Manjummel Boys OTT: అఫీషియల్ - మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే - రెండు రోజులు ఆలస్యంగా స్ట్రీమింగ్
Manjummel Boys OTT: మలయాళం బ్లాక్‌బస్టర్ మూవీ మంజుమ్మల్ బాయ్స్ ఎట్టకేలకు ఓ టీటీలోకి వస్తోంది. మే 5న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఐదు భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.
Manjummel Boys OTT: మలయాళం బ్లాక్‌బస్టర్ మూవీ మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ శనివారం అఫీషియల్‌గా అనౌన్స్‌చేసింది. మే 5 నుంచి ఈ మూవీ ఓ టీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో మంజుమ్మల్ బాయ్స్‌ను రిలీజ్ చేస్తున్నట్లు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రకటించింది.
మూడు కాదు ఐదు...
మంజుమ్మల్ బాయ్స్ మూవీ మే 3న ఓటీటీలో రిలీజ్ అవుతుందని ప్రచారం జరిగింది. అయితే మే 3న కాకుండా రెండు రోజులు ఆలస్యంగా మే 5న ఈ సర్వైవల్ మూవీ ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది.
స్టార్లు ఎవరూ లేరు...
మలయాళంలో స్టార్లు ఎవరూ లేకుండా కేవలం 20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన మంజుమ్మల్ బాయ్స్ మూవీ 230 కోట్లకుపైగా కలెక్షన్స్ సొంతం చేసుకున్నది. కలెక్షన్స్ పరంగా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఈ ఏడాది మలయాళంలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది.
అంతే కాకుండా మలయాళ సినీ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా మంజుమ్మల్ బాయ్స్ సరికొత్త రికార్డ్‌ను నెలకొల్పింది. గతంలో 2018 పేరు మీద ఈ రికార్డ్ ఉండేది. ఈ మూవీ రికార్డ్‌ను మంజుమ్మల్ బాయ్స్ అధిగమించింది. మంజుమ్మల్ బాయ్స్ మూవీలో సౌబీన్ షాహిర్, శ్రీనాథ్ భాసీ, బాలు వర్గీస్, దీపక్ పరంబోల్‌తో పాలు పలువురు కొత్త నటీనటులు కీలక పాత్రలు పోషించారు. చిదంబర్ దర్శకత్వం వహించాడు.
మంజుమ్మల్ బాయ్స్ కథ...
కొచ్చికి చెందిన కుట్టన్ (షౌబిన్ షాహిర్), సుభాష్ (శ్రీనాథ్ భాషి) తో పాటు అతడి ఫ్రెండ్స్ అందరూ చిన్నచితకా ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాల్ని పోషించుకుంటుంటారు.మంజుమ్మల్ బాయ్స్ పేరుతో ఓ అసోసియేషన్ ఏర్పాటుచేస్తారు.
మంజుమ్మల్ బ్యాచ్ అందరూ కలిసి కొడైకెనాల్ ట్రిప్‌కు వెళ్తారు. ఆ ట్రిప్‌కు సుభాష్ రానని అంటాడు.కానీ కుట్టన్ బలవంతంగా అతడిని తీసుకెళతాడు. గుణ కేవ్ చూడటానికి స్నేహితులందరూ వెళతారు. గుణకేవ్‌లో వందల అడుగుల లోతైన లోయలు ఉంటాయి. ఆ లోయల్లో పడ్డవాళ్లెవ్వరూ ప్రాణాలతో బయటపడ్డదాఖలాలు లేవు.
అనుకోకుండా సుభాష్ ఓ ఇరుకైన లోయలోకి జారిపడతాడు.ఆ ప్రమాదం నుంచి సుభాష్ ప్రాణాలతో బయటపడ్డాడా? అతడిని కుట్టన్ ఎలా సేవ్ చేశాడు? తమ స్నేహితుడి ప్రాణాలను కాపాడటం కోసం మంజుమ్మల్ బాయ్స్ ఎలాంటి సాహసం చేశారు? అన్నదే ఈ మూవీ కథ.
ఈ సినిమా కథ మొత్తం కమల్‌హాసన్ సూపర్‌హిట్ మూవీ గుణలో వాడిన లొకేషన్ చుట్టూ తిరుగుతుంది. మంజుమ్మల్ బాయ్స్ కథతో పాటు బీజీఎమ్, లొకేషన్స్, డైరెక్షన్ బాగున్నాయంటూ ప్రశంసలు లభించాయి. ప్రధానపాత్రధారుల నటన సహజంగా సాగిందంటూ అభిమానులు మెచ్చుకున్నారు.
తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్...
మంజుమ్మల్ బాయ్స్ సినిమాను తెలుగులోకి మైత్రీ మూవీ మేకర్స్ డబ్ చేసి రిలీజ్ చేసింది. తెలుగులో కూడా 12 కోట్లకుపైగా ఈ మూవీ వసూళ్లను రాబట్టింది.మంజుమ్మల్ బాయ్స్‌లో కీలక పాత్రలో నటిస్తూనే ఈ మూవీకి ఓ ప్రొడ్యూసర్‌గా సౌబీన్ షాహిర్ వ్యవహరించాడు.
టాపిక్