TS Governor Vs State : గవర్నర్ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం న్యాయపోరాటం….-ts governor vs state telanagana government may proceed to high court on governor issued for not approving budget proposals ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Governor Vs State : గవర్నర్ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం న్యాయపోరాటం….

TS Governor Vs State : గవర్నర్ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం న్యాయపోరాటం….

HT Telugu Desk HT Telugu
Jan 30, 2023 07:26 AM IST

TS Governor Vs State తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కంట్లో నలుసులా వ్యవహరిస్తున్న గవర్నర్‌ వ్యవహార శైలిపై న్యాయపోరాటం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర బడ్జెట్‌కు సంబంధించిన ప్రతిపాదనలకు అమోదం తెలుపకుండా తన వద్దే ఉంచుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం అసహనం వ్యక్తం చేస్తోంది. గవర్నర్ వ్యవహార శైలిపై తాడోపేడో తేల్చుకోవాలని భావిస్తోంది. తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతోంది.

గవర్నర్ వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించనున్న ప్రభుత్వం
గవర్నర్ వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించనున్న ప్రభుత్వం (tshc.in)

TS Governor Vs State తెలంగాణ గవర్నర్ వ్యవహారంపై హైకోర్టులో తేల్చుకోవాలని ప్రభుత్వం బావిస్తోంది. బడ్జెట్‌‌కు అమోదం విషయంలో హైకోర్టుకు వెళ్లాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సోమవారం హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఫిబ్రవరి 3వ తేదీ నుంచి తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నది. ఇందులో ఎఫ్‌ఆర్బీఎం పరిమితి అంశంతో పాటు, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన వెంటనే రాష్ట్ర బడ్జెట్‌ను శాసనసభకు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది.

రాజ్యాంగ నిబంధనల ప్రకారం బడ్జెట్‌ ప్రతిపాదనలను అసెంబ్లీలో పెట్టేందుకు గవర్నర్‌ అనుమతించాల్సి ఉంది. రాష్ట్ర బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ను పలుమార్లు సంప్రదించించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ నుంచి సానుకూల స్పందన రాలేదని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

రాష్ట్ర ఆర్థికశాఖ కార్యదర్శి స్వయంగా గవర్నర్‌ను కలిసి అసెంబ్లీలో బడ్జెట్‌ సమర్పణకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరినా, ఇప్పటికీ అనుమతి రాలేదని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ జమా ఖర్చుల పద్దులకు ఆర్థిక సంవత్సరం ముగియడానికి ముందే అసెంబ్లీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

బడ్జెట్ ప్రతిపాదనలకు రాష్ట్ర గవర్నర్‌ నుంచి ఇప్పటివరకు అనుమతి రాని నేపథ్యంలో రాజ్యాంగపరమైన సమస్య తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై పడింది. అందుకే రాష్ట్ర బడ్జెట్‌ సమర్పణకు గవర్నర్‌ ఆమోదం కోసం హైకోర్టుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు ఆలోచిస్తున్నట్టు అధికార వర్గాలు భావిస్తున్నాయి.

సమయం కావాలంటున్న గవర్నర్….

తెలంగాణ బడ్జెట్‌ ప్రతిపాదనలకు అమోదం విషయంలో గవర్నర్ తమిళ సై స్పందించారు. ఓ జాతీయ చానల్‌తో మాట్లాడుతూ "తనకు కొంత సమయం కావాలని ప్రభుత్వానికి చెప్పానన్నారు. ఎన్నికల నేపథ్యంలో హడావిడిగా బిల్లులు చేసి పంపారని చెప్పుకొచ్చారు.

మరోవైపు పురపాలక చట్ట సవరణ బిల్లును మీ దగ్గరికి పంపి ఐదునెలలవుతుందనే ప్రశ్నకు బిల్లులను అమోదించే విషయంలో తనకు టైమ్‌ లిమిట్‌ లేదని, ఆపే అధికారం తనకు ఉన్నదని సమాధానమిచ్చారు. బిల్లుల రూపకల్పనలో ‘ప్రజా ప్రయోజనం దాగున్నదో లేదో తెలుసుకోవడానికే ఆపినట్లు వివరించారు. అది తెలుసుకోడానికి మరింత సమయం కావాలని అడిగానని’ చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లుతో ప్రజలకు ప్రయోజనం కలుగుతుందా? లేదా? తెలుసుకోవడానికి ఐదు నెలల సమయం పడుతుందా? ఒకవేళ ప్రయోజనం లేేదని భావిస్తే దానిని తిప్పి పంపాలని పెండింగ్‌లో ఉంచడం ఏమిటని ప్రభుత్వ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

IPL_Entry_Point