Operation Tiger 108 Failed :ఆపరేషన్ టైగర్ విఫలం…తిరుపతి జూకు పులి కూనలు-operation tiger 108 failed mother tiger didnt reach its cubs and cubs returned to tirupathi zoo ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Operation Tiger 108 Failed Mother Tiger Didnt Reach Its Cubs And Cubs Returned To Tirupathi Zoo

Operation Tiger 108 Failed :ఆపరేషన్ టైగర్ విఫలం…తిరుపతి జూకు పులి కూనలు

HT Telugu Desk HT Telugu
Mar 10, 2023 05:46 AM IST

Operation Tiger 108 Failed ఆపరేషన్ టైగర్ 108 విఫలమైంది. పులి కూనల్ని తల్లి దగ్గరకు చేర్చే ప్రయత్నాలు ఫలించలేదు. దేశంలోనే తొలిసారి వందలాది మంది అటవీ సిబ్బందితో చేసిన ప్రయత్నాలు విఫమవ్వడంతో పులి కూనల్ని తిరుపతి జూకు తరలించారు. నిపుణుల సంరక్షణలో పెంచి, రెండేళ్ల తర్వాత అడవుల్లోకి వదలనున్నారు.

తిరుపతి జూకు పులి కూనల తరలింపు
తిరుపతి జూకు పులి కూనల తరలింపు

Operation Tiger 108 Failed ఆపరేషన్‌ టైగర్ 108 విఫలమైంది. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని పెద్దగుమ్మడాపురం గ్రామ శివార్లలో కనిపించిన నాలుగు కూనలను తల్లి దగ్గరకు చేర్చడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పులిజాడల్ని గుర్తించి కూనల్ని తల్లి గుర్తించేలా ఎన్‌క్లోజర్‌లో ఉంచినా కూనల చేరువలో పెద్ద పులి రాలేదు.

దీంతో ఈ ఆపరేషన్‌ను ముగించినట్లు ప్రకటించిన అటవీ శాఖ అధికారులు పులి పిల్లలను తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర జువలాజికల్‌ పార్కుకు గురువారం రాత్రి తరలించారు. బుధవారం రాత్రి అటవీ ప్రాంతంలో ఎన్‌క్లోజర్‌లో పులిపిల్లలను పెట్టి ఎదురు చూసినా తల్లి రాలేదని నాగార్జునసాగర్‌ - శ్రీశైలం పులుల అభయారణ్యం ఎఫ్‌డీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. మనుషులు ముట్టుకున్నారనే కారణంతోనే పిల్లల వద్దకు వచ్చేందుకు తల్లి ఇష్టపడటం లేదని భావిస్తున్నామని చెప్పారు. నిపుణుల సంరక్షణలో పెంచి, రెండేళ్ల తర్వాత వాటిని మళ్లీ నల్లమలలో విడిచిపెడతామని వెల్లడించారు.

అర్ధరాత్రి వరకు ఎదురుచూపులు…

సోమవారం పులి కూనలు దొరికిన తర్వాత తల్లి పులి అచూకీ కోసం అటవీశాఖ విస్తృతంగా గాలింపు చేపట్టింది. బుధవారం సాయంత్రం రోడ్డు దాటుతున్న పులిని గొర్రెల కాపరి గుర్తించాడు. మరో ఆటో డ్రైవర్‌ కూడా దానిని చూడటంతో అటవీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. కూనలు దొరికిన పరిసర ప్రాంతాల్లోనే తిరుగుడుండటంతో అధికారులు సంబర పడ్డారు.

పులి జాడ తెలియడంతో బుధవారం అర్ధరాత్రి పెద్దగుమ్మడాపురం సమీపంలోని అటవీ ప్రాంతానికి పిల్లలను తీసుకెళ్లిన అధికారులు ఎన్‌క్లోజరులో వాటిని ఉంచి నిరీక్షించారు. ఆరు బయట ప్రదేశం కావడం, పులి పిల్లలు భయపడుతుండటంతో అర్ధరాత్రి దాటిన తర్వాత బైర్లూటిలోని అటవీశాఖ అతిథి గృహానికి తీసుకొచ్చేశారు. తల్లి పులి టి-108.. నల్లమల అరణ్యంలోనే సంచరిస్తోందని అధికారులు వివరించారు. అది ఆరోగ్యంగానే ఉందని, పులి పిల్లలు లభించిన ప్రాంతంతో పాటు ముసలిమడుగు గ్రామ పరిసరాలు, నీటికుంట ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు గుర్తించామన్నారు. క్రమంగా అది పిల్లల్ని మర్చిపోతుందని వివరించారు.

రాత్రంతా పులి సంచరించిన ప్రాంతాల్లో కూనలను ఉంచి, కృత్రిమ శబ్దాలు చేస్తూ తల్లి పులి జాడ కోసం వెతికారు. మిగతా ప్రాంతాల్లో ట్రాప్‌ కెమెరా, ప్లగ్‌ మార్క్‌ ఆధారాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇవేమి తల్లి పులి దృష్టిని ఆకర్షించలేదని అధికారలు వివరించారు. పులి జాడలు దొరకడంతో కూనల కథ సుఖాంతం అయ్యినట్లు భావించినా చివరకు నిరాశ తప్పలేదు.

50 మందికిపైగా అటవీ అధికారులతో మొత్తంా 300 మంది సిబ్బందితో ఆపరేషన్‌ మదర్ టైగర్‌ కోసం వినియోగించినట్లు తెలిపారు. పులి అన్వేషణ కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించినట్లు తెలిపారు. దాదాపు 200 హెక్టార్లలో 40 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. నాలుగు పులి పిల్లలు ఆరోగ్యంగా ఉన్నాయని, వాటిని ఎక్కువ కాలం విడిగా ఉంచడం మంచిది కాదనే ఉద్దేశంతో జూకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిపుణుల సూచనల మేరకు పులికూనలకు పాలు, సెరోలాక్ తో పాటు ఉడికించిన చికెన్ లివర్ ముక్కలను అందిస్తున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం