SS Rajamouli on RRR: నమ్మశక్యంగా లేదు.. ఆర్‌ఆర్‌ఆర్‌ను ఆపేవారే లేరనిపిస్తోంది: రాజమౌళి-ss rajamouli on rrr says its unbelievable and unstoppable ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ss Rajamouli On Rrr: నమ్మశక్యంగా లేదు.. ఆర్‌ఆర్‌ఆర్‌ను ఆపేవారే లేరనిపిస్తోంది: రాజమౌళి

SS Rajamouli on RRR: నమ్మశక్యంగా లేదు.. ఆర్‌ఆర్‌ఆర్‌ను ఆపేవారే లేరనిపిస్తోంది: రాజమౌళి

HT Telugu Desk HT Telugu
Dec 02, 2022 10:39 AM IST

SS Rajamouli on RRR: నమ్మశక్యంగా లేదని, చూస్తుంటే ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీని ఆపడం అసాధ్యమనిపిస్తోందని అన్నాడు దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి. స్క్రీన్‌ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి ఈ కామెంట్స్ చేశాడు.

ఆర్ఆర్ఆర్ మూవీ మెగా సక్సెస్ పై ఆశ్చర్యం వ్యక్తం చేసిన రాజమౌళి
ఆర్ఆర్ఆర్ మూవీ మెగా సక్సెస్ పై ఆశ్చర్యం వ్యక్తం చేసిన రాజమౌళి

SS Rajamouli on RRR: ఒకప్పుడు సినిమాలు వంద, రెండు వందల రోజుల పండుగ జరుపుకునేవి. కానీ ఈ కాలంలో వారం, రెండు వారాల కలెక్షన్లు చూసి తర్వాత మరుగున పడిపోతున్నాయి. కానీ ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ అలా కాదు. ఆ మూవీ అప్పుడెప్పుడో మార్చి 25న రిలీజైంది. ఇప్పటికే ఈ మూవీ క్రేజ్‌ ఏమాత్రం తగ్గడం లేదు. పాన్ ఇండియా లెవల్లో దుమ్ము రేపి ఇప్పుడు వివిధ ప్రపంచ దేశాల్లో దూసుకెళ్తోంది.

అమెరికా, జపాన్‌లాంటి దేశాల్లోనూ బాక్సాఫీస్‌ రికార్డులను తిరగరాస్తోంది. ఈ సినిమాను ఎలాగైనా ఆస్కార్స్‌ వేదికపైకి తీసుకెళ్లాలని గట్టిగా ప్రయత్నిస్తున్న మూవీ డైరెక్టర్‌ ఎస్‌ఎస్‌ రాజమౌళి భారీ ఎత్తున ప్రమోషన్లు నిర్వహిస్తున్నాడు. ఈ మధ్యే స్క్రీన్‌ డైలీకి ఇంటర్వ్యూ ఇస్తూ ఆర్‌ఆర్ఆర్‌ సృష్టిస్తున్న ప్రభంజనంపై రాజమౌళి స్పందించాడు.

అసలు ఈ సినిమా సక్సెస్‌ నమ్మశక్యంగా లేదని, చూస్తుంటే ఆర్‌ఆర్ఆర్‌ను ఆపడం అసాధ్యంగా కనిపిస్తోందని అతడు అనడం గమనార్హం. ఈ మూవీలో రామ్‌భీమ్‌గా రామ్‌చరణ్‌, జూనియర్ ఎన్టీఆర్‌ నటించిన విషయం తెలిసిందే. సినిమాలో హై టెక్నికల్‌ స్టాండర్డ్స్‌కు తోడు ఈ ఇద్దరి నటనకు కూడా ప్రేక్షక లోకం బ్రహ్మరథం పట్టింది. ఇండియాలో హయ్యెస్ట్ గ్రాసింగ్‌ మూవీస్‌లో ఒకటిగా నిలిపింది.

ఈ మెగా సక్సెస్‌పై స్క్రీన్‌ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి స్పందించాడు. "ఇది నమ్మశక్యంగా లేదు. మామూలుగా సినిమా రిలీజ్‌ చేస్తే ఓ నెల రోజుల్లో అంతా ముగిసిపోతుంది. కానీ ఆర్‌ఆర్ఆర్ భిన్నమైనది. దీనిని ఆపడం అసాధ్యంగా కనిపిస్తోంది" అని అన్నాడు. అంతేకాదు విదేశాల్లోనూ ఈ సినిమాను అంతలా ఎందుకు ఆదరిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పాడు.

"ఆర్‌ఆర్‌ఆర్‌ను పాశ్చాత్య దేశాల వాళ్లు అంతలా ఎందుకు ఇష్టపడుతున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నా. సోషల్‌ మీడియాలో నేను చదివిన దాని ప్రకారం.. ఇందులోని తలవంచని హీరోయిజం, ఇక యాక్షన్‌ నుంచి రొమాన్స్‌, కామెడీ, డ్యాన్స్‌ ఇలా ఊహించని రీతిలో మలుపులు తిరగడం వాళ్లకు బాగా నచ్చాయట. కానీ ఇండియాలో మేము స్టోరీస్‌ ఇలాగే చెబుతాం. ప్రతి ఒక్కరికీ ఏదో ఒకటి ఉంటుంది" అని రాజమౌళి అన్నాడు.

లాస్‌ ఏంజిల్స్‌లోని టీసీఎల్ చైనీస్‌ థియేటర్‌లో ఈ సినిమాను ప్రదర్శించగా.. అందులోని 932 టికెట్లు కేవలం 20 నిమిషాల్లో అమ్ముడైపోయాయి. సినిమా ముగిసిన తర్వాత కూడా రాజమౌళికి అక్కడి వాళ్లు స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇచ్చారు. ఒక్క షో నుంచే 21 వేల డాలర్లు రావడం విశేషం. ఈ మధ్య కాలంలో హాలీవుడ్‌ ప్రముఖులైన డానీ డెవిటో, ఎడ్గార్‌ రైట్‌, రూసో బ్రదర్స్‌, జేమ్స్‌ గన్‌, స్కాట్‌ డెరిక్‌సన్‌లాంటి వాళ్లు కూడా ఆర్‌ఆర్ఆర్‌పై ప్రశంసలు కురిపించారు.

IPL_Entry_Point