Tigress 108 Missing : జాడలేని తల్లి పులి…అటవీశాఖ సంరక్షణలో పులికూనలు-tigress 108 missing in nallamala forest and forest department rescues abandoned cubs ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tigress 108 Missing : జాడలేని తల్లి పులి…అటవీశాఖ సంరక్షణలో పులికూనలు

Tigress 108 Missing : జాడలేని తల్లి పులి…అటవీశాఖ సంరక్షణలో పులికూనలు

HT Telugu Desk HT Telugu
Mar 08, 2023 08:56 AM IST

Tigress 108 Missing నంద్యాల జిల్లాలో కూనల నుంచి విడిపోయిన తల్లి పులి కోసం అటవీ శాఖ అధికారులు విస్తృతంగా గాలిస్తున్నారు. రెండ్రోజుల క్రితం కొత్తపల్లి పెద్దగుమ్మడాపురం గ్రామ శివార్లలో గుర్తించిన నాలుగు ఆడపులి కూనల్ని సంరక్షిస్తున్న అటవీ శాఖ తల్లిని గుర్తించి భారీ ఎత్తున ఆపరేషన్ చేపట్టారు.

నంద్యాల జిల్లాలో గ్రామస్తులకు దొరికిన పులి కూనలు
నంద్యాల జిల్లాలో గ్రామస్తులకు దొరికిన పులి కూనలు

Tigress 108 Missing నంద్యాల జిల్లాలో నాలుగు పులి కూనలు తల్లి నుంచి విడిపోయాయి. నల్లమల అడవులకు సమీపంలో ఉన్న కొత్తపల్లి మండలం పెద్దగుమ్మడాపురం గ్రామ శివార్లలో అడుగులు వేసుకుంటూ వచ్చేశాయి. సోమవారం ఉదయం గ్రామ శివార్లలో పులి పిల్లల్ని గుర్తించి కుక్కల భారీన పడకుండా వాటిని రక్షించారు. 48 గంటలు గడిచినా తల్లి పులి జాడ లేకపోవడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.

పులికూనలకు తల్లిపులి దూరమై రెండు రోజులు గడిచినా దాని జాడ దొరకలేదు. పులిపిల్లలు దొరికన పరిసరాల్లోనే తల్లి పులి కూడా ఉంటుందని భావించి దాని దగ్గరకు చేర్చేందుకు ప్రయత్నాలు చేసినా అది సమీపంలోకి రాలేదు. దీంతో నాలుగు పులి కూనల్ని తల్లి చెంతకు చేర్చేందుకు అధికారుల ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించారు.

పులి జాడ కోసం ఇన్‌ఫ్రారెడ్ కెమెరాల ఏర్పాటు…

పులిజాడ కనిపెట్టేందుకు 70 ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరాల ఏర్పాటు చేశారు. మరోవైపు పులి వంటి వన్య ప్రాణాలు తమ పిల్లల్ని మనుషులు తాకితే వాటిని తిరస్కరించే అవకాశాలు ఉంటాయని ఆందోళన చెందుతున్నారు. రోజులు గడిచే కొద్ది తల్లి పులి బిడ్డల్ని మరిచిపోతుందనే ఆందోళన అధికారుల్లో వ్యక్తమవుతోంది.

శాస్త్రీయ పద్ధతుల్లో తల్లి వద్దకు పులి పిల్లల్ని చేర్చేందుకు అటవీశాఖ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తోంది. నంద్యాల జిల్లా కొత్తపల్లె మండలం పెద్ద గుమ్మడాపురం శివార్లలోకి నాలుగు పిల్లలతో వచ్చిన తల్లి పులి జాడ రెండు లభించలేదు. మరోవైపు తల్లి కోసం పులి కూనలు విలవిల్లాడుతున్నాయి. రెండ్రోజులుగా ఆహారం లేకపోవడంతో అవి నీరసించిపోకుండా వెటర్నరీ వైద్యులు జాగ్రత్త వహిస్తున్నారు. పులి కూనల్ని తల్లి చెంతకు చేర్చేందుకు అటవీ అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. నాలుగు పులి కూనలను ఎలా కాపాడుకోవాలనే విషయంలో కేంద్ర అటవీ శాఖకు సూచనల కోరారు.

సోమవారం పులి కూనలు లభ్యమైన ప్రాంతంలో రెండు కిలోమీటర్ల పరిధిలో 70 ఇన్‌ఫ్రారెడ్‌ ట్రాప్‌ కెమెరాలను ఏర్పాటు చేశారు. తల్లి పులిని గుర్తించి ఆపై ఆ ప్రాంతానికి పులి కూనల్ని చేర్చి తల్లితో కలపడం కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. తల్లి పులిని గుర్తించిన తరువాత ఒక చిన్న ఎన్‌క్లోజర్‌లో పులి కూనలను అదే ప్రాంతంలో ఉంచనున్నారు. తల్లి వాటిని గుర్తించి దగ్గరగా వస్తే కూనలను ఎన్‌క్లోజర్‌ నుంచి వదులేలా ఏర్పాట్లు చేశారు.

