YS Avinash Reddy : కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు…-cbi issues notices kadapa mp ys avinash reddy and asks to attend investigation on january 24 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Cbi Issues Notices Kadapa Mp Ys Avinash Reddy And Asks To Attend Investigation On January 24

YS Avinash Reddy : కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు…

HT Telugu Desk HT Telugu
Jan 23, 2023 10:50 PM IST

YS Avinash Reddy : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణ చేస్తున్న సీబీఐ.. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. జనవరి 24న హైదరాబాద్ లో విచారణకు రావాలని స్పష్టం చేసింది.

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (facebook)

YS Avinash Reddy : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణలో దూకుడు పెంచిన సీబీఐ.. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. కేసు విచారణలో భాగంగా.. సోమవారం పులివెందులకు వెళ్లిన సీబీఐ అధికారులు.. అవినాష్ పీఏకి నోటీసులు అందజేశారు. మంగళవారం రోజు విచారణకు రావాలని స్పష్టం చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సీబీఐ ఇచ్చిన నోటీసులపై స్పందించిన వైఎస్ అవినాష్ రెడ్డి... లేఖ ద్వారా కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులకి సమాధానం ఇచ్చారు. విచారణకు అన్ని విధాలా సహకరిస్తానని అందులో పేర్కొన్నారు. అయితే.. మంగళవారం రోజు పులివెందులలో బిజీ షెడ్యూల్ ఉందని... ఆ రోజున విచారణకు హాజరు కాలేనని తెలిపారు. ఈ నేపథ్యంలో.. అవినాష్ రెడ్డి సమాధానంపై సీబీఐ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది.

కాగా... సోమవారం పులివెందుల వైకాపా కార్యాలయానికి వెళ్లిన సీబీఐ అధికారులు... వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి... వైఎస్ భాస్కర్ రెడ్డి కోసం ఆరా తీశారు. ఆయన ఆఫీసుకి రాలేదని కార్యకర్తలు చెప్పడంతో వెనుదిరిగిన సీబీఐ అధికారులు... పట్టణంలో ఉన్న భాస్కర్ రెడ్డి ఇంటి పరిసరాలను పరిశీలించారు. ఆ తర్వాతే... వైఎస్ అవినాష్ పీఏకి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీం కోర్టు ఇటీవలే కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణను తెలంగాణ హైకోర్టుకి బదిలీ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. గంగిరెడ్డి బెయిల్ రద్దు పై తెలంగాణ హైకోర్టే నిర్ణయిస్తుందని జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. గతంలో బెయిల్ మంజూరు చేసినప్పుడు కింద స్థాయి కోర్టు మెరిట్ ను పరిగణలోకి తీసుకోలేదని.. ఈ అంశంలో విచారణ జరిపి, అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం బెయిల్ రద్దుపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హైకోర్టుకి.. సుప్రీం ధర్మాసనం సూచించింది.

2019, మార్చి 15న వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. 30 ఏళ్ల పాటు వివేకాకు ప్రధాన అనుచరుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో పలువురు ప్రముఖుల పాత్ర కూడా ఉందని ఆరోపణులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే.. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు గతంలోనే తీర్పు వెలువరించింది. ఈ కేసు దర్యాప్తు ఏపీలో జరిగితే న్యాయం జరగదని వివేకా కుమార్తె, సతీమణి వ్యక్తం చేసిన ఆందోళన సరైనదనే భావిస్తున్నామని, అందుకే విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టుకు మారుస్తున్నామని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఏపీలో జరుగుతున్న విచారణపై మరణించిన వ్యక్తి కుమార్తె, భార్య అసంతృప్తిగా ఉన్నందున ప్రాథమిక హక్కులను పరిగణనలోకి తీసుకుని కేసును కడప న్యాయస్థానం నుంచి హైదరాబాద్‌ కు బదిలీ చేస్తున్నట్లు సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

IPL_Entry_Point