Rakesh Jhunjhunwala: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా సంపద ఎవరికి? చావు గురించి ఏమన్నారు-rakesh jhunjhunwala spoke of death plans to donate wealth to charity ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Rakesh Jhunjhunwala Spoke Of Death, Plans To Donate Wealth To Charity

Rakesh Jhunjhunwala: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా సంపద ఎవరికి? చావు గురించి ఏమన్నారు

Praveen Kumar Lenkala HT Telugu
Aug 16, 2022 11:36 AM IST

Rakesh Jhunjhunwala: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా తన మరణం గురించి, ఆస్తిపాస్తుల దానం గురించి ఏమన్నారో తెలుసా?

రాకేష్ ఝున్‌ఝున్‌వాలా
రాకేష్ ఝున్‌ఝున్‌వాలా

Rakesh Jhunjhunwala: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 48 వేల కోట్లు ఉంటుంది. ఈ సంపదలో అధిక భాగం ఆయన దానధర్మాలకు ఇవ్వాలనుకున్నారు. ఈ కార్యక్రమాన్ని 2025 నుంచి ప్రారంభించాలనుకున్నారు. 2021లో ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సంపదలో అధిక భాగాన్ని తన ఛారిటేబుల్ సంస్థ రేర్ ఫ్యామిలీ ఫౌండేషన్‌కు ఇవ్వాలన్న యోచనలో ఉన్నట్టు చెప్పారు.

జీవితంపై తనకు తాత్విక దృక్పథం ఉందని రాకేష్ ఝున్‌ఝున్‌వాలా చెప్పారు. విజయానికి నశించే గుణమున్నదని, అది అశాశ్వతమైనదని, తాను ఆరోగ్యకరమైన జీవితాన్ని అనుభవించేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. 61 ఏళ్ల వయస్సులోనే ఆయన తన మరణం గురించి అవగాహనతో ఉన్నారు. భారతీయుల సగటు జీవన కాలం సుమారు 70 సంవత్సరాలన్న అవగాహనను ఆయన తన ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.

అయితే జాగ్రత్తగా ఉండాలన్న ఏ సలహానైనా ఆయన తోసిపుచ్చారు. రూ. 500 కోట్లు ఇస్తే అప్పటికప్పుడు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.

అయితే 2021లోనే రాకేష్ ఝున్‌ఝున్‌వాలా తన సంపదను ఎలా ఖర్చు చేయాలన్న అంశంపై ప్రణాళికలు ప్రారంభించారు. అయితే వాటిని 2025 నుంచి అమలు చేయాలని భావించారు. సంపదను ఇచ్చివేయాలన్న ఉద్దేశం ఇంకా పెరిగిందని చెప్పారు.

తన ఛారిటీ సంస్థ రేర్ ఫ్యామిలీ ఫౌండేషన్‌కు రాకేష్ ఝున్‌ఝున్‌వాలా రూ. 5 వేల కోట్లను 2025 డిసెంబరు నాటికి ఇవ్వాలనుకున్నారు. ప్రతి ఏటా మార్చి 1 నాటికి తన పోర్ట్‌ఫోలియోను మదించి అందులో నుంచి 2 శాతం మేర ఇవ్వాలనుకున్నారు. చారిటీ విలువ రూ. 25 వేల కోట్లు చేరుకునేంతవరకు దానిని కొనసాగించాలనుకున్నారు. పౌష్ఠికాహార లోపాలు, చిన్న వయస్సులో గుండె శస్త్రచికిత్స అవసరమైన వారికి ఖర్చు చేయాలనుకున్నారు. అలాగే ఒక స్పోర్ట్స్ అకాడమీ స్థాపించాలనుకున్నారు.

ఫౌండేషన్‌కు ఒక ఛైర్మన్ సహా టీమ్ ఉంటుందని, రాకేష్ ఝున్‌ఝున్‌వాలా కుటుంబం ప్రధాన డోనార్‌గా ఉంటారని ఆయన ఇదివరకే వెల్లడించారు. కేవలం 10 శాతం డొనేషన్లు మాత్రమే కుటుంబ విచక్షణకు లోబడి ఉంటాయని, మిగిలిన 90 శాతం అడ్వైజరీ బోర్డు సలహా మేరకు వినియోగిస్తారని తెలిపారు.

ఇటీవలే గోవా, ఢిల్లీ, దుబాయి టూర్ వెళ్లి సెలవులను గడిపిన రాకేష్ ఝున్‌ఝున్‌వాలా తన కుటుంబం, పిల్లలతో ఎక్కువ సమయం గడపడం ప్రారంభించారు. ఇంట్లో ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, మూవీస్ చూడడం చేసే వారు. మార్కెట్స్ ప్రారంభమైనప్పుడు ఆయన వర్క్ ప్రారంభమైనప్పటికీ, మధ్యాహ్నం వేళ మాత్రమే ఆయన ఆఫీస్ చేరుకునే వారు. తన వ్యాపార కార్యకలాపాలను తగ్గించుకోవాలని రాకేష్ ఝున్‌ఝున్‌వాలా భావించేవారు.

IPL_Entry_Point