ఒకే కాన్పులో నాలుగు ఆడపులి పిల్లలు….

ప్రస్తుతం దొరికిన పులికూనల్ని టైగర్ 108 సంతానంగా అటవీశాఖ గుర్తించింది. గత డిసెంబర్‌లో గర్భంతో ఉన్న ఆడపులిని సిబ్బంది గుర్తించారు. ఇప్పుడు దొరికనవి దాని పిల్లలుగానే భావిస్తున్నారు. పులులు సాధారణంగా ఒక కాన్పులో మూడు పిల్లల్ని కంటాయని, వాటిలో ఆడ, మడ కూనలు ఉంటాయి. పుట్టిన వాటిలో రెండు మాత్రమే బతికే అవకాశం ఉంటుంది.

ఒక్కో కాన్పులో పుట్టిన వాటిలో ఒక ఆడ, ఒక మడ కూన మాత్రమే బతుకుతాయి. గుమ్మడాపురంలో ఒకే ఈతలో నాలుగు ఆడ పులి పిల్లలు పుట్టడంతో అటవీ శాఖ అధికారులకు పెద్ద సంబరమే అయ్యింది. ఆడపులి తన జీవిత కాలంలో 20 పులులను పునరుత్పత్తి చేయగలదని అంచనాలు ఉన్నాయి.

కూనల్ని దగ్గర తీస్తుందో లేదోననే అనుమానాలు….

అటవీ మృగాల్లో పెద్ద పులి, హైనా వంటి జంతువులు తమ పిల్లల విషయంలో చిత్రంగా ప్రవర్తిస్తాయి. పిల్లుల్లో కూడా ఈ తరహా ప్రవర్తన ఉంటుంది. వాటి బిడ్డలకు ఏ కారణంగా అయినా మనిషి స్పర్శ తగిలితే వాటిని తిరిగి తమ దగ్గరకు తీసుకోవు. నంద్యాలలో పులి కూనలను ఇక్కడి జనం ఇష్టం వచ్చినట్లు పట్టుకుని ఫొటోలు తీసుకోవడం, వాటితో ఆటలాడటం వంటి పనులు చేయడంతో పులి కూనలను తల్లి పులి అక్కున చేర్చుకునే అవకాశం ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

పులి కూనల్ని తల్లి చెంతకు చేర్చడంలో జాప్యం జరిగితే.. తల్లి వాటిని మర్చిపోయే అవకాశం కూడా ఉంటుందని చెబుతున్నారు. మనిషి తాకిన వాసనలను పోగొట్టేందుకు వీలుగా అటవీ అధికారులు పులి పిల్లల మూత్రాన్ని సేకరించి వాటితో పులి పిల్లల వంటిని తడపనున్నారు. మనిషి స్పర్శ తగిలితే పులులు కూనలను తిరస్కరించడం సహజమే అయినా ఇది అన్ని సందర్భాల్లో వర్తించదని నాగార్జునసాగర్‌-శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ విఘ్నేష్‌ చెబుతున్నారు. పులి పిల్లల్ని జూకు తరలించడం కంటే తల్లి వద్దకు చేర్చేందుకే ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.

తల్లి పులితో జాగ్రత్త…

పులి కూనలను అత్యంత శాస్త్రీయ పద్ధతుల్లో క్షేమంగా తల్లి వద్దకు చేరుస్తామని ప్రాజెక్టు టైగర్‌ ఫీల్డ్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరెడ్డి చెప్పారు. గత ఏడాది డిసెంబర్‌లో గర్భంతో ఉన్న పులిని ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరాల్లో గుర్తించామని చెప్పారు. నాలుగు కూనలకు సరైన రక్షిత ప్రాంతాన్ని తరలించేందుకు వెతుకుతూ గుమ్మడాపురం గ్రామ శివార్లకు తీసుకొచ్చి ఉండవచ్చని చెప్పారు.

తిరుపతి శ్రీవెంకటేశ్వర జూ వెటర్నరీ డాక్టర్‌ తోయిబా సింగ్‌ పులి కూనల ఆరోగ్య స్థితిగతులు పరిశీలించారు. పులి కూనలను తల్లి వద్దకు చేర్చేందుకు నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటి ఆఫ్‌ ఇండియా నిబంధనలు, మార్గదర్శకాలను పాటిస్తున్నామనిఅధికారులు వివరించారు. మరోవైపు పులికూనల్ని కోల్పోయిన ఆడపులి తీవ్రమైన ఆగ్రహంతో ఉంటుందని, గ్రామస్తులు అటవీప్రాంతాల వైపు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. పులికూనలు క్షేమంగా తల్లిని చేరే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

IPL_Entry_Point