Nara Lokesh Birthday Celebrations : ఘనంగా లోకేశ్ పుట్టినరోజు వేడుకలు.. వెయ్యి కేజీల కేక్ తో..-tdp leaders and followers celebrates nara lokesh birthday state wide ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nara Lokesh Birthday Celebrations : ఘనంగా లోకేశ్ పుట్టినరోజు వేడుకలు.. వెయ్యి కేజీల కేక్ తో..

Nara Lokesh Birthday Celebrations : ఘనంగా లోకేశ్ పుట్టినరోజు వేడుకలు.. వెయ్యి కేజీల కేక్ తో..

HT Telugu Desk HT Telugu
Jan 23, 2023 10:02 PM IST

Nara Lokesh Birthday Celebrations : రాష్ట్రవ్యాప్తంగా నారా లోకేశ్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. యువ నేత జన్మదినోత్సవాన్ని టీడీపీ శ్రేణులు గొప్పగా నిర్వహించారు. మరోవైపు... లోకేశ్ యువగళం పాదయాత్రకి పోలీసుల అనుమతిపై ఉత్కంఠ కొనసాగుతోంది.

ఘనంగా నారా లోకేశ్ పుట్టిన రోజు వేడుకలు
ఘనంగా నారా లోకేశ్ పుట్టిన రోజు వేడుకలు

Nara Lokesh Birthday Celebrations : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. నారా లోకేశ్ జన్మదినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. అన్ని నగరాలు, ప్రధాన కేంద్రాల్లో.. తెలుగుదేశం శ్రేణులు వేడుకలు జరిపారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. అన్నదానం చేశారు. టీడీపీకి చెందిన ముఖ్య నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో వేడుకల్లో పాల్గొన్నారు.

నారా లోకేశ్ పుట్టిన రోజు సందర్భంగా విజయవాడలోని పున్నమి ఘాట్ లో టీడీపీ అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 108 జంటలతో 11 రకాల హోమాలు నిర్వహించిన శ్రేణులు... లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతం కావాలని ప్రార్ధించారు. 40 అడుగుల వెడల్పు, 1000 కేజీల భారీ కేక్ కట్ చేశారు. అనంతరం... శివపార్వతుల కళ్యాణం, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శాసనమండలి సభ్యులు దువ్వారపు రామారావు, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కె.ఎస్.జవహర్, పీతల సుజాత, పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, కైకలూరు ఇంఛార్జి జయమంగళం వెంకటరమణ, జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం, అధికార ప్రతినిధి నాగుల్ మీరా, మద్దిపాటి వెంకట్రాజు, కేశినేని చిన్ని, తదితర టీడీపీ నేతలు, కార్యకర్తలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల్లో భాగంగా.. అమరావతిలోని హైకోర్టు వద్ద టీడీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. 117 మంది రక్తదానం చేశారు. జనవరి 27 నుంచి నారా లోకేశ్ చేపట్టనున్న యువగళం పాదయాత్రకు టీడీపీ లీగల్ సెల్ తరపున అవసరమైన న్యాయ సేవలు అందిస్తామని లీగల్ సెల్ అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు జిల్లా న్యాయ విభాగాలు కూడా సమాయత్తం అయ్యాయని అన్నారు. కార్యక్రమంలో న్యాయశాఖ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చిరాం ప్రసాద్, మాచర్ల టీడీపీ ఇంచార్జి జూలకంటి బ్రహ్మానంద రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి గొట్టిపాటి రామకృష్ణప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

మరోవైపు.. జనవరి 27 నుంచి ప్రారంభం కానున్న లోకేశ్ యువగళం పాదయాత్రకు పోలీసుల అనుమతి విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. 400 రోజులు.. 4 వేల కిలోమీటర్ల మేర సాగనున్న యాత్రకు ఇప్పటి వరకు పోలీసుల నుంచి పర్మిషన్ రాలేదు. షెడ్యూల్ ప్రకారం కుప్పం నుంచి యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. అయితే... లోకేశ్‌ యువగళం పాదయాత్రపై స్పందించిన చిత్తూరు ఎస్పీ రిషాంత్‌రెడ్డి.... అన్నీ పరిశీలించి నిబంధనల మేరకు అనుమతి ఇస్తామని చెప్పారు. రేపటిలోగా పాదయాత్రకు అనుమతిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

పాదయాత్రపై.. ఏపీ డీజీపీ, తెలుగుదేశం పార్టీ మధ్య లేఖల సమరం కొనసాగిన విషయం తెలిసిందే. యాత్రకు అనుమతి కోరుతూ ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య రాసిన లేఖపై.. 12 రోజుల తర్వాత ప్రత్యుత్తరం పంపిన ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి... యాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలు కావాలని.. ఆదివారంలోగా వాటిని పంపాలని సూచించారు. దీంతో.. డీజీపీపై టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు. అన్ని వివరాలను పేర్కొంటూ అనుమతి కోరామని... పోలీసులు కావాలనే కొర్రీలు పెడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా లోకేశ్ పాదయాత్ర జరిగి తీరుతుందని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో... చిత్తూరు ఎస్పీ ఏ నిర్ణయం వెల్లడిస్తారనే విషయం ఆసక్తిగా మారింది.

IPL_Entry_Point