US Drone: అమెరికా, రష్యా మధ్య కొత్తగా ‘డ్రోన్’ గొడవ: వివరాలివే-russian jet collides with us drone over black sea
Telugu News  /  National International  /  Russian Jet Collides With Us Drone Over Black Sea
US Drone: అమెరికా, రష్యా మధ్య కొత్తగా ‘డ్రోన్’ గొడవ: వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
US Drone: అమెరికా, రష్యా మధ్య కొత్తగా ‘డ్రోన్’ గొడవ: వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం) (HT Photo)

US Drone: అమెరికా, రష్యా మధ్య కొత్తగా ‘డ్రోన్’ గొడవ: వివరాలివే

15 March 2023, 6:59 ISTChatakonda Krishna Prakash
15 March 2023, 6:59 IST

US Drone - Russia Jet Crash: నల్ల సముద్రంపై తమ నిఘా డ్రోన్‍ను రష్యా యుద్ధ విమానం కూల్చివేసిందని అమెరికా వెల్లడించింది. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బ తింటాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.

US Drone - Russia Jet Crash: అమెరికా, రష్యా మధ్య (US vs Russia) ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా అమెరికాకు చెందిన ఓ అతిపెద్ద నిఘా డ్రోన్‍ (US Surveillance Drone)ను రష్యాకు చెందిన యుద్ధ విమానం కూల్చివేసింది. నల్లసముద్రం (Black Sea) పై విహరిస్తున్న అమెరికా డ్రోన్‍ను రష్యా యుద్ధ విమానం ఢీకొట్టింది. ఈ విషయాన్ని అమెరికా మిలటరీ ప్రకటించింది.

ముందు చమురు కురిపించి..

US Drone - Russia Jet Crash: అంతర్జాతీయ జలాలపై తిరుగుతున్న అమెరికన్ డ్రోన్‍ ఎంక్యూ-9 రీపర్‌ (MQ-9 Reaper)ను రష్యాకు చెందిన రెండు సుఖోయ్ ఎస్‍యూ-27 యుద్ధ విమానాలు అడ్డుకున్నాయని యూఎస్ యూరోపియన్ కమాండ్ పేర్కొంది. “ఢీకొట్టడానికి ముందు, డ్రోన్‍పై Su-27 యుద్ధ విమానం చమురును కుమ్మరించింది. నిర్లక్ష్యంగా MQ-9 డ్రోన్‍ ముందు విహరించింది. ఇది సరైన పద్ధతి కాదు. చాలా అన్‍ప్రొఫెషనల్” అని ఆ కమాండ్ స్టేట్‍మెంట్ వెల్లడించింది.

US Drone - Russia Jet Crash: నల్ల సముద్రంపై రష్యా అడ్డగింతలు సాధారణమేనని, అయితే ఈసారి హద్దుదాటిందని అమెరికా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి జోన్ కిర్బీ.. మీడియాతో అన్నారు. రష్యా చర్య చాలా అసురక్షితమైనదని, బాధ్యతారాహిత్యమైనదని చెప్పారు. వాస్తవంగా చెప్పాలంటే రష్యా చాలా నిర్లక్ష్యంగా వ్యవహిస్తోందని అన్నారు.

US Drone - Russia Jet Crash: బ్రుసెల్స్‌లోని నాటో దౌత్యవేత్తలు కూడా ఈ ఘటనను ధ్రువీకరించారు. అయితే ఇంత త్వరగా ఈ విషయంలో ఘర్షణ వాతావరణం నెలకొంటుందని అంచనా వేయలేదని పేర్కొన్నారు. అమెరికా, రష్యా మధ్య సంబంధాలు ఈ ఘటనతో మరింత క్షీణించాయని మిలటరీ వర్గాలు చెబుతున్నాయి.

ఢీకొట్టలేదు

US Drone - Russia Jet Crash: అమెరికా డ్రోన్‍ నల్లసముద్రంతో కూలిపోవడానికి, తమకు సంబంధం లేదని రష్యా ప్రకటించింది. డ్రోన్‍ను తమ యుద్ధ విమానం ఢీకొట్టలేదని వెల్లడించింది. “రష్యా యుద్ధ విమానాల్లో ఎలాంటి ఆయుధాలు లేవు. యూఏవీతో ఎలాంటి కాంటాక్ట్ జరగలేదు. రష్యా భూభాగానికి అవి సురక్షితంగా చేరుకున్నాయి” అని రక్షణ శాఖ పేర్కొంది.

Russia - Ukraine War: గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‍తో రష్యా యుద్ధం మొదలుపెట్టింది. అప్పటి నుంచి అమెరికా సహా నాటో దేశాలు.. రష్యాపై ఆగ్రహంగా ఉన్నాయి. అమెరికా సహా అనేక దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. మరోవైపు రష్యా కూడా అంతే దూకుడుగా ఉంది. పాశ్చాత్య దేశాల హెచ్చరికలు, సూచనలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఉక్రెయిన్‍పై యుద్ధం చేస్తూనే ఉంది. యుద్ధానికి ఏడాది అయిన సందర్భంగా ఫిబ్రవరిలో ఉక్రెయిన్‍లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పర్యటించారు. ఉక్రెయిన్‍కు మరింత సాయం అందిస్తామని స్పష్టం చేశారు. ఆయుధ సహాయాన్ని కూడా పెంచింది. దీనిపై రష్యా ఆగ్రహంగా ఉంది. తాజాగా ఈ డ్రోన్ ఘటన ఇరు అమెరికా, రష్యా మధ్య కొత్త గొడవకు దారి తీసింది.

సంబంధిత కథనం