Tirumala Rush : తిరుమలలో భక్తుల రద్దీ, కృష్ణ తేజా గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్- సర్వదర్శనానికి 24 గంటలు-tirumala srivari sarva darshan takes 24 hours heavy rush at temple ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Tirumala Srivari Sarva Darshan Takes 24 Hours Heavy Rush At Temple

Tirumala Rush : తిరుమలలో భక్తుల రద్దీ, కృష్ణ తేజా గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్- సర్వదర్శనానికి 24 గంటలు

Bandaru Satyaprasad HT Telugu
May 28, 2023 08:37 AM IST

Tirumala Rush : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి, భక్తుల క్యూలైన్ కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు చేరుకుంది.

తిరుమల
తిరుమల (twitter )

Tirumala Rush : తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ ప్రకటించింది. దర్శన టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని అన్ని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. భక్తులు కృష్ణ తేజా గెస్ట్ హౌస్ వరకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. క్యూలైన్‌లోని భక్తులు ఇబ్బంది పడకుండా టీటీడీ సిబ్బంది తాగునీరు, అన్నప్రసాదాలు అందిస్తున్నారు. శ్రీవారిని శనివారం 88,604 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ3.53 కోట్లని టీటీడీ తెలిపింది. 51,251 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.

మే 31న కరీంనగర్ లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ

తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణం కోసం మే 31వ తేదీ భూమి పూజ జరుగనుందని టీటీడీ ప్రకటించింది. బుధవారం ఉదయం 6.50 నుంచి 7.20 గంటల మధ్య మిథునలగ్నంలో టీటీడీ ఛైర్మన్ వైవి.సుబ్బా రెడ్డి వేద మంత్రోచ్ఛారణల మధ్య భూమి పూజ నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన మంత్రులు, పలువురు ప్రజా ప్రతినిధులు, టీటీడీ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

మే 31న శంకుస్థాపన

కరీంనగర్ కేంద్రంగా ఉత్తర తెలంగాణ ప్రజలకు శ్రీ వేంకటేశ్వరుని దర్శనం దొరకబోతుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కరీంనగర్‌లో టీటీడీ ఆలయానికి 10 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ కృషితో కరీంనగర్ వాసుల ఆ వెంకటేశ్వరుని దర్శన కల సాకారం కాబోతుంది. ఇటీవల హైదరాబాద్‌లోని తన నివాసంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, కరీంనగర్ టీటీడీ ఆలయ నిర్మాణ అనుమతి పత్రాలను మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, టీటీడీ తెలంగాణ లోకల్ అడ్వజరీ కమిటీ ఛైర్మన్ భాస్కరరావుకు అందించారు. వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ విజ్ఞప్తి మేరకు కరీంనగర్ లో రూ.20 కోట్ల వ్యయంతో టీటీడీ శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తుందన్నారు. మే 31న ఉదయం 7గం. 26 నిమిషాలకు ఆలయం శంకుస్థాపన కార్యక్రమం వేదమంత్రోచ్ఛారణలతో నిర్వహిస్తామన్నారు. అనంతరం అదే ప్రాంగణంలో కరీంనగర్ ప్రజలతోపాటు ఉత్తర తెలంగాణ ప్రజలకు శ్రీవారి ఆశీస్సులు అందించే విధంగా కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుని కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ ఉత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.

IPL_Entry_Point