ల ప్ర‌ధాని మోదీ తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశారు.

క‌న్స్ట్ర‌క్షన్ రంగంలో అద్భుతాలు సృష్టించిన ప‌ల్లోంజీ మిస్త్రీ

ప‌ల్లోంజీ మిస్త్రీకి క‌న్స్ట్ర‌క్షన్,ఇంజినీరింగ్ రంగాల‌పై మ‌క్కువ ఎక్కువ‌. ఆ రంగాల్లో ఆయ‌న అద్భుతాలు సృష్టించారు. ఆయ‌న ఆస్తుల విలువ 29 బిలియ‌న్ డాల‌ర్లు ఉంటుంద‌ని బ్లూమ్‌బ‌ర్గ్ అంచ‌నా వేసింది. భార‌త్‌లో టాప్ 10 ధ‌న‌వంతుల్లో మిస్త్రీ ఒక‌రు. భార‌త ప్ర‌భుత్వం 2016లో ఆయ‌న‌కు ప‌ద్మ‌భూష‌ణ్ పుర‌స్కారం ప్ర‌క‌టించింది.

<p>షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్ లోగో</p>
షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్ లోగో

Pallonji Mistry | ఐర్లండ్ పౌరస‌త్వం

2003లో ప‌ల్లోంజీ మిస్త్రీ భార‌తీయ పౌర‌స‌త్వం వ‌దులుకున్నారు. భార్య పాట్సీ పెరిన్ దుబాష్ దేశ‌మైన ఐర్లండ్ పౌర‌స‌త్వం తీసుకున్నారు. వారికి ఇద్ద‌రు కుమారులు, ఇద్ద‌రు కూతుళ్లు. టాటాసన్స్ మాజీ చైర్మ‌న్ సైర‌స్ మిస్త్రీ ప‌ల్లంజో మిస్త్రీ కుమారుడే. ఆ ప‌ద‌వి నుంచి సైరస్ మిస్త్రీ ని తొల‌గించ‌డం పెద్ద వివాదంగా మారిన విష‌యం తెలిసిందే. పెద్ద కొడుకు షాపూర్ 2004లో షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఇద్ద‌రు కూతుళ్లు లైలా, అలూల‌లో.. అలూ ర‌త‌న్‌టాటా స‌వ‌తి సోద‌రుడైన నోయెల్ టాటాను వివాహం చేసుకున్నారు.

`షాపూర్‌జీ ప‌ల్లోంజీ` వ్యాపారం బొంబాయిలో ప్రారంభం

`షాపూర్‌జీ ప‌ల్లోంజీ` వ్యాపారం బొంబాయిలో 1865లో ప్రారంభ‌మైంది. ఒక ఆంగ్లేయుడితో క‌లిసి ప‌ల్లోంజీ మిస్త్రీ తాత ముంబై(నాటి బొంబాయి)లో ఒక రిజ‌ర్వాయ‌ర్ నిర్మించారు. బొంబాయిలో అదే తొలి రిజ‌ర్వాయ‌ర్‌. జొరాష్ట్రియ‌న్ కుటుంబాలైన టాటా కుటుంబం, మిస్త్రీ కుటుంబం 1920 నుంచే వ్యాపార భాగ‌స్వామ్యులు. ఈ రెండు కుటుంబాల పూర్వీకులు ప‌ర్షియా నుంచి భార‌త్‌కు వ‌చ్చారు.

`మొఘ‌ల్స్ ఆఫ్ రియ‌ల్ ఎస్టేట్‌`

ప‌ల్లోంజీ మిస్త్రీ 1929లో జ‌న్మించారు. ఆయ‌న తండ్రి షాపూర్‌జీ మిస్త్రీ. కుటుంబ వ్యాపారంలోకి ప‌ల్లోంజీ మిస్త్రీ 1947లో ప్ర‌వేశించారు. అబుదాబీ, క‌తార్‌, దుబాయ్‌ల్లో త‌మ వ్యాపారాల‌ను విస్త‌రించారు. ఒమ‌న్ రాజు ప్యాలెస్ తో పాటు అక్క‌డ ఎన్నో ముఖ్య‌మైన నిర్మాణాలు చేశారు. ప‌ల్లంజీ కుటుంబంపై మ‌నోజ్ నంబురు `మొఘ‌ల్స్ ఆఫ్ రియ‌ల్ ఎస్టేట్‌` పేరుతో ఒక పుస్త‌కం కూడా రాశారు. సంస్థ పేరు చెడిపోకుండా ఉండ‌డం కోసం, చెప్పిన స‌మ‌యానికి, నాణ్య‌మైన ప్రాజెక్టును అందించ‌డం కోసం, అవ‌స‌ర‌మైతే, న‌ష్టాల‌ను కూడా భ‌రించేందుకు ప‌ల్లోంజీ మిస్త్రీ సిద్ధంగా ఉండేవాడ‌ని ఆ బుక్‌లో రాశారు. ప‌ల్లోంజీ హ‌యాంలోనే సంస్థ ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్‌, రియ‌ల్ ఎస్టేట్, వాట‌ర్‌, ఎన‌ర్జీ రంగాల్లో ప్ర‌వేశించింది.

భార‌త్‌లో `షాపూర్‌జీ ప‌ల్లోంజీ` వ్యాపారం

ముంబైలో ఈ సంస్థ ఎన్నో ప్ర‌తిష్టాత్మ‌క నిర్మాణాలు చేప‌ట్టింది. ఆర్బీఐ భ‌వ‌నం, ఒబెరాయ్ హోట‌ల్‌, ముంబై వ‌ర‌ల్డ్ ట్రేడ్ సెంట‌ర్‌, 60 అంత‌స్తుల నిర్మాణ స‌ముదాయం ఇంపీరియ‌ల్‌, పుణెలో ఓజోన్ ఐటీ పార్క్ ఈ సంస్థ నిర్మించిన‌వే.

IPL_Entry_Point