Janasena : 2009లో చేసిన పొరపాట్లు మళ్ళీ జరగవన్న పవన్ కళ్యాణ్
గెలుపొటములతో సంబంధం లేకుండా రాజకీయాలను కొనసాగిస్తానని Janasena జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జనసేన రాష్ట్ర కార్యాలయంలో జరిగిన లీగల్ సెల్ సమావేశంలో పవన్ మాట్లాడారు. చట్టసభల్లో ప్రభుత్వ వైఫల్యాలను నిలదీసే బలం లేకపోవడంపై చాలా సార్లు బాధ కలిగిందని చెప్పారు. అయితే గెలుపు ఓటములతో సంబంధం లేకుండా రాజకీయాలు కొనసాగిస్తానని ప్రకటించారు. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీయడానికి అవసరమైన యంత్రాంగాన్ని లీగల్ సెల్ ద్వారా తయారు చేయాలనుకుంటున్నట్లు చెప్పారు.
ప్రజారాజ్యం విషయంలో జరిగిన పొరపాట్లు జనసేన విషయంలో జరగవని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 2003 నుంచి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై అధ్యాయనం చేస్తున్నామని 2009లో క్రియాశీల రాజకీయాల్లో వచ్చానని, సుదీర్ఘ అధ్యాయనం తర్వాతే రాజకీయాల్లో కొనసాగుతున్నానని చెప్పారు.

అపరిమితమైన మేధస్సు, అపరిమితమై ధనం లేకపోయినా మంచి చేయాలనే తపన మాత్రం పుష్కలంగా ఉందని, ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతోనే రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కళ్యాణ్ చెప్పారు. రాజకీయాల్లో మార్పు కోసం, అణగారిన వర్గాల ప్రజల శ్రేయస్సు కోసం తన వంతు కృషి చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. అంబేడ్కర్ ఆశయాల కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు.
పార్టీ నిర్మాణానికి లక్షల కోట్లు ఉన్నా సాధ్యం కాదని, బలమైన సంకల్పం, సైద్ధాంతిక నిబద్ధత మాత్రమే అవసరమని Janasena పవన్ కళ్యాణ్ చెప్పారు. 2019లో ఓటమికి గురైనా అందరూ ఊహించినట్లు పార్టీ వదిలేసి పారిపోలేదని చెప్పారు. చాలామంది ఆశించినట్లు పార్టీని మూసేసి, తలవంచుకుని పారిపోలేదన్నారు. అవమానాలు అన్ని స్వీకరించి రాజకీయాల్లో మార్పు రావాలని ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. రాజకీయ పార్టీని గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ముందుకు నడిపిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు. పార్టీని వదిలి వెళ్లేది లేదని, తనను నమ్ముకుని ఉన్న వారి కోసం చివరి వరకు పోరాడతానని స్పష్టం చేశారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ స్ఫూర్తితో రాజకీయాలు కొనసాగిస్తానని చెప్పారు.
2014లో టీడీపీకి మద్దతు ఇవ్వడానికి Janasena కు స్పష్టమైన కారణాలున్నాయని, 2009లో రాజకీయంగా జరిగిన తప్పుల్ని సరిదిద్దుకోడానికి, 2014లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగానే అందరితో సంప్రదించి మద్దతు ఇచ్చినట్లు చెప్పారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సమస్యలు ఎదురైనపుడు విధానపరమైన విధానంతోనే ముందుకు వెళ్ళినట్లు చెప్పారు.
ప్రస్తుతం ఆంధప్రదేశ్‌కు రాజధాని లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిని రాజధానిగా ప్రకటించినపుడు వేల ఎకరాల సేకరణపై తాను అభ్యంతరం వ్యక్తం చేశానని, నాటి ప్రతిపక్ష నాయకుడు మాత్రం ఇక్కడే ఇల్లు కట్టుకుని రాజధానికి 30వేల ఎకరాలు కావాలని, ఇప్పుడు మూడు రాజధానులని మాట మార్చారని మండిపడ్డారు. మాట మార్చే నాయకుడికి చట్టాలు చేసే హక్కు ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు.
చట్ట సభల్లో బలం ఉంది కాబట్టి ఏమైనా చేయొచ్చనే ధోరణితో పాలకులు సాగుతున్నారని ఆరోపించారు. ఓటింగ్‌లో ప్రజలు పార్టీలను గెలిపిస్తే తాము ఏమైనా చేయొచ్చని పాలక పక్షం భావిస్తుందని విమర్శించారు. 2019లో ప్రజలు ఆలోచించి తీసుకున్నా, ఆలోచించకుండా తీసుకున్నా దాని పర్యావసానాలు ఇప్పుడు ప్రజలు అనుభవిస్తున్నారని చెప్పారు. 151 సీట్లు వచ్చినంత మాత్రాన మెజార్టీ ప్రజల అమోదం లభించినట్లు కాదన్నారు.