Ippatam Issue : సైకోతత్వంతోనే కూల్చివేతలు.. ఇప్పటం ఇష్యూపై ప్రతిపక్షాలు ఫైర్-tdp and janasena slams ysrcp government over houses demolition in ippatam village ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Tdp And Janasena Slams Ysrcp Government Over Houses Demolition In Ippatam Village

Ippatam Issue : సైకోతత్వంతోనే కూల్చివేతలు.. ఇప్పటం ఇష్యూపై ప్రతిపక్షాలు ఫైర్

HT Telugu Desk HT Telugu
Mar 05, 2023 08:06 PM IST

Ippatam Issue : ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేతలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్రంలో ఎన్నో రోడ్లు అధ్వాన్నంగా ఉంటే.. ప్రభుత్వానికి ఇప్పటం రోడ్డే ఎందుకు కనిపిస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. గ్రామంలో మరోసారి ప్రజలని ఇబ్బంది పెడితే చూస్తూ ఊరికునేది లేదని జనసేన నేత నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు.

ఇప్పటం కూల్చివేతలపై ప్రతిపక్షాల ఆగ్రహం
ఇప్పటం కూల్చివేతలపై ప్రతిపక్షాల ఆగ్రహం

Ippatam Issue : రాష్ట్రంలో అనేక చోట్ల రోడ్లు అధ్వాన్నంగా ఉంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి గుంటూరు జిల్లాలోని ఇప్పటం రోడ్డు మాత్రమే ఎందుకు కనిపిస్తోందని... టీడీపీ అధినేత చంద్రబాబు నిలదీశారు. గ్రామంలో మరోసారి జరిపిన కూల్చివేతలపై స్పందించిన ఆయన.. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ సర్కార్ పై ఫైర్ అయ్యారు. రోడ్డు విస్తరణ పేరుతో చేస్తున్న చర్యల వెనుక మంచి చేయాలన్న ఉద్దేశం లేదని.. కేవలం ప్రజలపై కసితోనే ఇదంతా చేస్తున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ నేతలు ఎలాగూ మారరని.. ప్రజలే వారిని మార్చేస్తారని వ్యాఖ్యానించారు.

ట్రెండింగ్ వార్తలు

"ఏదైనా మంచి పని కోసం వెనకడుగు వేయకుండా పోరాడితే దాన్ని పట్టుదల అంటారు. కసితో కూల్చడమే లక్ష్యంగా పని చేస్తే దాన్ని సైకోతత్వం అంటారు. రాష్ట్రంలో ఎన్నో రోడ్లు అధ్వాన్నంగా ఉంటే.. ఈ ప్రభుత్వానికి ఇప్పటం రోడ్డు మాత్రమే ఎందుకు కనిపిస్తుంది ? మీరు ఎలాగూ మారరు. ప్రజలే మిమ్మల్ని మార్చేస్తారు" అని చంద్రబాబు ధ్వజమెత్తారు.

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.. ఇప్పటం గ్రామంలో కూల్చివేతలను పరిశీలించారు. బాధితులని పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం సామాన్యులపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.. నాదెండ్ల మనోహర్. కూలీ పనులు చేసుకునే పేదల ఇళ్లను కూలగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఇళ్లను కూల్చివేసి పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.... మార్చి 14న మచిలీపట్నంలో జనసేన ఆవిర్బావ నిర్వహిస్తున్నందున.. బెదిరించేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు.

151 స్థానాలు అప్పగిస్తేనే ఇంత అరాచకాలు సృష్టిస్తున్నారని... ఇక అధికార పార్టీ ప్రకటిస్తున్నట్లుగా 175 స్థానాలు అప్పగిస్తే రాష్ట్రం ఏమైపోతుందో ప్రజలు ఆలోచించుకోవాలని నాదెండ్ల మనోహర్ అన్నారు. ఇప్పటం గ్రామంలో ప్రతి కుటుంబానికి జనసేన పార్టీ అండగా నిలబడుతుందని స్పష్టం చేశారు. ఇంకోసారి అధికారులు గ్రామ ప్రజలను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అధికార పార్టీకి అంత ఇబ్బంది అనిపిస్తే జనసేన పార్టీతో నేరుగా యుద్ధం చేయాలని సవాల్ విసిరారు. సామాన్యులను ఇబ్బంది పెట్టొద్దని చెప్పారు. పేద ప్రజలను కన్నీళ్లు పెట్టించేందుకు ముఖ్యమంత్రి జగన్ పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు.

గుంటూరు జిల్లా మంగళగిరి - తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఇప్పటం గ్రామంలో శనివారం అధికారులు ఇళ్ల కూల్చివేతలు చేపట్టడం ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. నిబంధనలు అతిక్రమించి ప్రహరీ గోడలు నిర్మించారంటూ .... 12 గృహాల ప్రహరీలు, ర్యాంపులు, మెట్లు తొలగించారు. గ్రామస్తుల తీవ్ర నిరసనల మధ్యే నిర్మాణాల తొలగింపు ప్రక్రియ కొనసాగింది. అధికారుల చర్యలకు నిరసనగా.. గ్రామంలోని స్థానికులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి , ఆందోళన చేస్తున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. గతేడాది జనసేన ఆవిర్భావ సభ ఇప్పటంలో జరిగిన నాటి నుంచి వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రామాన్ని లక్ష్యంగా చేసుకుందని స్థానికులు విమర్శిస్తున్నారు. గ్రామానికి రవాణా సౌకర్యం లేదని... బస్సులు రావని, భారీ వాహనాలు ఇక్కడ నుంచి వెళ్లవని పేర్కొంటున్న గ్రామస్తులు... రోడ్డు విస్తరణ చేసి ఏం చేసుకుంటారని నిలదీస్తున్నారు. కేవలం కక్ష్య సాధింపు కోసం నిర్మాణాలు కూల్చివేస్తున్నారని మండిపడుతున్నారు.

IPL_Entry_Point