Tirumala : ముంబయిలో 10 ఎకరాల విస్తీర్ణంలో శ్రీవారి ఆలయం
ముంబయిలోని ఉల్వేలో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ భూమి పూజ ఆగస్టు 21న నిర్వహించనున్నట్టుగా ఈవో ధర్మారెడ్డి తెలిపారు. సుమారు 200 కోట్ల అంచనా వ్యయమని చెప్పారు.
_1660214978314_1660214999883_1660214999883.png)
తిరుమల అన్నమయ్య భవన్‌లో మీడియాతో ఈవో ధర్మారెడ్డి మాట్లాడారు. కోస్టల్ కారిడార్ పక్కనే నవీ ముంబై సమీపంలోని ఉల్వే వద్ద మహారాష్ట్ర ప్రభుత్వం 10 ఎకరాల భూమిని కేటాయించిందని చెప్పారు. రానున్న రెండేళ్లలో కేంద్ర బిందువుగా మారుతుందన్నారు. ఆగస్టు 10న తిరుమల ప్రధాన అర్చక శ్రీ వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా ఆలయానికి సంబంధించిన క్రతువులు ప్రారంభించినట్లు చెప్పారు. అక్కడ విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కన్యా పూజ, వృషభ పూజ, భూకర్షణ, బీజవాపనం నిర్వహించారని తెలిపారు.
ప్రధాన ఆలయ వ్యయం రూ.100 కోట్లు కాగా, మిగిలిన నిర్మాణాలు మరో 100 కోట్లు అవుతాయని అంచనా వేసినట్లు ధర్మారెడ్డి తెలియజేశారు. శ్రీవారి ఆలయ నిర్మాణానికి అయ్యే మెత్తం వ్యయాన్ని రేమండ్ చీఫ్ గౌతమ్ సింఘానియా ఇవ్వడానికి ముందుకు వచ్చినట్లు ఈవో వివరించారు.
ఆగస్టు 12న తిరుమల శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడసేవ జరగనుంది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రాత్రి 7 నుండి రాత్రి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు సువర్ణకాంతులీనుతున్న గరుడునిపై తిరుమాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు.