Pawan Kalyan on Aha: బాలయ్యతో పవర్ స్టార్.. ఎపిసోడ్‌లన్నింటికీ బాప్.. ఫస్ట్ గ్లింప్స్ విడుదల
Pawan Kalyan on Aha: అన్‌స్టాపబుల్ షోలో బాలయ్యతో పవర్‌స్టార్ కలిసి సందడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. త్వరలోనే ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.
Pawan Kalyan on Aha: అన్‌స్టాపబుల్ సిరీస్‌తో నందమూరి బాలకృష్ణ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఎంతలా మునుపెన్నడు లేని విధంగా ఆయన నటించిన తాజా చిత్రానికి ఓపెనింగ్స్ భారీగా రావడానికి ఈ క్రేజే నిదర్శనం. ప్రస్తుతం అన్‌స్టాపబుల్ సీజన్ 2 దిగ్విజయంగా నడుస్తోంది. ఇప్పటికే బాహుబలి ఎపిసోడ్‌తో అమాంతం క్రేజ్ పెంచేసుకున్న మన బాలయ్య.. తాజాగా మరో క్రేజీ సెలబ్రెటీని ఇంటర్వ్యూ చేశారు. అదెవరో కాదు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్. ఈ ఎపిసోడ్ కోసం అభిమానులే కాకుండ సగటు ప్రేక్షకులు కూడా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ఫొటోలు, పోస్టర్లు విడుదల కాగా.. తాజాగా గ్లింప్స్ విడుదల చేసింది ఆహా టీమ్.
ట్రెండింగ్ వార్తలు
పవర్ స్టార్‌ను బాలయ్య ఎలాంటి ప్రశ్నలు అడుగబోతున్నారు? పవన్ ఎలా రియాక్ట్ కాబోతున్నారు? అసలు వీరి మధ్య సంభాషణలు ఎలా సాగుతాయి? లాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానమిచ్చింది ఆహా టీమ్. ఇందులో భాగంగా ఈ ఎపిసోడ్ మొదటి గ్లింప్స్‌ను విడుదల చేసింది. అన్ని ఎపిసోడ్‌లకు ఇది బాప్ అంటూ క్యాప్షన్‌ను జోడించింది. ఈ వీడియోలో పవన్-బాలయ్య ఇద్దరూ ఒకే వేదికపై ఉండటం చూస్తే ఎంతో సరదాగా, కన్నుల పండుగవలే ఉంది.
వీడియో ప్రారంభంలోనే తనను బాల అని పిలవాలని బాలకృష్ణ కోరగా.. మరోసారి ఓడిపోవడానికి సిద్ధం కానీ అలా మాత్రం పిలవనంటూ పవన్ నవ్వులు చిందించారు. దీంతో ఈ పాలిటిక్సే వద్దు అంటూ చలోక్తి విసిరారు బాలయ్య. అలాగే మీ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి నుంచి నేర్చుకున్నవి ఏంటి? వద్దనుకున్నవి ఏంటి? అని ప్రశ్నించారు. ఈ రెండు రాష్ట్రాల్లో నీకు అభిమానికి కానివారంటూ లేరు.. అలాంటి అభిమానం ఓట్లుగా ఎందుకు కన్వర్ట్ కాలేదనుకుంటున్నారు? అని ప్రశ్నించారు. ఇవి కాకుండా మరికొన్ని రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలను కూడా సంధించిటన్లు తెలుస్తోంది.
దీంతో బాలయ్య ప్రశ్నల ప్రవాహం చూస్తుంటే ఎపిసోడ్ మరింత ఆసక్తి కలిగించేలా ఉంది. దీంతో ఎప్పుడెప్పుడు ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుందా? అని అభిమానులు ఆత్రుతగా చూస్తున్నారు. త్వరలోనే ఈ ఎపిసోడ్ ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది.
సంబంధిత కథనం