BRS in AP : జనసేనకు బీఆర్ఎస్ షాక్.. కారెక్కనున్న తోట చంద్రశేఖర్ !-janasena leader thota chandrasekhar to join bts on january 2 in presence of kcr ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Janasena Leader Thota Chandrasekhar To Join Bts On January 2 In Presence Of Kcr

BRS in AP : జనసేనకు బీఆర్ఎస్ షాక్.. కారెక్కనున్న తోట చంద్రశేఖర్ !

HT Telugu Desk HT Telugu
Jan 01, 2023 05:53 PM IST

BRS in AP : ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ వ్యూహాలను కేసీఆర్ వేగంగా అమలు చేస్తున్నారు. కొంతకాలంగా జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్.. జనవరి 2న కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్నారు. ఆయనతో పాటు పలువురు ఏపీ నేతలు కారెక్కనున్నారు.

తోట చంద్రశేఖర్
తోట చంద్రశేఖర్

BRS in AP : టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన గులాబీ పార్టీ.. ముందుగా ఏపీ నుంచే పార్టీ విస్తరణ ప్రారంభించే దిశగా కసరత్తు మొదలు పెట్టింది. ఇందుకోసం ఇప్పటికే ఏపీలోని పలువురు నేతలపై దృష్టి సారించింది. వారితో సంప్రదింపులు జరిపింది. ఈ చర్చల తర్వాత... కొంత మంది ఏపీ నేతలు బీఆర్ఎస్ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో.. ఇక చేరికలకు తలుపులు తెరిచిన కేసీఆర్.. ఏపీ రాజకీయాల్లో జనసేనకు తొలి షాక్ ఇచ్చారు. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ జనవరి 2న కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్నారు. ఆ వెంటనే... చంద్రశేఖర్ ను బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా కేసీఆర్ నియమించనున్నట్లు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

గతంలో ప్రజా రాజ్యం, వైఎస్సార్ కాంగ్రెస్ లో పనిచేసిన మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్.. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనసేనలో చేరారు. 2019లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. పార్టీలో కాపు సామాజికవర్గానికి చెందిన కీలక నేతగా ఉన్న ఆయన.. జనసేనలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడుగా కొనసాగుతున్నారు. అయితే కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో.. చంద్రశేఖర్ తో సంప్రదింపులు జరిపిన కేసీఆర్.. బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. ఇందుకు సుముఖత వ్యక్తం చేసిన ఆయన.. పార్టీ మార్పుపై ఇప్పటికే సన్నిహితులు, అనుచరులకు సమాచారం ఇచ్చారు. జనవరి 2వ తేదీన అందరూ అందుబాటులో ఉండాలని చెప్పారు. సోమవారం ఉదయం గుంటూరు అరండల్ పేట నుంచి భారీ ఎత్తున ర్యాలీగా హైదరాబాదు వెళ్లి.. కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్నారు. అదే సమయంలో.... ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ పేరుని కేసీఆర్ ప్రకటించనున్నారని తెలుస్తోంది.

చంద్రశేఖర్ తో పాటు పలువురు నేతలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు.... గతంలో జనసేన, బీజేపీలో పనిచేసిన మాజీ మంత్రి రామలింగేశ్వరావు.... విశాఖపట్నంకు చెందిన విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి పార్థసారథి బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. వీరితోపాటు మరికొందరు నేతలు కేసీఆర్ తో కలిసి నడవనున్నారని సమాచారం. కీలక నేతలతో పాటు పార్టీ అనుబంధ విభాగాలపైనా దృష్టి సారించిన కేసీఆర్.. తొందర్లోనే ఏపీకి సంబంధించి విద్యార్థి, రైతు, యువజన, మహిళా విభాగాలను ప్రారంభించేందుకు కసరత్తు మొదలు పెట్టారు.

IPL_Entry_Point