Kohli on Ahmedabad Test: నా డిఫెన్సే నా బలం.. అహ్మదాబాద్ టెస్టు ప్రదర్శనపై కోహ్లీ రియాక్షన్-virat kohli says my defense is my strongest point in ahmedabad test ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Virat Kohli Says My Defense Is My Strongest Point In Ahmedabad Test

Kohli on Ahmedabad Test: నా డిఫెన్సే నా బలం.. అహ్మదాబాద్ టెస్టు ప్రదర్శనపై కోహ్లీ రియాక్షన్

Maragani Govardhan HT Telugu
Mar 14, 2023 10:43 AM IST

Kohli on Ahmedabad Test: ఆస్ట్రేలియాతో జరిగిన అహ్మదాబాద్ టెస్టులో తన ప్రదర్శనపై విరాట్ కోహ్లీ స్పందించాడు. ఈ మ్యాచ్‌లో తన డిఫెన్సే తన స్ట్రాంగ్ పాయింట్ అని కోహ్లీ స్పష్టం చేశాడు. వీలైనంత వరకు ప్రశాంతంగా బ్యాటింగ్ చేశానని స్పష్టం చేశాడు.

విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ (AFP)

Kohli on Ahmedabad Test: టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ టెస్టుల్లో చాలా కాలం గ్యాప్ తర్వాత అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. మూడేళ్ల తర్వాత సుదీర్ఘ ఫార్మాట్‌లో సెంచరీ చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. 186 పరుగుల భారీ శతకంతో రాణించాడు. ఫలితంగా ఈ మ్యాచ్ డ్రాగా ముగిసి భారత్ 2-1తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. దీంతో కోహ్లీ ఆటతీరపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా ఈ ప్రదర్శనపై విరాట్ కోహ్లీ స్పందించాడు. ఈ ఇన్నింగ్స్‌లో డిఫెన్స్ తన బలమైన పాయింట్ అని స్పష్టం చేశాడు. బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో రాహుల్ ద్రవిడ్‌తో మాట్లాడిన కోహ్లీ ఈ వ్యాఖ్యలు చేశాడు.

"ఈ ఇన్నింగ్స్‌కు సంబంధించినంత వరకు ఈ మ్యాచ్‌కు ముందు కూడా నేను బాగా ఆడుతున్నానని నాకు తెలుసు. నిజం చెప్పాలంటే బ్యాటింగ్‌కు ఈ పిచ్ అనుకూలంగా ఉంది. అయితే ఆస్ట్రేలియా ఆటగాళ్లు దీన్ని బాగా వినియోగించుకున్నారు. ఈ మ్యాచ్‌లో నేను నా డిఫెన్స్‌నే నమ్ముకున్నాను. టెస్టు క్రికెట్‌లో ఎల్లప్పుడూ ఇదే విధానాన్ని ఫాలో అవుతాను. నేను బాగా డిఫెన్స్ చేస్తున్నప్పుడు అదే నా బలమైన పాయింట్. లూజ్ బాల్స్ వస్తున్నప్పుడు ఎక్కడ కొట్టాలో నాకు బాగా తెలుసు. వాటిని క్యాష్ చేసుకోగలను. అప్పుడే అవసరమైన పరుగులను రాబట్టగలను." అని కోహ్లీ స్పష్టం చేశాడు.

ఆస్ట్రేలియా బౌలర్లను స్థిరంగా బౌలింగ్ చేశారని, బౌండరీలు రాబట్టడం అంత సులభంగా జరగలేదని అన్నాడు. "నిజాయితీగా చెప్పాలంటే ఈ పిచ్‌పై బౌండరీలు రాబట్టడం అంత సులభంగా జరగలేదు. అంతేకాకుండా ఔట్ ఫీల్డ్ స్లోగా ఉంది, అలాగే బంతి కూడా మృదువుగా ఉండటంతో వాళ్లు స్థిరంగా బౌలింగ్ చేశారు. నన్ను ప్రశాంతంగా ఉంచిన ఒక్క విషయం ఏంటంటే సింగిల్స్, డబుల్స్ ఎక్కువగా తీయగలగడం. ఇలా చేయడం సంతోషంగా అనిపించింది. 4, 5 సెషన్లు బ్యాటింగ్ చేయగలననే ఉత్సాహాన్నిచ్చింది. ఇలాంటప్పుడే ఫిట్నెస్, ఫిజిక్ ప్రిపరేషన్ ఉపయోగపడుతుంది." అని విరాట్ స్పష్టం చేశాడు.

"నాలుగైదు సెషన్లు బ్యాటింగ్ చేయడానికి శారీరంకగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. నా వరకు బౌండరీ లేకుండా ఒక్కో సెషన్‌లో 30 పరుగులు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ విషయంలో కచ్చితంగా నిరాశ చెందట్లేదు. ఆరు సెషన్ల పాటు బ్యాటింగ్ చేసి 150కి పైగా పరుగులు సాధించాను" విరాట్ అన్నాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే 2-1 తేడాతో ఆధిక్యంలో ఉన్న భారత్ సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా వరుసగా నాలుగో సారి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకుంది టీమిండియా. మార్చి 17 నుంచి ఆసీస్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది టీమిండియా.

WhatsApp channel