Dotted Lands Issue: ఏపీలో చుక్కల భూములకు శాశ్వత పరిష‌్కారం, సాగు దారులకే భూమిపై సంపూర్ణ హక్కు-key decision of ap government on dotted lands right of ownership of lands to cultivators ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Dotted Lands Issue: ఏపీలో చుక్కల భూములకు శాశ్వత పరిష‌్కారం, సాగు దారులకే భూమిపై సంపూర్ణ హక్కు

Dotted Lands Issue: ఏపీలో చుక్కల భూములకు శాశ్వత పరిష‌్కారం, సాగు దారులకే భూమిపై సంపూర్ణ హక్కు

HT Telugu Desk HT Telugu
May 12, 2023 06:23 AM IST

Dotted Lands Issue: ఆంధ్రప్రదేశ్‌లో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న చుక్కల భూముల సమస్య పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో చుక్కల భూముల్లో సాగు చేస్తున్న వారికే వాటిపై యాజమాన్య హక్కులు కల్పించాలని నిర్ణయించింది.

ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి
ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి

Dotted Lands Issue: దశాబ్దాలుగా రైతులు, అనుభవదారులు ఎదుర్కొంటున్న సమస్యకు ముగింపు పలుకుతూ చుక్కల భూముల చిక్కులకు శాశ్వత పరిష్కారం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రైతన్నలకు భూమిపై భరోసా లభించనుంది. సాగు చేస్తున్న భూములపై సర్వ హక్కులూ వారికే దక్కనున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా 97,471 రైతు కుటుంబాలకు మేలు చేస్తూ దాదాపు రూ.20,000 కోట్ల మార్కెట్‌ విలువ కలిగిన 2,06,171 ఎకరాల చుక్కల భూములకు సంపూర్ణ హక్కును అందించే కార్యక్రమాన్ని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో శుక్రవారం ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌ ప్రారంభించనున్నారు.

చుక్కల భూముల నేపథ్యం..

బ్రిటీష్‌ కాలంలో సుమారు వంద ఏళ్ల క్రితం భూసర్వే జరిగినప్పుడు ‘ప్రభుత్వ భూమి‘ లేదా ‘ప్రైవేటు భూమి‘ అని నిర్ధారణ చేయకపోవడంతో రెవెన్యూ రికార్డులలో రీ సెటిల్మెంట్‌ రిజిస్టర్‌- ఆర్‌ఎస్‌ఆర్‌‌లలో పట్టాదారు గడిలో ‘చుక్కలు‘ పెట్టి వదిలేశారు. ఆ భూములే ‘చుక్కల భూములు అయ్యాయి.

భూమిపై సంపూర్ణ హక్కులు లేక దశాబ్దాలుగా రైతులు ఆ భూములు అనుభవిస్తున్నా వాటిని అమ్ముకునే స్వేచ్ఛ లేక, సర్వ హక్కులు లేక ఇబ్బంది పడుతున్నారు. రైతులకు మరింత ఇబ్బంది కలిగేలా 2016లో ఈ భూములకు పూర్తిగా అన్యాయం చేసే నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వ అనాలోచిత చర్యల వల్ల ఈ భూములన్నింటిని ఒక్క కలం పోటుతో నిషేధిత భూముల జాబితాలో చేర్చడంతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది.

ఈ పరిస్థితిని సమూలంగా మారుస్తూ ప్రతి రైతన్న కుటుంబానికి మేలు జరగాలని, వారి ఆస్థిపై పూర్తి హక్కులు వారికే చెందాలని రెవెన్యూ కార్యాలయాలు, కోర్టుల చుట్టూ రైతన్నలు తిరిగే అవసరం లేకుండా, వారికి ఒక్క పైసా ఖర్చు కూడా లేకుండా దశాబ్దాల కాలం నాటి చుక్కల భూముల సమస్యలకు పరిస్కారం చూపుతూ నిర్ణయం తీసుకున్నారు.

ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు లక్ష మంది రైతన్నల కుటుంబాలకు రూ.20,000 కోట్ల లబ్ది కలుగనుంది. సంవత్సరాల తరబడి తమ స్వాధీనంలో ఉన్నా ఏ అవసరాలకు వాడుకోలేని దుస్థితి నుంచి వారి వారి భూములకు వారిని పూర్తి హక్కుదారులను చేసి సుమారు 97,471 కుటుంబాలకు దాదాపు రూ. 20,000 కోట్ల మేర లబ్ది చేకూర్చారు.

నిషేధిత జాబితా నుంచి తొలగింపు…

ప్రభుత్వ నిర్ణయంతో సర్వ హక్కులు కూడా లభించేలా నిషేధిత భూముల జాబితా నుండి 2,06,171 ఎకరాల భూమిని తొలగించారు. జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే సుమారు 22,000 మంది పేద రైతన్నలకు మేలు జరిగేలా నిషేధిత భూముల జాబితా నుండి సుమారు 35,000 ఎకరాల ‘‘షరతులు గల పట్టా భూములను తొలగించారు.

దేశంలోనే మొదటి సారిగా అనేక రకాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో వందేళ్ల తర్వాత చేపట్టిన ‘‘వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష‘ ద్వారా ఇప్పటివరకు 2000 గ్రామాల్లో 7,92,238 కి పైగా భూహక్కు పత్రాలు రైతులకు అందజేశారు. భూ వివాదాలు, భూ తగాదాలు లేని గ్రామాలు సాక్షాత్కరించాలనే ఆలోచనతో డిసెంబర్‌ 2023 నాటికి దశలవారీగా రాష్ట్రంలో ఉన్న మొత్తం 17,584 గ్రామాలు, పట్టణాల్లో భూముల రీసర్వే. పూర్తి చేసి శాశ్వత భూహక్కుపత్రాల జారీ చేయనున్నారు.

గిరిజనులకు అటవీ హక్కు పత్రాల పంపిణీ….

ఇప్పటికే దాదాపు 1,27,313 మంది గిరిజనులకు సుమారు 2.83 లక్షల ఎకరాల అటవీ హక్కుపత్రాల పంపిణీ చేశారు. పేద గిరిజనులందరికీ కనీసం రెండు ఎకరాల భూమి కేటాయించారు. కుటుంబములోని మహిళల పేరున పత్రాలు జారీ చేశారు.

తాజాగా రైతన్నలు రెవెన్యూ కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, ఒక్క పైసా కూడా చెల్లించే పని లేకుండా చుక్కల భూముల సమస్యలకు స్వస్థి పలికారు. రెవెన్యూ సమస్యలు, సలహాల కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌ 1902 సంప్రదించాలని సూచిస్తున్నారు.

IPL_Entry_Point