TSRTC Singareni Darshan : టీఎస్ఆర్టీసీ నుంచి కొత్త టూర్ ప్యాకేజీ.. సింగరేణి దర్శన్..-tsrtc introduces new tour package singareni darshan details ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Tsrtc Introduces New Tour Package Singareni Darshan Details

TSRTC Singareni Darshan : టీఎస్ఆర్టీసీ నుంచి కొత్త టూర్ ప్యాకేజీ.. సింగరేణి దర్శన్..

HT Telugu Desk HT Telugu
Dec 27, 2022 03:03 PM IST

TSRTC Singareni Darshan : సింగరేణి దర్శన్ పేరిట మరో కొత్త టూర్ ప్రవేశపెట్టింది… టీఎస్ఆర్టీసీ. ప్రతి శనివారం ఉండే ఈ టూర్ లో.. బొగ్గు గనులు సహా విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ సందర్శన ఉంటుందని ప్రకటించింది.

టీఎస్ఆర్టీసీ సింగరేణి దర్శన్
టీఎస్ఆర్టీసీ సింగరేణి దర్శన్

TSRTC Singareni Darshan : ఇప్పటికే రకరకాల ప్యాకేజీలు ప్రవేశపెట్టి ప్రయాణికులను ఆకర్షిస్తోంది... టీఎస్ఆర్టీసీ. వినూత్న ఆఫర్లతో ప్రజల మనన్నలను పొందే ప్రయత్నం చేస్తోంది. కుటుంబం, బంధు, మిత్రులతో కలిసి విహార యాత్రలకు వెళ్లి సేదాతీరాలని అనుకునే వారి ఆసక్తికి అనుగుణంగా ప్యాకేజీలు రూపకల్పన చేసి.. అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటికే .. నాగార్జున సాగర్ ఎత్తిపోతల, ... హైదరాబాద్ - కుంతాల.. హైదరాబాద్ దర్శన్.. టీటీడీ దర్శన్ పేరిట ప్రత్యేక ప్యాకేజీలను తీసుకొచ్చింది. ఈ క్రమంలో.. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి గురించి ప్రత్యక్షంగా తెలుసుకోవాలని అనుకునే వారి కోసం... సింగరేణి దర్శన్ పేరిట మరో కొత్త టూర్ ప్రవేశపెట్టింది. ప్రతి శనివారం.. ఈ టూర్ ఉంటుందని ప్రకటించింది.

బొగ్గు ఉత్పత్తి ద్వారా దేశంలో వెలుగులు నింపుతోన్న సింగరేణి సంస్థ.. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఇక్కడ బొగ్గు గనులు ఎలా ఉంటాయి... భూగర్భంలో ఉన్న బొగ్గు ఎలా బయటకు తీస్తారనే అంశాలపై చాలా మందిలో ఆసక్తి ఉంటుంది. ఇటీవల కుటుంబ సమేతంగా రామగుండం వెళ్లిన టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్.. ఆర్టీ - 2 ప్రాంతంలోని వాకిల్ పల్లి గనిని సందర్శించారు. ఆసక్తిగా ఉండటంతో.. వెంటనే సింగరేణికి లేఖ రాశారు. బొగ్గు బావులని పర్యాటక ప్రాంతం చేద్దామని ప్రతిపాదించారు. దీనికి సింగరేణి సీఎండీ శ్రీధర్ అంగీకరించడంతో... టీఎస్ఆర్టీసీ ప్యాకేజీకి రూపకల్పన చేసింది.

ప్యాకేజీ వివరాలు....

సింగరేణి దర్శన్ ప్యాకేజీ ప్రతి శనివారం ఉంటుంది. హైదరాబాద్ నుంచి మొదలయ్యే బస్సులకి జేబీఎస్, అల్వాల్ వద్ద పికప్ పాయింట్లు ఉంటాయి. ప్రతి శనివారం ఉదయం జేబీఎస్ నుంచి ఉదయం 6 గంటలకు బస్సు బయలుదేరుతుంది. ఉదయం 10:30 గంటలకు సింగరేణి గనులకి చేరుకుంటుంది. టూర్ లోభాగంగా.. జీడీకే, భూగర్బ మైన్లు, మైన్ రెస్క్యూ స్టేషన్, ఓపన్ కాస్ట్ మైన్ వ్యూ, జై పూర్ పవర్ ప్లాంట్ సందర్శన ఉంటుంది. అనంతరం.. రాత్రి 11.45 నిమిషాలకు బస్సు హైదరాబాద్ కు తిరిగి వస్తుంది.

సింగరేణి దర్శన్ యాత్ర టికెట్ ధర.. మధ్యాహ్నం భోజనంతో కలిపి ఒక్కరికి రూ. 1600గా నిర్ణయించారు. అయితే... ఈ యాత్రకు పిల్లలకు అనుమతి లేదని టీఎస్ఆర్టీసీ పేర్కొంది. యాత్రకు రావాలని అనుకునే మహిళలు జీన్స్ లేదా పంజాబీ ట్రౌజర్స్ ధరించాలని సూచించింది. యాత్రకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం 040 69440000, 040 - 23450033 నంబర్ లలో సంప్రదించవచ్చు.

IPL_Entry_Point