Teachers Transfer Demands : టీచర్ల బదిలీలు.. ఆ డిమాండ్లపై సర్కార్ ఏం చేయబోతోంది.. ?-telangana teachers demand for spouse transfers as government gets ready for transfers and promotions ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Teachers Transfer Demands : టీచర్ల బదిలీలు.. ఆ డిమాండ్లపై సర్కార్ ఏం చేయబోతోంది.. ?

Teachers Transfer Demands : టీచర్ల బదిలీలు.. ఆ డిమాండ్లపై సర్కార్ ఏం చేయబోతోంది.. ?

Thiru Chilukuri HT Telugu
Jan 22, 2023 02:40 PM IST

Teachers Transfers Demads : సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో... తమకూ అవకాశం కల్పించాలని స్పౌజ్ కేటగిరి టీచర్లు ఆందోళన బాట పట్టారు. 317 జీవోతో ఇతర ప్రాంతాలకు వెళ్లిన టీచర్లూ.. తమకూ ట్రాన్స్ ఫర్ ఛాన్సు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

స్పౌజ్ బదిలీలు చేపట్టాలి టీచర్ల డిమాండ్
స్పౌజ్ బదిలీలు చేపట్టాలి టీచర్ల డిమాండ్ (facebook)

Teachers Transfers Demads : ప్రభుత్వ ఉపాధ్యాయులు సుదీర్ఘకాలంగా కోరుతున్న బదిలీలు, పదోన్నతులపై ఎట్టకేలకు కదలిక వచ్చింది. జనవరి 27 నుంచి ప్రక్రియ ప్రారంభిస్తామని ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వం.. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ఒకటి రెండు రోజుల్లో విడుదల చేయనుంది. మార్చి 4 వరకు.. అంటే 37 రోజుల్లో .. టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను పూర్తి చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ఈ బదిలీలకు విద్యాశాఖలో దాదాపు 90 వేల మంది ఉపాధ్యాయులు అర్హత సాధిస్తారని.. దాదాపు 11 వేల మంది ప్రమోషన్లు పొందే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇదివరకున్న నిబంధనల ప్రకారం ఒకచోట ఉపాధ్యాయుడు రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకుంటే ట్రాన్స్ ఫర్ కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హుడవుతాడు. నిబంధనల ప్రకారం... ఉపాధ్యాయుడు 8 ఏళ్లు.. ప్రధానోపాధ్యాయుడు ఐదేళ్లకు మించి ఒకే చోట పనిచేయకూడదు. ఇలాంటి గరిష్ట సర్వీసుని పరిగణలోకి తీసుకొని బదిలీలు చేపడతారని తెలుస్తోంది.

బదిలీలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో.. వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న దంపతులు.. తమకూ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. స్పౌజ్ బదిలీల్లో అవకాశం కల్పించాలని.. భార్య, భర్త ఒకే జిల్లాలో పనిచేసే అవకాశం ఇవ్వాలని కోరుతూ... శనివారం 13 జిల్లాల ఉపాధ్యాయ దంపతులు... హైదరాబాద్ లోని విద్యాశాఖ కమిషనర్, సంచాలకుల కార్యాలయం ముట్టడికి యత్నించిన విషయం తెలిసిందే. వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన టీచర్ దంపతులు... పిల్లలతో కలిసి ఆందోళనకు దిగారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న టీచర్లు... స్పౌజ్ విభాగంలో బదిలీల కోసం కొంతకాలంగా నిరీక్షిస్తున్న విషయం తెలిసిందే. 2021లో స్పౌజ్ ట్రాన్స్ ఫర్లు చేపట్టిన ప్రభుత్వం.. కేవలం 19 జిల్లాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకే అవకాశం కల్పించింది. మిగతా 13 జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్, కరీంనగర్, ఖమ్మం, హన్మకొండ, వరంగల్, సూర్యాపేట, నిజామాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్, మంచిర్యాల, మహబూబ్ నగర్, సిద్ధిపేట జిల్లాకు చెందిన టీచర్లకు స్పౌజ్ బదిలీలకు అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో.. సుదీర్ఘకాలంగా వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయ దంపతులు.. ప్రభుత్వం ఈసారి చేపట్టనున్న బదిలీల్లో తమకూ అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ప్రస్తుతం చేపడుతున్న బదిలీల్లో పెద్ద ఎత్తున ఖాళీలు ఉంటాయని.. వాటిని పరిగణలోకి తీసుకొని తమకూ అవకాశం కల్పించాలని కోరుతున్నారు.

ఇక గత సంవత్సరం జీవో 317 అమలులో భాగంగా.. రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల సర్దుబాటు చేసిన సర్కార్.. కొంత మందిని ఇతర జిల్లాలకు కేటాయించింది. సర్దుబాటులో తమ స్థానికతను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం బదిలీలకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం... 317 జీవో కింద ఇతర జిల్లాలకు ట్రాన్స్ ఫర్ అయిన వారి అంశంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇలాంటి వారు 15 నుంచి 20 వేల మంది ఉంటారని సమాచారం. వీరు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ అయి ఏడాది కూడా పూర్తికావడం లేదు. నిబంధనల ప్రకారం అయితే.. ట్రాన్స్ ఫర్స్ కి దరఖాస్తు చేసుకోవాలంటే రెండేళ్ల కనీస సర్వీసు ఉండాలన్న నిబంధన ఉంది. అలా ఉన్న వారే బదిలీలకు అర్హులవుతారు. ఈ నేపథ్యంలో... ఇప్పుడు చేపట్టబోయే బదిలీల్లో తమను కూడా పరిగణలోకి తీసుకోవాలని, రెండేళ్ల కనీస సర్వీసు నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.

బదిలీల నియమ, నిబంధనలతో కూడిన షెడ్యూల్ ను వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు ప్రయత్నిస్తోన్న ప్రభుత్వం... స్పౌజ్ ట్రాన్స్ ఫర్స్, 317 జీవో ఉపాధ్యాయుల విషయంలో ఏం చేస్తుందన్నది ఆసక్తిగా మారింది. వారి డిమాండ్లూ పరిష్కరిస్తుందా ? లేక ప్రస్తుత బదిలీల ప్రక్రియ పూర్తయిన తర్వాత సర్దుబాటు చేస్తామని చెప్పి శాంతింపజేస్తుందా అన్నది చూడాలి.

IPL_Entry_Point