Japanese Woman: “హోలీ అంటే సరదా.. ఇండియాపై ప్రేమ”: వేధింపులకు గురైన జపాన్ యువతి ట్వీట్లు-japanese woman responds on holi incident on twitter says she loves india ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Japanese Woman Responds On Holi Incident On Twitter Says She Loves India

Japanese Woman: “హోలీ అంటే సరదా.. ఇండియాపై ప్రేమ”: వేధింపులకు గురైన జపాన్ యువతి ట్వీట్లు

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 12, 2023 07:40 AM IST

Japanese Woman - Holi Incident: ఢిల్లీలో హోలీ వేడుకల్లో వేధింపులకు గురైన జపాన్ మహిళ స్పందించారు. వీడియో వైరల్ అవటంతో దీనిపై ఆమె ట్వీట్లు చేశారు.

హోలీ వేడుకల్లో జపనీస్ యువతిని వేధించిన యువకులు
హోలీ వేడుకల్లో జపనీస్ యువతిని వేధించిన యువకులు

Japanese Woman - Holi Incident: ఢిల్లీలో జరిగిన హోలీ వేడుకల్లో జపాన్‍కు చెందిన ఓ యువతి.. వేధింపులకు గురయ్యారు. ముగ్గురు యువకులు ఆమెను వేధించారు. ఢిల్లీలోని పహర్‌గంజ్‍లో బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవటంతో ఆ యువతి స్పందించారు. ఘటనను వివరిస్తూ శనివారం ట్వీట్లు చేశారు. నిజమైన హోలీ.. ఎంతో సరదాగా ఉండే పండుగ అని, తనకు భారత దేశమంటే చాలా ప్రేమ అని తెలిపారు. మరిన్ని విషయాలను వెల్లడించారు. ఈ వీడియో వైరల్ అయ్యాక ఆ జపాన్ యువతి.. శుక్రవారమే బంగ్లాదేశ్‍కు వెళ్లారు. అక్కడ నుంచే ఈ ఘటనకు సంబంధించి ట్విట్టర్‌లో శనివారం వెల్లడించారు.

వీడియో పోస్ట్ చేసి.. డిలీట్ చేశా..

Japanese Woman - Holi Incident: తాను ఆ వీడియోను మార్చి 9న ట్విట్టర్‌లో పోస్ట్ చేశానని, అయితే అది విపరీతంగా వైరల్ అవడం, రీట్వీట్లు, డైరెక్ట్ మెసేజ్‍లు అధికంగా రావటంతో భయపడి డిలీట్ చేశానని ఆ జపాన్ యువతి శనివారం ట్వీట్ చేశారు. “ఆందోళనకు, కంగారుకు కారణమైనందుకు నేను క్షమాపణలు చెబుతున్నా” అని జపనీస్‍లో ట్వీట్లు పోస్ట్ చేశారు.

“హోలీ పండుగ రోజున పగటి పూట మహిళ ఒంటరిగా వెళ్లడం ప్రమాదకరమని నేను విన్నాను. అయితే నేను హోలీ ఫెస్టివల్ ఈవెంట్‍లో 35 మంది స్నేహితులతో కలిసి పాల్గొన్నాను” అని ఆ జపాన్ యువతి రాసుకొచ్చారు. ఈ ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. ఆమె వీడియో డిలీట్ చేసినా.. అప్పటికే మరికొందరు ఆ వీడియోను పోస్ట్ చేశారు.

ఒక్క ఘటనతో ద్వేషం కలగదు

Japanese Woman - Holi Incident: హోలీ అంటే.. అద్భుతమైన, సరదాతో కూడుకున్న సంప్రదాయ పండుగ అని ఆ జపాన్ యువతి ట్వీట్ చేశారు. ఈ ఒక్క సంఘటన కారణంగా ఇండియాపై ఎలాంటి ద్వేషం కలగలేదని ఆమె స్పష్టం చేశారు. “అన్ని విషయాల్లో ఇండియాను నేను ఎంతో ప్రేమిస్తా. ఇండియాకు చాలా సార్లు వచ్చా. ఇదో అద్భుతమైన దేశం. ఇలాంటి ఘటన జరిగినా ఇండియాపై ద్వేషం కలగదు” అని ఆమె ట్వీట్ చేశారు.

ముగ్గురి అరెస్ట్

Japanese Woman - Holi Incident: హోలీ వేడుకల్లో జపాన్‍కు చెందిన ఓ యువతిని పహర్‌గంజ్ ప్రాంతంలో ముగ్గురు యువకులు వేధించారు. ఆమెను పట్టుకొని రంగులు చల్లారు. ఓ వ్యక్తి ఏకంగా ఆమెపై కోడిగుడ్డు కొట్టారు. ఆమె వెళ్లిపోయేందుకు ప్రయత్నించినా బలవంతంగా అడ్డుకున్నారు. చివరికి ఆమె ఓ వ్యక్తిని చెంప దెబ్బ కొట్టి అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఇందుకు సంబంధించి వీడియో వైరల్ అవటంతో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం