Loan Apps Case: లోన్ యాప్స్ కేసులో ముగ్గురు మలేషియన్ల అరెస్ట్-rajahmundry police have arrested three malaysians who are harassing with loan apps ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Rajahmundry Police Have Arrested Three Malaysians Who Are Harassing With Loan Apps

Loan Apps Case: లోన్ యాప్స్ కేసులో ముగ్గురు మలేషియన్ల అరెస్ట్

HT Telugu Desk HT Telugu
May 25, 2023 03:41 PM IST

Loan Apps Case: చైనా, మలేషియా, సింగపూర్‌లలో సర్వర్లను నిర్వహిస్తూ లోన్ యాప్స్‌ ద్వారా అక్రమాలకు పాల్పడుతున్న ముఠా ఆగడాలకు తూర్పు గోదావరి పోలీసులు అడ్డు కట్ట వేశారు. ఓ యువకుడి ఆత్మహత్యకు కారణమైన ముఠాను వలపన్ని మలేషియా నుంచి రప్పించి అరెస్ట్ చేశారు.

లోన్ యాప్‌ కేసులో ముగ్గురు మలేషియన్లను అరెస్ట్ చేసిన రాజమండ్రి పోలీసులు
లోన్ యాప్‌ కేసులో ముగ్గురు మలేషియన్లను అరెస్ట్ చేసిన రాజమండ్రి పోలీసులు

Loan Apps Case: ఆన్‌లైన్‌ యాప్‌ల ద్వారా రుణాలు ఇవ్వడం, నగదు తిరిగి చెల్లిస్తున్నా వేధిస్తూ రెట్టింపు నగదు వసూలు చేయడం, డబ్బు చెల్లించ లేని నిస్సహాయులపై వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

డబ్బు వసూలు కోసం ఫొటోలను మార్ఫింగ్‌ చేసి బెదిరింపులకు పాల్పడుతున్న అంతర్జాతీయ ముఠా సభ్యుల్లో ముగ్గురిని తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. రాజమహేంద్రవరంలోని దిశ పోలీస్‌స్టేషన్‌లో ఎస్పీ సుధీర్‌ కుమార్‌రెడ్డి వెల్లడించారు.

ఈ నెల 6వ తేదీన తూర్పుగోదావరి జిల్లా కడియం మండలానికి చెందిన యువకుడు ఎస్‌.హరికృష్ణ లోన్ యాప్‌ వేధింపులు భరించలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ కేసును సవాలుగా తీసుకున్న ఎస్పీ దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

ఫోన్ కాల్స్‌తో కేసు చేధించారు…

మృతుడికి వచ్చిన ఫోన్‌కాల్స్‌ ఆధారంగా వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించి ఇప్పటికే దిల్లీకి చెందిన హరిఓం, బెంగళూరుకి చెందిన మంజునాథన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. తమవద్ద ఉన్న సమాచారంతో చెన్నైలో ఏజెన్సీ నిర్వహిస్తున్న ముగ్గురిని గుర్తించి వారితో 20 రోజులుగా చాట్‌ చేశారు. వారితో తమకు ఓ ఏజెన్సీ కావాలని నమ్మబలికారు. ఇందులో భాగంగా వారి లావాదేవీలన్నీ మలేషియా దేశం నుంచి జరుగుతున్నట్లు గుర్తించారు.

పథకం ప్రకారం వారిలో ముగ్గురిని తమిళనాడు రాష్ట్రం చెన్నై ప్రాంతానికి రప్పించి అరెస్టు చేశారు. యంగ్‌లీషింగ్‌, చూకైలున్‌ అనే మలేషియ దేశస్థులతో పాటు తమిళనాడుకి చెందిన త్యాగిరాజన్‌ కసు అలియాస్‌ వినోద్‌ అరెస్టైన వారిలో ఉన్నారు. వీరి వద్ద మలేషియాకు చెందిన నాలుగు పాస్‌పోర్టులు, ఆరు సెల్‌ఫోన్లు, ఆ దేశానికి చెందిన కరెన్సీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు.

ముఠాకు ప్రధాన సూత్రధారులుగా డ్ల్యూ, రిచ్మండ్‌ అనే ఇద్దరు వ్యక్తుల కోసం ప్రత్యేక గాలింపు చేపడుతున్నారు. ఈ ముఠా దక్షిణాసియా దేశాలైన ఇండియా, నేపాల్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, థాయ్‌లాండ్‌, ఇండోనేషియా, తైవాన్‌, దుబాయ్‌, వియత్నాం వంటి దేశాల్లో ఏజెంట్లను నియమించుకుని వారిద్వారా బ్యాంకు ఖాతాలు సేకరించి ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నారు.

కమిషన్ల ఎరవేసి నియామకాలు…

అధిక జీతం ఆశచూపి సబ్‌ ఏజెంట్లుగా మరికొందరిని నియమించుకుని లోన్‌ యాప్‌ల ద్వారా రుణాలు పొందిన వారికి ఫోన్లు చేసి అధిక వసూళ్లకు పాల్పడటం, ఫొటోలు మార్ఫింగ్‌ చేసి బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేసే పనులు అప్పగిస్తున్నారు. ఈ వ్యవహారంపై లోతైన దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో సమన్వయంతో వ్యవహరించిన పోలీసులను అభినందించారు.

నిందితులపై ఐటీ చట్టంలోని 306, 504, 509, 384, 386 ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ, సెక్షన్ 67 కింద కేసు నమోదు చేశారు. లోన్ యాప్ కేసులో విదేశీ పౌరుల్ని అరెస్ట్ చేయడం ఇదే తొలిసారి అని ఎస్పీ తెలిపారు. దేశవ్యాప్తంగా వెయ్యి మందికి పైగా ప్రజలు లోన్ యాప్‌లు, గేమింగ్ యాప్‌ల మోసాలకు ప్రతి రోజు బలవుతున్నారు. కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకుంటున్నారు. రుణాలు తీసుకున్న వారిని తీవ్రంగా వేధించిన సందర్భాల్లో కొంతమంది ప్రాణాలను బలి తీసుకుంటున్నారని వివరించారు.

నిందితులు భారతదేశంలోని ఏజెంట్ల సహాయంతో మలేషియా మరియు వియత్నాం నుండి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అరెస్టయిన నిందితులు వారి సహచరులతో కలిసి పాకిస్తాన్ మరియు నేపాల్, బంగ్లాదేశ్, థాయ్‌లాండ్ మొదలైన 8 ఇతర దేశాలలో బాధితులను లక్ష్యంగా చేసుకుంటున్నారు.

రాజమండ్రికి చెందిన హరికృష్ణ లోన్ యాప్ ద్వారా రూ.10,000 రుణం తీసుకున్నాడు. తీసుకున్న దానికి చాలా రెట్లు చెల్లించాడు. అయినా డబ్బు కోసం యాప్ ఏజెంట్లు బెదిరించారు. డబ్బు కోసం ఫోటోలను మార్ఫింగ్ చేసి ఫోన్‌ కాంటాక్టులకు పంపుతామని బెదిరించారు. వారి బెదిరింపుల కారణంగా, మే 5న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కేసు విచారణలో భాగంగా, ప్రతిరోజూ కోటి రూపాయలకు పైగా లావాదేవీలు జరుపుతున్న బ్యాంకు ఖాతాలను అందిస్తున్న ఏజెంట్‌ను కూడా ఆంధ్రా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

IPL_Entry_Point