SS Rajamouli on Bollywood: బాలీవుడ్‌ సినిమాలు ఎందుకు బోల్తా పడుతున్నాయో చెప్పిన రాజమౌళి-ss rajamouli on bollywood says after corporates entered the industry the hunger for success down
Telugu News  /  Entertainment  /  Ss Rajamouli On Bollywood Says After Corporates Entered The Industry The Hunger For Success Down
రాజమౌళి
రాజమౌళి

SS Rajamouli on Bollywood: బాలీవుడ్‌ సినిమాలు ఎందుకు బోల్తా పడుతున్నాయో చెప్పిన రాజమౌళి

13 December 2022, 22:30 ISTHT Telugu Desk
13 December 2022, 22:30 IST

SS Rajamouli on Bollywood: బాలీవుడ్‌ సినిమాలు ఎందుకు బోల్తా పడుతున్నాయో చెప్పాడు దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి. అంతేకాదు ఓ పాపులర్‌ సినిమాను తీయడానికి ఏం చేయాలో కూడా వెల్లడించాడు.

SS Rajamouli on Bollywood: ఒకప్పుడు ఇండియన్‌ సినిమా అంటే బాలీవుడ్‌ అన్నట్లుగా హిందీ సినిమా దూసుకెళ్లింది. కానీ కొన్నేళ్లుగా అక్కడి సినిమాలు దారుణంగా బోల్తా కొడుతున్నాడు. అదే సమయంలో తెలుగు, తమిళం, కన్నడల నుంచి వచ్చిన సినిమాలు సంచలనం సృష్టిస్తున్నాయి. 2022లోనే ఆర్ఆర్ఆర్‌, కేజీఎఫ్‌ 2, విక్రమ్‌, కాంతారాలాంటి సినిమాలు నార్త్‌లోనూ దుమ్ము రేపాయి.

ఈ నేపథ్యంలో అసలు హిందీ సినిమా ఎందుకు వరుస వైఫల్యాలు చవి చూస్తోందో చెప్పాడు దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి. తాజా ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. ప్రేక్షకులతో కనెక్ట్‌ కావడమే ముఖ్యమైన విషయమని అన్నాడు. హిందీ ఫిల్మ్‌ ఇండస్ట్రీలోకి కార్పొరేట్లు రావడం, వాళ్లు నటులు, దర్శకులకు భారీ మొత్తాలు ఇవ్వడం వల్లే సక్సెస్‌ సాధించాలన్న తపన లేకుండా పోతోందని అభిప్రాయపడ్డాడు.

అదే సౌత్‌లో మాత్రం ఈ పరిస్థితి లేదని, అక్కడ ఈదాలి లేదంటే మునగాలి అన్నట్లుగా ఉంటుందని రాజమౌళి చెప్పాడు. సౌత్‌ సినిమా ఇప్పుడు బాగా ఆడుతోందని, ఇలాంటి సమయంలో ఉదాసీనంగా ఉండకూడదని కూడా స్పష్టం చేశాడు. ఫిల్మ్ కంపానియన్‌తో మాట్లాడుతూ.. రాజమౌళి కీలకమైన విషయాలు పంచుకున్నాడు.

"సీక్రెట్‌ ఫార్ములాలు ఉంటాయని నేను అనుకోను. రెండు విషయాలు మాత్రం చెప్పగలను. ఒకటి ఆడియెన్స్‌ కనెక్ట్‌ కావాలి. రెండు మరీ అంత సుఖంగా కూడా ఉండకూడదు. మరీ సుఖంగా, సౌకర్యవంతంగా ఉన్నారంటే ఉదాసీనత వచ్చేస్తుంది. అనౌన్స్‌మెంట్ సమయంలో మన సినిమా మంచి బిజినెస్‌ చేస్తుంటే.. సహజంగానే ఓ ఆత్మసంతృప్తి కలుగుతుంది" అని రాజమౌళి అన్నాడు.

"హిందీ సినిమాలోకి కార్పొరేట్లు అడుగుపెట్టి నటులు, దర్శకులకు భారీ మొత్తాలు ఇవ్వడం ప్రారంభమైన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ నేను సక్సెస్‌ కావాలి అన్న తపన కాస్త తగ్గినట్లు కనిపిస్తోంది. సౌత్‌లో ఈ పరిస్థితి లేదు. కచ్చితంగా ఈదాల్సిందే లేదంటే మునిగిపోతారు.

ఇప్పుడు ఇక్కడికి ఇది షిఫ్ట్‌ అయింది. ఇలాంటి సమయంలో ఉదాసీనంగా ఉండకూడదు. మనకు మంచి బిజినెస్‌ వస్తోంది. ఇలాంటి సమయంలో ఉదాసీనంగా ఉంటే సక్సెస్‌ సాధించాలన్న ఆకలి తగ్గిపోతుంది. ఆడియెన్స్‌తో కనెక్ట్‌ కావాలంటే వాళ్లు ఏం కోరుకుంటున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. ఇదే అన్నింటి కన్నా ముఖ్యం" అని రాజమౌళి అన్నాడు.