Dunki Day 33 Days Collections: ఎట్టకేలకు టైగర్-3ని దాటేసిన షారుఖ్ ఖాన్ ‘డంకీ’.. 33 రోజుల్లో ఎన్ని కోట్లంటే..
Dunki Day 33 Days Collections: షారుక్ ఖాన్ సినిమా డంకీ.. ఎట్టకేలకు సల్మాన్ ఖాన్ మూవీ టైగర్-3 లైఫ్ టైమ్ కలెక్షన్లను దాటింది. డంకీ మూవీ ఉత్తరాదిలో ఇంకా వసూళ్లను రాబడుతోంది.

Dunki Day 33 Days Collections: బాలీవుడ్ బాద్‍షా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన డంకీ సినిమా థియేట్రికల్ రన్ నెమ్మదిగా ఇంకా కొనసాగుతోంది. స్టార్ డైరెక్టర్ రాజ్‍కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ఈ కామెడీ ఎమోషనల్ మూవీ గత డిసెంబర్ 21వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. మిక్స్డ్ టాక్ రావడం, ప్రభాస్ మూవీ సలార్ పోటీలో ఉండటంతో డంకీకి అనుకున్న స్థాయిలో వసూళ్లు రాలేదు. అయితే, బాలీవుడ్‍లో కొత్త మూవీస్ పెద్దగా రాకపోయే సరికి డంకీ మూవీకి వసూళ్లు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో డంకీ కలెక్షన్లపై మూవీ టీమ్ అప్‍డేట్ ఇచ్చింది.
డంకీ సినిమా 33 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.470.60 కోట్ల కలెక్షన్లను దక్కించుకుంది. ఈ విషయాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్ అధికారికంగా వెల్లడించింది. అందరి హృదయాల్లో డంకీ జర్నీకి ప్రత్యేకమైన స్థానం ఉందని ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పింది.
టైగర్-3ని దాటిన డంకీ
సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ టైగర్-3 సినిమా గతేడాది నవంబర్‌లో రిలీజ్ కాగా.. మొత్తంగా ఈ చిత్రం రూ.466 కోట్ల కలెక్షన్లను దక్కించుకుంది. ఇప్పుడు టైగర్-3 లైఫ్ టైమ్ కలెక్షన్లను డంకీ సినిమా దాటేసింది. మిక్స్డ్ టాక్ వచ్చినా షారుఖ్ స్టార్ డమ్‍తో డంకీ మోస్తరు కలెక్షన్లను దక్కించుకుంది.
డంకీ సినిమాలో తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, బొమ్మన్ ఇరానీ, విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్, జ్యోతీ సుభాష్, దేవెన్ భోజనీ, మనోజ్ కాంత్ కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి ప్రీతమ్, అమన్ పంత్ సంగీతం అందించారు. జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‍మెంట్స్, రాజ్‍కుమార్ హిరానీ ఫిల్మ్స్ పతాకాలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి.
షారుఖ్ ఖాన్ గతేడాది నటించిన పఠాన్, జవాన్ సినిమాలు చెరో రూ.1,000 కోట్లకు పైగా కలెక్షన్లను దక్కించుకున్నాయి. దీంతో డంకీ కూడా అదే రేంజ్ అంచనాలతో వచ్చింది. అయితే, మిశ్రమ స్పందన రావడంతో అనుకున్న విధంగా వసూళ్లను రాబట్టలేకపోయింది. ఈ మూవీ రిలీజైన తర్వాతి రోజే సలార్ సినిమా రావడం, దీనికి మంచి టాక్ రావడంతో డంకీపై తీవ్ర ప్రభావం పడింది. అలాగే, డంకీ యాక్షన్ కాకుండా కామెడీ ప్రధానంగా రావడం వల్ల కూడా వసూళ్లను అనుకున్న స్థాయిలో దక్కించుకోలేకపోయింది.
డంకీ కథ ఇదీ
నలుగురు స్నేహితులు విదేశాలకు వెళ్లాలని భావించడం చుట్టూ డంకీ మూవీ కథ తిరుగుతుంది. పంజాబ్‍లోని లల్టు ప్రాంతంలో ఉండే మనూ (తాప్సీ), బాలి (అనిల్ గ్రోవర్), సుఖి (విక్కీ కౌశల్), బుగ్గు లోఖ్‍న్‍పాల్ (విక్రమ్ కొచ్చర్) లండన్‍కు వెళ్లాలని నిశ్చయించుకుంటారు. అయితే, ఇందుకోసం ఇంగ్లిష్ నేర్చుకొని ఓ టెస్ట్ పాసవ్వాల్సి ఉంటుంది. అయితే, వారు ఇంగ్లిష్ నేర్చుకోలేకపోతారు. దీంతో మాజీ సైనికుడు హార్డీ (షారుఖ్ ఖాన్) వారికి సాయం చేస్తాడు. డంకీ పద్ధతిలో అక్రమంగా దేశాల సరిహద్దు దాటేందుకు సహకరిస్తాడు. లండన్‍కు వెళ్లే క్రమంలో వారు ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి.. మొత్తానికి గమ్యానికి చేరారా.. ఆ నలుగురికి హార్డీ ఎందుకు సహకరించాడన్నదే డంకీ మూవీ ప్రధాన కథగా ఉంది.