AP Inter Exams: రేపటి నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు
AP Inter Exams: ఏపీలో రేపటి నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నాయి. మే 24 నుంచి జూన్ 1వ తేదీ వరకు ఇంటర్ పరీక్షల్ని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
AP Inter Exams: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మే 24 నుంచి జూన్ 1వ తేదీ వరకు ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
ట్రెండింగ్ వార్తలు
ఇంటర్ మొదటి ఏడాది విద్యార్థులకు ఉదయం 9 నుంచి 12 వరకు, రెండో సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 02.30 నుంచి సాయంత్రం 05.30 వరకు పరీక్షలు జరుగనున్నాయి.పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు ముందుగానే చేరుకోవాలని ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.
పరీక్షా కేంద్రాల్లో మంచినీరు, వైద్య సేవలు అందుబాటులో ఉంచుతున్నారు. పరీక్షల్లో అవకతవకలకు పాల్పడకుండా, మాస్ కాపీయింగ్ జరగకుండా అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి తాడేపల్లిలోని ఏపీ బోర్డు ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్, విజయవాడలోని ఆర్‌ఐవో కార్యాలయాలకు అనుసంధానం చేశారు. పరీక్షల నిర్వహణకు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ అధికారులు, ఇన్విజిలేటర్లు, ప్రత్యేక బృందాలను ఇప్పటికే నియమించారు. ప్రశ్నపత్రాలను పరీక్ష కేంద్రాలకు తరలించేందుకు ప్రత్యేక వాహనాలను సిద్ధం చేశారు.
ఇంటర్ పరీక్షలు సక్రమంగా నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. పరీక్షల నిర్వహణలో సిబ్బందికి తగిన సూచనలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల్లోకి అధికారులతోపాటు సిబ్బంది కూడా ఫోన్లను తీసుకెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల్లో సమాచార సేకరణకు చీఫ్ సూపరింటెండెంట్ ఒక్కరికే ఇంటర్‌బోర్డు ఇచ్చిన కీప్యాడ్ ఫోన్ మాత్రమే అనుమతిస్తారు. విద్యార్థులు ఎలక్ట్రానిక్ వస్తువులను లోపలికి తీసుకెళ్లకూడదని ఆదేశించారు. విద్యార్ధులకు పరీక్షా కేంద్రాల్లో సమస్యలు ఎదురైతే పరిష్కారం కోసం కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏమైనా ఫిర్యాదులుంటే 7075136947 నెంబరులో సంప్రదించవచ్చు.