TTD :శ్రీ కుమారధార తీర్థ ముక్కోటికి విస్తృత ఏర్పాట్లు... ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక కంట్రోల్ రూమ్
TTD : తిరుమల శ్రీ కుమారధార తీర్థ ముక్కోటికి విచ్చేసే భక్తుల కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టింది. మార్చి 31 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు జరిగే ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ అందుబాటులోకి తేనుంది.
TTD : మార్చి 7న తిరుమల శ్రీ కుమారధార తీర్థ ముక్కోటికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. భక్తులను ఉదయం 6 గంటల నుంచి తీర్థానికి అనుమతిస్తారు. కుమారధార తీర్థం ముక్కోటికి వెళ్లే భక్తులకు డ్యాం వద్ద అన్నప్రసాదం మరియు తాగు నీరు అందిస్తారు. వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశారు. భక్తుల భద్రతను పర్యవేక్షించేందుకు కుమారధార తీర్థం వరకు దాదాపు 300 మంది విజిలెన్స్, పోలీస్, ఫారెస్ట్ సిబ్బందిని కేటాయించారు. గుండె సంబంధిత వ్యాధులు, ఆస్తమా, స్థూలకాయం, రక్తపోటు ఉన్న భక్తులు మరియు వృద్ధులు ట్రెక్కింగ్ చేయ వద్దని టీటీడీ అధికారులు కోరారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత పాప వినాశనం నుంచి కుమారధార తీర్థ ప్రవేశం మార్గం మూసివేయబడుతుందని.. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని తెలిపారు.
ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్
కడపలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మార్చి 31 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో వివిధ విభాగాల మధ్య సమన్వయం కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని టిటిడి జెఈవో వీరబ్రహ్మం విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. టిటిడి పరిపాలన భవనంలో సోమవారం ఆయన ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఏప్రిల్ 5వ తేదీన శ్రీ కోదండరామస్వామి కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు ప్రారంభించాలన్నారు. కల్యాణానికి పెద్దసంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున వైఎస్‌ఆర్ జిల్లా అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుని టిటిడిలోని అన్ని విభాగాల అధికారులు సమర్థవంతంగా పని చేయాలన్నారు.
భక్తుల సంఖ్యకు సరిపడా తాగునీరు, మజ్జిగ పంపిణీకి తగిన ఏర్పాట్లు చేయాలని జేఈవో వీరబ్రహ్మం అధికారలకు సూచించారు. స్వామివారి కల్యాణం అనంతరం ప్రతి భక్తుడికీ అక్షింతలు, కంకణాలు, పసుపు కుంకుమ అందేలా ఏర్పాట్లు చేపట్టాలని చెప్పారు. పుష్పాలు, విద్యుత్ అలంకరణలతో కల్యాణవేదికను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలన్నారు. బ్రహ్మోత్సవాల్లో నిర్వహించే వాహనసేవల ముందు, కల్యాణవేదికపై అద్భుతమైన కళాప్రదర్శనలు ఏర్పాటు చేయాలని హెచ్‌డిపిపి అధికారులను ఆదేశించారు.
బ్రహ్మోత్సవాల పోస్టర్లు, బుక్‌లెట్లు త్వరగా ముద్రించి విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. కల్యాణోత్సవం రోజున భక్తులకు చిన్నపాటి ఇబ్బంది కలిగినా తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించేలా కంట్రోల్ రూమ్ పని చేయాలన్నారు. డెప్యుటేషన్ సిబ్బందికి అన్నప్రసాదాలు, వసతి ఏర్పాట్లపై ముందస్తుగా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ఆలయ పరిసర ప్రాంతాలతోపాటు కల్యాణవేదిక ప్రాంగణంలో అవసరమైనన్ని ఎల్‌ఇడి స్క్రీన్లు ఏర్పాటు చేయాలని, గ్యాలరీల్లో కూర్చునే భక్తులకు ఎండవేడిమి నుంచి ఉపశమనం కల్పించేందుకు తగినన్ని కూలర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ ప్రాంతంలో క్యూలైన్లు, అన్నప్రసాదాల పంపిణీకి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు కోసం వైఎస్‌ఆర్ జిల్లా అధికారులతో కలిసి ప్రణాళికలు రూపొందించాలన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా వాహనాల పార్కింగ్ కోసం తగినన్ని ప్రదేశాలు సిద్ధం చేయాలన్నారు. ప్రత్యేక వైద్య బృందాలు, ప్రథమ చికిత్స కేంద్రాలు, మందులు సిద్ధం చేసుకోవాలని సూచించారు.