YSRCP MLAs : అసమ్మతి రాగం వినిపిస్తే.. అంతే.. నెల్లూరు వరకే సీన్ క్లోజ్!
CM Jagan On YSRCP MLA's : కొన్ని రోజులుగా అధికారి వైసీపీలో అసమ్మతి రాగం వినిపిస్తోంది. నెల్లూరు జిల్లా నుంచి తిరుగుబాటు మెుదలైంది. అయితే ఇది అక్కడి వరకే క్లోజ్ చేసేయాలని అధిష్ఠానం అనుకుంటోంది. దీనికోసం ప్రత్యేకంగా సీఎం జగన్ ఫోకస్ పెడుతున్నట్టుగా తెలుస్తోంది.
వైసీపీ(YCP)లో నుంచి వచ్చే.. తిరుగుబాటును ఎదుర్కోవాలని అధికార వైసీపీ అనుకుంటోంది. తిరుగుబాటును ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా నెల్లూరు(Nellore) జిల్లాలోనే అరికట్టాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. అందులో భాగంగానే నెల్లూరు జిల్లాలో ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలపై అధికార పార్టీ నేతలు, మంత్రులు, శాసనసభ్యులు దాడులు పెంచారు. అయినా పట్టువదలని తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(Kotamreddy Sridhareddy) వైఎస్సార్‌సీపీపై, రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతూనే ఉన్నారు. పార్టీపై, ప్రభుత్వంపై న్యాయపోరాటం చేసేందుకు కూడా ఆయన సిద్ధమవుతున్నారు.
ట్రెండింగ్ వార్తలు
దీనికి తోడు నెల్లూరు మేయర్ పొట్లూరి స్రవంతి ఇప్పటికే తిరుగుబాటు ఎమ్మెల్యేకు మద్దతు ప్రకటించడంతో వైసీపీ కార్యకర్తలందరినీ దూరం చేసేందుకు శ్రీధర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. దీన్ని ప్రతిఘటిస్తూ నెల్లూరు(Nellore) మున్సిపల్ కార్పొరేటర్లను వైఎస్సార్సీపీలోనే కొనసాగించేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది. నెల్లూరు 22వ డివిజన్ కార్పొరేటర్ విజయభాస్కర్ రెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరుడు. కోటంరెడ్డిపై అతడే వేదాయపాళెం పోలీస్ స్టేషన్‌లో కిడ్నాప్ ఫిర్యాదు కూడా చేశాడు. దీంతో రాజకీయం మరింత ఆసక్తిగా మారింది.
పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishnareddy) సహా సన్నిహితులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan) సమావేశమైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో భిన్నాభిప్రాయాలు కనిపిస్తున్నాయని, మిగిలిన జిల్లాల్లోని కొన్ని సెగ్మెంట్లలో అసమ్మతి చెలరేగుతున్నదని సీనియర్ నేతలు సూచించారు. పెరుగుతున్న అసమ్మతిని నియంత్రించే చర్యలను ప్రారంభించడంలో పార్టీ విఫలమైతే, రాబోయే రోజుల్లో గ్రూప్ ఇజం పెరగవచ్చని, ఇది 2024 ఎన్నికల(2024 Elections) దృష్ట్యా మంచిది కాదని భావిస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను తీవ్రంగా ఖండించాలని వైసీపీ అధినేత పార్టీ నాయకులను కోరారు. దానికి తగ్గట్టుగానే.. మంత్రులు, శాసనసభ్యులు, ఇతర నాయకులు ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) రుజువులను బయటపెట్టాలని కోరుతూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో సహా తిరుగుబాటుదారులపై ఎదురుదాడికి దిగారు. కేంద్ర ప్రభుత్వం, సీబీఐ(CBI) లేదా మరేదైనా ఏజెన్సీకి ఫిర్యాదు చేయాలని వారు తిరుగుబాటుదారులను డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపణలు చేసిన వారి విశ్వసనీయతను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు.
అయితే అసంతృప్తుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాలకు కొత్త వైసీపీ ఇన్ఛార్జులను నియమించడం ద్వారా రెబల్స్ పక్కకు తప్పుకుంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసంతృప్తుల ప్లేసులో కొత్త వాళ్లు వస్తే.. తదుపరి ఎన్నికలకు ముందు తమ స్థానాలను బలోపేతం చేసుకోవడానికి అవకాశంగా ఉంటుంది. ఎట్టిపరిస్థితుల్లో నెల్లూరు వరకే ఈ అసంతృప్తిని క్లోజ్ చేయాలని వైసీపీ అధిష్ఠానం అనుకుంటోంది..!