Jobs in TS PTC : పోలీస్‌ ట్రైనింగ్‌ కాలేజీలో ఉద్యోగాలు….-ts police jobs in telangana police training college ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Ts Police Jobs In Telangana Police Training College

Jobs in TS PTC : పోలీస్‌ ట్రైనింగ్‌ కాలేజీలో ఉద్యోగాలు….

HT Telugu Desk HT Telugu
Jul 22, 2022 09:34 AM IST

తెలంగాణలో పెద్ద ఎత్తున పోలీసు నియామకాలు చేపట్టనున్న నేపథ్యంలో తెలంగాణ పోలీస్ ట్రైనింగ్‌ కాలేజీలో పనిచేయడానికి అనుభవజ్ఞులైన రిటైర్డ్‌ ఆఫీసర్లు, ఇండోర్‌ ఇన్‌స్ట్రక్టర్ల నుంచి దరఖాస్తుల్ని స్వీకరిస్తున్నారు.

పోలీస్‌ ట్రైనింగ్ కాలేజీలో ఉద్యోగాలు
పోలీస్‌ ట్రైనింగ్ కాలేజీలో ఉద్యోగాలు (twitter)

తెలంగాణ రాష్ట్రంలోె దాదాపు 15,500 మంది కానిస్టేబుళ్లు, సబ్‌ ఇన్‌స్పెక్టర్ల నియామకానికి నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో పోలీస్‌ శిక్షణా కళాశాలలో సిబ్బంది నియామకానికి ప్రకటన విడుదల చేశారు. పెద్ద ఎత్తున పోలీసుల నియామక చేపడుతుండటంతో వారికి అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు అనుభవమున్న సీనియర్ల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. రిటైర్డ్‌ పోలీస్‌ అధికారులతో కొత్తగా రిక్రూట్ అయ్యే సిబ్బందికి శిక్షణ కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాత్కలిక ప్రతిపాదికన ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్‌ ఉద్యోగ నియామకాల ప్రక్రియ ప్రారంభం కావడంతో వారికి శిక్షణనిచ్చేందుకు రిటైర్డ్‌ అధికారుల నియామకాలు ప్రారంభించారు. క్యాడెట్‌ ఇండక్షన్ ట్రైనింగ్‌ కోసం గతంలో పోలీసు బలగాల శిక్షణ కేంద్రాల్లో పనిచేసిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. సిఆర్‌పిఎఫ్‌, ఆర్‌ఫిఎఫ్‌, ఆర్మీ, ఏపిఎస్పీ, టిఎస్‌ఎస్పీ, ఆర్మ్డ్‌ రిజర్వ్‌ విభాగాల్లో పనిచేసిన వారిని అర్హులుగా ప్రకటించారు.

గతంలో ఔట్‌డోర్‌ ఇన్‌స్ట్రక్టర్లుగా పనిచేసిన రిటైర్డ్‌ అధికారులు, పబ్లిక్‌ ప్రాసిక్యూట్లు, ఏపిపి హోదాలో పనిచేసిన లా ఆఫీసర్లు, రిటైర్డ్‌ ఫోరెన్సిక్ ఆఫీసర్లు, ఇండోర్ ఇన్‌స్ట్రక్టర్లు, గెస్ట్ ఫ్యాకల్టీలుగా పనిచేయాలనే ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించారు. ఆసక్తి ఉన్న వారు జులై 31లోగా అంబర్‌పేట్‌లోని పోలీస్‌ ట్రైనింగ్‌ కాలేజీ వైస్‌ ప్రిన్సిపల్‌కు తమ దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలు 944001936లో సంప్రదించవచ్చు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారి భారీ ఎత్తున పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తున్న నేపథ్యంలో వారికి అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు పోలీస్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఒకే సారి 15వేలమందికి పైగా కానిస్టేబుళ్లు, ఎస్సైల నియమకాలను చేపట్టడంతో అంతమందికి ఏకకాలంలో శిక్షణ ఇవ్వడానికి పెద్ద ఎత్తున సిబ్బంది అవసరమని అంచనా వేస్తున్నారు.

మహిళలు, పురుషులకు ప్రత్యేకంగా శిక్షణా శిబిరాలను నిర్వహించాల్సి ఉండటంతో అందుకు తగ్గట్లుగా వృత్తి పరమైన శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పోలీస్‌ శిక్షణా కేంద్రాల్లో ఏక కాలంలో శిక్షణ కొనసాగించడానికి అనువుగా మాజీ పోలీస్ అధికారుల సేవల్ని వినియోగించుకోనున్నారు. దీంతో పాటు విధి నిర్వహణకు అవసరమైన సాంకేతిక శిక్షణ, న్యాయపరమైన అంశాలలో శిక్షణ ఇవ్వనున్నారు.

IPL_Entry_Point

టాపిక్