Pawan Kalyan : బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్... పవన్ కళ్యాణ్-bcs means back bone class says janasena chief pawan kalyan ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Bcs Means Back Bone Class Says Janasena Chief Pawan Kalyan

Pawan Kalyan : బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్... పవన్ కళ్యాణ్

HT Telugu Desk HT Telugu
Mar 11, 2023 10:58 PM IST

Pawan Kalyan : జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంగళగిరిలో బీసీ సంక్షేమంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్... కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కాపు నాయకుడిని కాదని.. ప్రజలందరికీ నాయకుడిగా ఉండాలని అనుకుంటున్నానని చెప్పారు. బీసీలను అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నానని అన్నారు. బీసీలు ఆర్థిక పరిపుష్టి సాధించిన రోజు రాజ్యాధికారం తప్పక సిద్ధిస్తుందని వ్యాఖ్యానించారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (twitter)

Pawan Kalyan : బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు.. బ్యాక్ బోన్ క్లాస్ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. బీసీలు ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. హక్కుల కన్నా ముందు బీసీలు ఐక్యత సాధించాలని, ఆర్థిక పరిపుష్టి సాధించిన రోజు రాజ్యాధికారం తప్పక సిద్ధిస్తుందని వ్యాఖ్యానించారు. శనివారం (మార్చి 11న) మంగళగిరి పార్టీ కార్యాలయంలో బీసీ సంక్షేమంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్... కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కాపు నాయకుడిని కాదని... ఒకే కులానికి మాత్రమే పరిమితం కాదని అన్నారు. తాను ప్రజలందరికీ నాయకుడిగా ఉండాలని అనుకుంటున్నానని చెప్పారు. అర్థ రూపాయికి ఓటు అమ్ముకుంటే ఎప్పటికే దేహీ అనాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. ఇన్నేళ్లుగా బీసీల్లో సమైక్యత ఎందుకు సాద్యం కాలేదో అర్థం కావటం లేదన్నారు.

ట్రెండింగ్ వార్తలు

"బీసీలకు అవకాశం ఇస్తేనే కదా.. నాయకత్వం ఎదిగేది. మీ ఓట్లే మీకు పడవు అని బీసీలను హేళన చేస్తున్నారు. బీసీ అభ్యర్థిని నిలబెట్టినప్పుడు అందరూ ఏకతాటిపైకి రావాలి. నన్ను ఒక కులానికి పరిమితం చేసి బీసీ నాయకులతో తిట్టిస్తున్నారు. నన్ను బీసీలతో తిట్టిస్తే రెండు వర్గాలవారు గ్రామస్థాయిలో ఘర్షణకు దిగుతారు. తెలంగాణలో 26 బీసీ కులాలను బీసీ స్టేటస్ నుంచి తొలగించారు. అప్పుడు ఎందుకు బీసీలు ఉద్యమించలేదు ? బీసీ కులాలను జాబితా నుంచి తొలగించడంపై ఒక్క నాయకుడు స్పందించలేదు. ఏపీ రాజకీయాల్లోకి వస్తోన్న బీఆర్ఎస్ దీనిపై వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. బీసీ కులాల తొలగింపుపై వైకాపా, టీడీపీ స్పందించాలి" అని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.

ఏడాదికి రూ. 10 వేలు ఇచ్చి బీసీల కడుపుకొడుతున్నారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. దాదాపు రూ. 34 వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారని ఆరోపించారు. 56 బీసీ కార్పొరేషన్ల పదవులు స్టిక్కర్లకే పరిమితం అయ్యాయని.. 36 మంది టీటీడీ బోర్డు సభ్యులు ఉంటే అందులో కేవలం ముగ్గురు మాత్రమే బీసీలు ఉన్నారని తెలిపారు. జీవో నంబర్ 217 తీసుకొచ్చి మత్స్యకారుల కడుపుకొడుతున్నారని... ప్రజలకు న్యాయం చేయని జీవో చిత్తుకాగితంతో సమానమని.. అందుకే తాను ఆ జీవోను చించివేశానని పేర్కొన్నారు. రూ. 20 కోట్లు పెట్టి మత్స్యకారులకు జెట్టీలు ఏర్పాటు చేస్తే వలసలు నిరోధించవచ్చని చెప్పారు. 400 బ్యాక్ లాగ్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. జరుగుతున్న అన్యాయాలపై బీసీలు ఉద్యమిస్తే.. తాను అండగా ఉండి పోరాడతానని జనసేనాని హామీ ఇచ్చారు. ఎక్కడికి రమ్మన్నా వచ్చి దీక్షకు కూర్చుంటానని చెప్పారు.

కాపులు నిజంగా తనని ఓన్ చేసుకుని ఉంటే ఎన్నికల్లో ఓడిపోయే వాడిని కాదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. గోదావరి జిల్లాలో జనసేన పార్టీకి వచ్చిన ఓట్లలో సగానికిపైగా బీసీలు వేసినవే అని చెప్పారు. వైకాపా, టీడీపీ నాయకులు ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటారు కనుకే వారు బలంగా ఆటలాడతారని.. మనం ముందు ఆర్థిక పరిపుష్టి సాధించాలని అన్నారు. బీసీలకు రాజకీయ సాధికారత ఎలా ఇవ్వాలి ? ఆర్థికపరిపుష్టికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి ? విద్యా పరంగా ఎలాంటి మార్పులు తీసుకురావాలి ? అనే అంశాలపై జనసేన ముసాయిదా రూపొందిస్తోందని చెప్పారు. బీసీల గెలుపే జనసేన గెలుపన్నారు. వెనుకబడిన వర్గాలను అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నానని పవన్ తెలిపారు.

IPL_Entry_Point