Driving License : డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే వాహనం సీజ్ !-warangal police says riders without license will be punished and vehicles will be seized ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Warangal Police Says Riders Without License Will Be Punished And Vehicles Will Be Seized

Driving License : డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే వాహనం సీజ్ !

HT Telugu Desk HT Telugu
Jan 07, 2023 09:49 PM IST

Driving License : వరంగల్ నగరంలో రోడ్డు ప్రమాదాల నివారణ.. ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే.. వెహికల్ ని సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. జనవరి 17 నుంచి నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని అన్నారు.

వరంగల్ పోలీస్
వరంగల్ పోలీస్

Driving License : డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా .. అనేక మంది వాహనాలతో రోడ్లపైకి వస్తుంటారు. డ్రైవింగ్ లో సరైన శిక్షణ, నైపుణ్యం సాధించకుండానే ట్రాఫిక్ లో రివ్వున దూసుకెళుతుంటారు. స్కూలు పిల్లలు, ఇంటర్ చదవుతున్న విద్యార్థులు కూడా బైకుల మీద రోడ్లపైకి వస్తోన్న సందర్భాలు మనం నిత్యం చూస్తూనే ఉంటాం. రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే ఇలాంటి చర్యలకు ఇక చెక్ పెట్టాలని నిర్ణయించారు.. వరంగల్ నగర పోలీసులు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రోడ్లపైకి వస్తే.. వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. దీంతోపాటుగా కేసులు కూడా నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నియంత్రణ సహా క్రమశిక్షణతో కూడిన ట్రాఫిక్ ను కొనసాగించేందుకు నగర పోలీస్ కమిషనరేట్ పలు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా జనవరి 17వ తేదీ నుంచి లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు చేపట్టనుంది. ఈ మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్... గట్టి హెచ్చరికలు జారీ చేశారు. లైసెన్స్ కలిగి ఉన్న వారే వాహనాలు నడపాలని స్పష్టం చేశారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే.. వాహనం సీజ్ చేయడంతో పాటు.. వాహన యజమానిపై మోటార్ వెహికిల్ యాక్ట్ 180 మరియు 181 సెక్షన్ల కింద కోర్టులో చార్జిషీట్ దాఖలు చేస్తామని తెలిపారు. రవాణా శాఖ నుంచి లైసెన్స్ పొంది.. ఆ పత్రాలను పోలీసులకి చూపించిన తర్వాతే తిరిగి వాహనాన్ని అప్పగిస్తామని స్పష్టం చేశారు.

మైనర్లు వాహనాలు నడిపితే వారి వాహనాలు కూడా సీజ్ చేసి, తల్లిదండ్రులకు లేదా వాహన యజమానిపై కోర్టులో చార్జ్ షీట్ సమర్పించడంతో పాటు మైనర్లపై కూడా జువైనల్ కోర్టులో చార్జ్ షీట్ సమర్పిస్తామని సీపీ వెల్లడించారు. అలాగే మైనర్ తల్లిదండ్రులకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణ.. ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసమే చట్టాలను పటిష్టంగా అమలు చేస్తున్నామని.. వాహనదారులు పోలీసులకి సహకరించాలని కోరారు.

ఇటీవలే హైదరాబాద్ లోను డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. మద్యం తాగి వాహనం నడిపితే చట్ట ప్రకారం మొదటిసారి రూ. 10 వేల జరిమానా.. 6 నెలల జైలు శిక్ష... రెండోసారి దొరికితే రూ. 15 వేల జరిమానా, 2 సంవత్సరాల జైలు శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ రెండోసారి దొరికితే... డ్రైవింగ్ లైసెన్స్ శాశ్వతంగా రద్దు అవుతుందని తెలిపారు. ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్ లో ప్రయాణం, ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ దొరికితే చట్ట పరంగా కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు.

IPL_Entry_Point