TRS On Modi| ఇప్పుడు విభజన అశాస్త్రీయం అంటారేంటి? తెలంగాణ ప్రజలను మోడీ అవమానించారు..
ఏడేళ్ల కిందట సాధించుకున్న తెలంగాణ విషయాన్ని ఇప్పుడు ప్రస్తావించాల్సిన అవసరం ఏంటని టీఆర్ఎస్ ఎంపీలు ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల పోరాటాన్ని మోడీ అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల పోరాటంతోనే తెలంగాణ సాధించుకున్నామని చెప్పారు.
విభజనపై ఇప్పుడు మోడీ కామెంట్స్ చేయడంపై టీఆర్ఎస్ ఎంపీలు మండిపడ్డారు. ఏపీ విభజనను ఉద్దేశించి రాజ్యసభలో ప్రధాని మోడీ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎంపీలు దిల్లీలో బుధవారం మీడియా సమావేశం పెట్టారు. అంతకుముందు మోడీ వ్యాఖ్యలను ఖండిస్తూ.. పార్లమెంటు గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు.
ట్రెండింగ్ వార్తలు
అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు ఆమోదానికి ఎలాంటి అశాస్త్రీయం ఉందో చెప్పాల్సిన అవసరం బీజేపీకి ఉందని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు అన్నారు. అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాకనే.. తెలంగాణ బిల్లు ఆమోదం పొందిందని గుర్తు చేశారు. అలాంటప్పుడు.. అది అశాస్త్రీయం ఎలా అవుతుందో చెప్పాలని ప్రశ్నించారు. నిజం మాట్లాడాలంటే.. బీజేపీ ప్రభుత్వం.. ఇప్పుడు చాలా బిల్లులను చర్చించకుండానే ఆమోదిస్తుందన్నారు. ప్రధాని మోడీ వ్యాఖ్యలు.. తెలంగాణ ప్రజలను అవమానించేలా ఉన్నాయన్నారు.
చాలా ఏళ్ల కల తెలంగాణ... ఎంతో అధ్యయనం చేసి.. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టారని కేశవరావు అన్నారు. కీలక బిల్లుపై ఓటింగ్ జరిగితే.. సభ్యుల లెక్కుంపు ఉంటుందనే విషయాన్ని గుర్తు చేశారు. విభజన బిల్లుకు బీజేపీ మద్దతునిచ్చిందని కేకే గుర్తు చేశారు. ఉభయ సభల ఆమోదం పొందిన తర్వాతే.. రాష్ట్రపతి ఆమోద ముద్దవేశారన్నారు. ఝార్ఖండ్ బిల్లు ఆమోదం సమయంలో కొందరు సభ్యులు వాజ్పేయీ మీదకు దూసుకెళ్లారని కేశవరావు అన్నా్రు. రాష్ట్రాల విభజన అనేది భావోద్వేగాలతో ముడిపడినదని వ్యాఖ్యానించారు.
తెలంగాణ ప్రజల పోరాటాన్ని ప్రధాని మోడీ అవమానించారని టీఆర్ఎస్ లోక్ సభ పక్షనేత నామ నాగేశ్వరావు అన్నారు. ఒకవేళ మీరు మాట్లాడేది సరైనదే అయితే.. ఎన్డీఏ 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసిన సమయంలోనే తెలంగాణను ఏర్పాటు చేయాలి కదా అని అడిగారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ... తెలంగాణ ప్రజలకు చేసింది ఏంటని ప్రశ్నించారు. బీజేపీ వాళ్లు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారని పేర్కొన్నారు. పార్లమెంటు సాక్షిగా ఏర్పడిన తెలంగాణను అవమానిస్తున్నారని నామ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు కేసీఆర్.. ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారని గుర్తు చేశారు.