Kangana on Kantara: కాంతారాను ఆస్కార్స్‌కు పంపించాలి.. హ్యాట్సాఫ్‌ రిషబ్‌శెట్టి: కంగనా-kangana on kantara says this film should be indias oscar entry ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Kangana On Kantara Says This Film Should Be Indias Oscar Entry

Kangana on Kantara: కాంతారాను ఆస్కార్స్‌కు పంపించాలి.. హ్యాట్సాఫ్‌ రిషబ్‌శెట్టి: కంగనా

HT Telugu Desk HT Telugu
Oct 21, 2022 12:27 PM IST

Kangana on Kantara: కాంతారాను ఆస్కార్స్‌కు పంపించాలని, హ్యాట్సాఫ్‌ రిషబ్‌శెట్టి అంటూ బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ చేసిన కామెంట్స్‌ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. ఈ మూవీకి మరో సెలబ్రిటీ ఫిదా అయిపోయినట్లు ఆమె తాజా పోస్ట్‌తో స్పష్టమవుతోంది.

కాంతారా మూవీకి ఫిదా అయిపోయిన కంగనా రనౌత్
కాంతారా మూవీకి ఫిదా అయిపోయిన కంగనా రనౌత్

Kangana on Kantara: కాంతారా అభిమానుల జాబితాలో మరో సెలబ్రిటీ చేరిపోయింది. తాజాగా ఈ సినిమా చూసిన బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్.. ఈ మూవీని ఏకంగా ఇండియా తరఫున ఆస్కార్స్‌కు పంపించాలని అనడం విశేషం. అంతర్జాతీయ వేదికపై ఇండియాకు సరైన ప్రాతినిధ్యం ఉండాలని, దానికి కాంతారానే సరైన సినిమా అని ఆమె అంటోంది.

ఈ సినిమాను ప్రపంచమంతా కచ్చితంగా చూడాలని కంగనా అభిప్రాయపడింది. అంతేకాదు ఈ సినిమాను తీసిన రిషబ్‌ శెట్టిపైనా ప్రశంసలు కురిపించింది. హ్యాట్సాఫ్‌ రిషబ్‌శెట్టి అని కంగనా తన సోషల్‌ మీడియా పోస్ట్‌లో చెప్పింది. గురువారం (అక్టోబర్‌ 20) ఈ సినిమాను చూసిన ఆమె.. థియేటర్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా శరీరం కంపిస్తూనే ఉన్నదని చెప్పింది.

ఇక శుక్రవారం తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఈ మూవీని ఆస్కార్స్‌కు పంపించాలని డిమాండ్‌ చేసింది. "వచ్చే ఏడాది ఆస్కార్స్‌కు ఇండియా నుంచి కాంతారాను పంపించాలని భావిస్తున్నాను. ఈ ఏడాది ముగుస్తోంది. ఇంకా మరిన్ని మంచి సినిమాలు వస్తున్నాయి. అయితే ఆస్కార్‌ కంటే కూడా అంతర్జాతీయంగా ఇండియాకు సరైన ప్రాతినిధ్యం ఉండాలి. ఈ రహస్యాలు, మార్మిక నేలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇండియా ఒక అద్భుతం. ఆ అద్భుతానికి తలొగ్గితే మీరు అందులో భాగమవుతారు. కాంతారా ఒక ప్రయోగాత్మక వాస్తవం. దానిని ప్రపంచమంతా చూడాలి" అని కంగనా రాసింది.

ఈ సినిమాను గురువారం చూసిన తర్వాత కూడా ఆమె చేసిన పోస్ట్‌ వైరల్ అయింది. ఓ సెల్ఫీ వీడియోలో ఆ మూవీ రివ్యూను చెప్పిందామె. "నా కుటుంబంతో కలిసి ఇప్పుడే కాంతారా చూసి వస్తున్నాను. కానీ ఇప్పటికీ నా శరీరం కంపిస్తోంది. ఇదో గొప్ప అనుభూతి. రిషబ్‌ శెట్టి.. నీకు హ్యాట్సాఫ్‌. రైటింగ్‌, డైరెక్టింగ్‌, యాక్టింగ్ అద్భుతం. నమ్మశక్యం కాకుండా ఉంది" అని ఆ రివ్యూలో కంగనా చెప్పింది.

"ఈ సినిమా సంస్కృతి, జానపద సాహిత్యం, స్థానిక అంశాల కలబోత. అందమైన ఫొటోగ్రఫీ, నటన బాగుంది. సినిమా అంటే ఇదీ. ఇలాంటిది గతంలో ఎప్పుడూ చూడలేదని థియేటర్‌లో చాలా మంది అనుకోవడం విన్నాను. ఈ సినిమా అందించినందుకు కృతజ్ఞతలు. మరో వారం రోజుల పాటు ఈ అనుభూతి నుంచి నేను బయటపడలేను" అని కూడా కంగనా చెప్పింది.

కన్నడలో రిలీజై సంచలన విజయం సాధించిన కాంతారా మూవీని ఇప్పటికే హిందీ, తెలుగు, తమిళంలోనూ రిలీజ్‌ చేశారు. ఆ భాషల్లోనూ కాంతారా అద్భుత విజయం సాధించింది. బాక్సాఫీస్‌ దగ్గర దూసుకెళ్తున్న ఈ సినిమా రూ.200 కోట్ల వైపు వెళ్తోంది. అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ సినిమాల్లో కేజీఎఫ్ 2, కేజీఎఫ్‌ తర్వాత మూడోస్థానంలో నిలిచింది.

కాంతారా మూవీ గురించి కంగనా తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో రాసిన పోస్ట్
కాంతారా మూవీ గురించి కంగనా తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో రాసిన పోస్ట్
IPL_Entry_Point