YS Avinash Reddy : విచారణకు గడువు కోరిన అవినాష్ రెడ్డి….-ysrcp mp avinash reddy requests cbi for five days exemption to enquiry in viveka murder case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ysrcp Mp Avinash Reddy Requests Cbi For Five Days Exemption To Enquiry In Viveka Murder Case

YS Avinash Reddy : విచారణకు గడువు కోరిన అవినాష్ రెడ్డి….

HT Telugu Desk HT Telugu
Jan 24, 2023 08:52 AM IST

YS Avinash Reddy సిబిఐ విచారణకు హాజరు కావడానికి ఎంపీ అవినాష్ రెడ్డి గడువు కోరారు. ముందస్తు కార్యక్రమాలు ఉండటంతో విచారణకు హాజరు కాలేనని ఐదు రోజుల గడువు కావాలని సిబిఐను కోరారు. ఎంపీ అవినాష్ రెడ్డి విజ్ఞప్తిపై సిబిఐ నుంచి స్పందన రాలేదు. వివేకా హత్య కేసులో సిబిఐ దర్యాప్తు వేగవంతం చేయడంతో ఏ క్షణాన ఏమి జరుగుతుందోననే ఉత్కంఠ అందరిలో నెలకొంది.

వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్‌కు సిబిఐ నోటీసులు
వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్‌కు సిబిఐ నోటీసులు (HT_PRINT)

YS Avinash Reddy వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణకు హాజరు కావాలని సిబిఐ జారీ చేసిన నోటీసులకు హాజరు కావడానికి గడువు కావాలని ఎంపీ అవినాష్ రెడ్డి కోరారు. హైదరాబాద్‌ సిబిఐ కార్యాలయంలో మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని సిబిఐ నోటీసుల్లో పేర్కొన్నారు. అవినాష్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డికి సిబిఐ అధికారులు నోటీసులు అందచేశారు. అవినాష్‌ రెడ్డికి తొలిసారి నోటీసులు జారీ చేయడంతో కేసు దర్యాప్తులో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. రెండున్నరేళ్లుగా కేసు దర్యాప్తు జరుగుతున్నా సిబిఐ అవినాష్‌ను తొలిసారి ప్రశ్నించాలని నిర్ణయించడం సంచలన పరిణామంగా భావిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

ముఖ్యమంత్రి బాబాయి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి కుటుంబ సభ్యుల ప్రమేయంపై ఆరోపణలు ఉన్నాయి. సిబిఐకు అప్రూవర్‌గా మారిన దస్తగిరి సంచలన ఆరోపణలు చేయడంతో కేసు దర్యాప్తు సంక్లిష్టంగా మారింది. 2019 మార్చి 15న హత్య జరిగినా ఇప్పటి వరకు కేసు దర్యాప్తులో ఎలాంటి ముందడుగు పడలేదు. రకరకాల పరిణామాల నేపథ్యంలో కేసు ఒక అడుగు ముందుకు వేస్తే నాలుగడుగులు వెనక్కి పడుతోంది.

సిబిఐ విచారణలో భాగంగా పులివెందులలోని ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి నివాసానికి సిబిఐ బృందం వెళ్లింది. భాస్కర్ రెడ్డి ఇంట్లో లేకపోవడంతో పార్టీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ్నుంచి భాస్కర్‌ రెడ్డి వెళ్లిపోవడంతో ఆయన కోసం అధికారులు చాలా సేపు వేచి చూశారు. సిబిఐ అధికారుల వద్దకు అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి వచ్చి మాట్లాడిన తర్వాత నోటీసులు అతనికి అందచేశారు.ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడు దేవిరెడ్డి శంకర్‌ రెడ్డి, వివేకానంద రెడ్డిని హత్య చేశారనే ఆరోపణలు ఉన్నాయి. కడప లోక్‌సభ టిక్కెట్ అవినాష్‌ రెడ్డికి కేటాయించడంపై వివేకానంద రెడ్డి అభ్యంతరం తెలిపారు. తనకు కానీ వైఎస్ షర్మిలకు కానీ, విజయమ్మకు కానీ ఇవ్వాలని వివేకా సూచించడంతో హత్య చేయించి ఉంటారని సిబిఐ చార్జిషీటులో పేర్కొన్నారు. ఈ కేసులో అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. ఆయనకు కూడా సిబిఐ నోటీసులు ఇస్తుందని ప్రచారం జరుగుతోంది.

విచారణకు రాలేనన్న అవినాష్ రెడ్డి…..

మరోవైపు ముందస్తు కార్యక్రమాలు ఉండటంతో మంగళవారం నాటి విచారణకు తాను హాజరు కాలేనని ఎంపీ అవినాష్ రెడ్డి సిబిఐకు సమాచరం ఇచ్చారు. ఐదు రోజుల తర్వాత ఎప్పుడు పిలిచినా సిబిఐ విచారణకు హాజరు అవుతానని తెలిపారు. సిబిఐ అధికారులు ఇచ్చిన నోటీసుల్లో ఉన్న అధికారికి ఫోన్ చేసిన అవినాష్ రెడ్డి విచారణకు తర్వాత వస్తానని సమాచారం ఇచ్చారరు.

తన నియోజక వర్గంలోని చక్రాయపేటలో మంగళవారం ప్రభుత్వాస్పత్రి ప్రారంభం, గండి పుణ్య క్షేత్రంలో ఉచిత అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు ఉన్నాయని, మరో నాలుగు రోజులు ముందుకు నిర్ణయించుకున్న కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉండటంతో తర్వాత ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరు అవుతానని వివరించారు. రాఘవ రెడ్డికి నోటీసులు జారీ చేసే సమయానికి ఎంపీ అవినాష్ రెడ్డి విజయవాడలో ఉన్నారు. సిబిఐ నోటీసుల నేపథ్యంలో హుటాహుటిన రాత్రికి పులివెందుకు చేరుకున్నారు.

IPL_Entry_Point

టాపిక్