Telugu News  /  Entertainment  /  Vijayendra Prasad Says Mahesh And Rajamouli Movie Could Have Sequel In Future
రాజమౌళి
రాజమౌళి

Rajamouli Focus on Sequels: సీక్వెల్స్ వెంట పడుతున్న జక్కన్న.. ఆర్ఆర్ఆర్ కాకుండా మరో చిత్రానికి కూడా కొనసాగింపు..!

01 January 2023, 17:10 ISTMaragani Govardhan
01 January 2023, 17:10 IST

Rajamouli Focus on Sequels: దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి సీక్వెల్స్ వెంట పడుతున్నారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ చిత్రానికి సీక్వెల్‌ ఉంటుందని ప్రకటించిన ఆయన.. మరో చిత్రానికి కూడా సీక్వెల్ తీయనున్నారని సమాచారం. మహేష్‌తో తీయనున్న చిత్రం ఫ్రాంఛైజీగా మారుతుందని రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఇటీవల అన్నారు.

Rajamouli Focus on Sequels: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి నుంచి సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. ఆయన నుంచి వచ్చే సినిమాలు కాస్త ఆలస్యమైనా.. విజయం మాత్రం పక్కా అనేంతగా ఆకట్టుకుంటాయి. అంతేకాకుండా అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. గతేడాది ఆర్ఆర్ఆర్ చిత్రంతో సూపర్ సక్సెస్ అందుకున్న మన జక్కన్న ప్రస్తుతం మహేష్ బాబుతో తీయబోయే సినిమా స్క్రిప్టుపై దృష్టిపెట్టారు. దీంతో పాటు ఆర్ఆర్ఆర్‌కు సీక్వెల్ కూడా తీస్తానని ప్రకటించారు. తాజాగా రాజమౌళి సన్నిహిత వర్గాల నుంచి మరో సరికొత్త అప్డేట్ వినిపిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

తండ్రి వీవీ విజయేంద్రప్రసాదే రాజమౌళి ప్రతి సినిమాకు రచయిత అనే విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో తీయబోయే సినిమాకు సంబధించిన స్క్రిప్టు పనుల్లో ఉన్నారు. దాదాపు ఈ స్క్రిప్ట్ వర్క్ ముగింపు దశకు వచ్చినట్లు ఆయన ఇటీవల తెలిపిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ ఇచ్చారు. మహేష్‌తో సినిమాను ఫ్రాంఛైజీ రూపంలో తీసుకొచ్చే ప్లాన్‌లో ఉన్నట్లు చెప్పారు. అంటే ఈ సినిమాలు పలు కొనసాగింపులు ఉంటాయని స్పష్టం చేశారు. హాలీవుడ్ సిరీస్ ఇండియానా జోన్స్ మాదిరిగా.. ప్రతి చిత్రంలో హీరో కామన్‌గా ఉంటాడు.. కానీ కథ, ఇతర నటీనటులు మారతారని తెలిపారు.

మహేష్‌ బాబుతో మన జక్కన్న జంగ్లీ అడ్వెంచర్ సిరీస్ తీయనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని ఇండియానా జోన్స్ స్టైల్‌లో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకు కూడా సీక్వెల్స్ ఉంటాయని వీవీ విజయేంద్ర ప్రసాద్ ఇటీవల ఇంటర్వ్యూలో అన్నారు. ఇప్పటికే బాహుబలిని రెండు భాగాలుగా తీసిన జక్కన్న..ఆర్ఆర్ఆర్ చిత్రానికి కూడా సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. ఇది కాకుండా ఈగ మూవీకి కూడా రెండో భాగం ఉంటుందని పలుమార్లు హింట్ ఇచ్చారు. దీంతో మన దర్శక ధీరుడు తన తీసిన చిత్రాలకు సీక్వెల్స్ తీసే పనిలో పడ్డాడని అభిమానులు అనుకుంటున్నారు.

గతేడాది జూనియర్ ఎన్‌టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను అలరించింది. భారత్‌లోనే కాకుండా ఇతర దేశాల ప్రజలు కూడా ఈ సినిమాపై విపరీతంగా ప్రేమను కురిపిస్తున్నారు. దీంతో ఆస్కార్ తప్పకుండా గెలుస్తుందని అంచనాలు వేసుకుంటున్నారు. ఇప్పటికే విశ్వవేదికపై పలు అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది ఆర్ఆర్ఆర్.