Yuvagalam 100th Day: వందో రోజుకు చేరిన పాదయాత్ర..నేడు లోకేష్‌తో కలిసి నడువనున్న భువనేశ్వరి-nara lokesh yuvagalam padayatra reaches 100th day ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Nara Lokesh Yuvagalam Padayatra Reaches 100th Day

Yuvagalam 100th Day: వందో రోజుకు చేరిన పాదయాత్ర..నేడు లోకేష్‌తో కలిసి నడువనున్న భువనేశ్వరి

HT Telugu Desk HT Telugu
May 15, 2023 06:25 AM IST

Yuvagalam 100th Day: నారా లోకేష్ యువగళం పాదయాత్ర వందో రోజుకు చేరింది.మరోవైపు మదర్స్ డే రోజు లోకేష్ కు తల్లి తనయుడిని ప్రైజ్ చేశారు. 100వ రోజు పాదయత్రలో పాల్గొనేందుకు లోకేష్ పాదయాత్ర క్యాంప్ సైట్‌కు వచ్చారు. నేడు నారా, నందమూరి కుటుంబాలు పాదయాత్రలో సంఘీభావం తెలుపనున్నారు.

నంద్యాలలో టీడీపీ నాయకుడు లోకేష్ పాదయాత్ర
నంద్యాలలో టీడీపీ నాయకుడు లోకేష్ పాదయాత్ర

Yuvagalam 100th Day: మదర్స్‌ డే రోజు టీడీపీ యువనాయకుడు లోకేష్‌కు ఆయన తల్లి నారాభువనేశ్వరి ఊహించని గిఫ్ట్ ఇచ్చారు. గత కొద్ది నెలలుగా పాదయాత్రలో ఇంటికి దూరంగా ఉంటున్న లోకేష్‌ను చూసేందుకు పాదయాత్ర జరుగుతున్న ప్రాంతానికి వచ్చారు. ఆదివారం సాయంత్రం పాదయాత్ర ముగించుకుని క్యాంప్‌సైట్‌కు వచ్చేసరికి భువనేశ్వరి కనిపించడంతో లోకేష్ ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యారు.

ఈ ఏడాది జనవరి 27న యువనేత లోకేష్ చారిత్రాత్మక పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈసారి మాతృ దినోత్సవం రోజున అమ్మను కలవడం కుదరకపోవడంతో ఉదయాన్నే సోషల్ మీడియా ద్వారా తన తల్లి భువనేశ్వరికి కృతజ్జతలు చెప్పుకున్నారు. అయితే మదర్స్ డే రోజు లోకేష్ కు తల్లి భువనేశ్వరి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. 99వరోజు పాదయాత్ర ముగించుకొని ఆదివారం సాయంత్రం శ్రీశైలం నియోజకవర్గం బోయరేవుల క్యాంప్ సైట్ కి చేరగానే భువనేశ్వరమ్మ కన్పించింది.

తల్లిని చూడగానే లోకేష్ ఆనందానికే అవధుల్లేకుండా పోయాయి. సోమవారం 100వరోజు పాదయాత్రలో లోకేష్ తోపాటు ఆయన తల్లి భువనేశ్వరితోపాటు నందమూరి, నారా కుటుంబ సభ్యులు, లోకేష్ చిన్ననాటి స్నేహితులు యాత్రలో పాల్గొనబోతున్నారు. యువగళం 100వరోజు పాదయాత్రను పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు. భర్త చంద్రబాబునాయుడు సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడు రాజకీయ వేదికపైకి రాని భువనేశ్వరి తొలిసారి బిడ్డతో కలిసి సోమవారం అడుగులు వేయనున్నారు. నారా, నందమూరి కుటుంబాలు ప్రత్యేక వాహనంలో ఇప్పటికే కర్నూలుకు చేరుకోవడంతో యువగళం బృందాల్లో ఉత్సాహం నెలకొంది.

నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 99వరోజు శ్రీశైలం నియోజకవర్గంలో వెలుగోడు అటవీ ప్రాంతంలో ఉత్సాహంగా సాగింది. పాదయాత్ర దారిలో యువనేతకు వివిధ వర్గాల ప్రజలు సంఘీభావం తెలిపారు. ఆదివారం సాయంత్రం వెలుగోడులో యువనేత పాదయాత్రకు జనం వెల్లువెత్తారు. లోకేష్ ని చూసేందుకు, కలిసి సమస్యలు చెప్పుకునేందుకు భారీగా ప్రజలు రోడ్ల పైకి వచ్చారు.

వెలుగోడు ప్రజలు భవనాల పైకి ఎక్కి లోకేష్ కి అభివాదం చెప్పారు. లోకేష్ ని కలిసి తమ సమస్యలు చెప్పుకునేందుకు మహిళలు, రైతులు, యువత, వృద్దులు పోటీపడ్డారు. టిడిపి అధికారంలోకి రాగానే స్థానికంగా ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉదయం కొత్తరామాపురం గ్రామస్తులు లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. దాదాపు 5 కి.మీ మేరకు అటవీ ప్రాంతంలో యువనేత పాదయాత్ర కొనసాగించారు.

వైఎస్సార్‌కు నివాళులర్పించిన లోకేష్….

వెలుగోడు అటవీ ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్న సమయంలో నల్లకాల్వలో దివంగత మాజీముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి లోకేష్ నివాళులర్పించారు. అనంతరం సేవ్ ద టైగర్ క్యాంపెయిన్ ప్రతినిధులు ఇమ్రాన్ సిద్ధిఖీ, సీనియర్ జర్నలిస్టు పులిపాక బాలు యువనేతను మర్యాదపూర్వకంగా కలుసుకుని పులుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. అటవీ ప్రాంతంలో పాదయాత్ర సమయంలో తెలుగుగంగ కాల్వను యువనేత సందర్శించారు.

వెలుగోడు శివార్లలో ఫారెస్టు కార్యాలయం వద్ద భవన నిర్మాణ కార్మికులతో సమావేశమై వారి సాధకబాధకాలు విన్నారు. మధ్యాహ్నం భోజన విరామానంతరం వెలుగోడు మీదుగా పాదయాత్ర బోయరేవులకు చేరుకుంది. పాదయాత్ర దారిలో బెస్తలు, బుడగ జంగాలు, ఎస్సీలు, వికలాంగులు యువనేతను కలిసి తమ సమస్యలను విన్నవించారు. 99వరోజు 16.2 కి.మీ మేర పాదయాత్ర కొనసాగింది. ఇప్పటివరకు యువనేత లోకేష్ 1268.9 కి.మీలు పాదయాత్ర చేశారు.

IPL_Entry_Point