Best Tourism Award : జాతీయ స్థాయిలో తెలంగాణ గ్రామాలకు మరో గుర్తింపు- చంద్లాపూర్, పెంబర్తికి టూరిజం అవార్డులు-telangana siddipet chandlapur village selected best tourism village award 2023 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana Siddipet Chandlapur Village Selected Best Tourism Village Award 2023

Best Tourism Award : జాతీయ స్థాయిలో తెలంగాణ గ్రామాలకు మరో గుర్తింపు- చంద్లాపూర్, పెంబర్తికి టూరిజం అవార్డులు

HT Telugu Desk HT Telugu
Sep 25, 2023 09:54 PM IST

Best Tourism Village Award : జాతీయ స్థాయిలో తెలంగాణ గ్రామాలకు మరో గుర్తింపు లభించింది. సిద్దిపేట జిల్లాలోని చంద్లాపూర్, జనగాం జిల్లాలోని పెంబర్తి జాతీయ ఉత్తమ టూరిజం విలేజి అవార్డులకు ఎంపికయ్యాయి. ఈ నెల 27న దిల్లీలో అవార్డులు ప్రదానం చేయనున్నారు.

రంగనాయక సాగర్
రంగనాయక సాగర్

Best Tourism Village Award : సిద్దిపేట జిల్లా ఎన్నో జాతీయ అవార్డులు గెలుచుకొని తెలంగాణలోని ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తుంది. తాజాగా మరో జాతీయ అవార్డుకు సిద్దిపేటలోని ఒక గ్రామం ఎంపిక అయింది. జాతీయ పర్యాటక శాఖ ఉత్తమ టూరిజం విలేజి అవార్డ్ లను ప్రతి ఏటా ఇస్తుంది. ఈ ఏడాది తెలంగాణ నుంచి రెండు గ్రామాలు ఎంపిక కాగా ఒకటి పెంబర్తి, రెండోది సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూర్ మండలంలోని చంద్లాపూర్ గ్రామం. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించిన రంగానాయక సాగర్ రిజర్వాయర్ మధ్యలో ఒక ద్వీపం పైన రంగనాయక స్వామి కొలువై ఉన్నారు. ఈ ద్వీపంపైన రంగనాయక కొండలు ఉన్నాయి. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు చొరవతో ఈ ప్రాంతం గొప్ప పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతుంది. ఈ రిజర్వాయర్ మధ్యలో ఉన్న ద్వీపాన్నీ అద్భుతమైన టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేసింది తెలంగాణ ప్రభుత్వం. నిత్యం పర్యాటకులతో కనువిందు చేస్తున్న ఈ ప్రాంతం ఇక్కడి ప్రకృతి.. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది.

తెలంగాణ నుంచి రెండు గ్రామాలు

దేశం మొత్తం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఈ అవార్డు కోసం 795 గ్రామాలు తమ అప్లికేషన్స్ పంపించాయి. ఇందులో తెలంగాణలోని చంద్లాపూర్ గ్రామంతో పాటు పెంబర్తి కూడా ఎంపికయ్యింది. పెంబర్తి గ్రామం జనగాం జిల్లాలోని హాసనపర్తి మండలంలో ఉంది. కొద్దీ రోజుల్లోనే మరో అద్భుతమైన డెస్టినేషన్ సెంటర్ గా చంద్లాపూర్ మారనుంది. అదే విధంగా ఈ ప్రాంతంలో నేసే ‘గొల్లభామ’ చీరలు తెలంగాణ కళాసంస్కృతికి ప్రతిబింబాలుగా నిలుస్తున్నాయి. గొల్లభామ చీర తెలంగాణ నేతన్నల కళా నైపుణ్యానికి నిలువుటద్దం. కళాత్మకత, చేనేతల కలబోతకు నిదర్శనం. నెత్తిన చల్లకుండ, చేతిలో పెరుగు గురిగి, కాళ్లకు గజ్జెలు, నెత్తిన కొప్పుతో కళకళలాడే యాదవ మహిళల వైభవం ఈ చీరల్లో ఇమిడిపోయి కనిపిస్తుంది. సిద్దిపేట ప్రాంతంలో చంద్లాపూర్ కనువిందు ప్రకృతి అందాలు, జల సందడి చేసే గొప్ప పర్యాటక ప్రాంతం రంగనాయక సాగర్. కళా నైపుణ్యత, సంస్కృతి గొల్ల భామ చీర ప్రాచుర్యతకు నేడు జాతీయ స్థాయిలో దక్కిన గొప్ప గుర్తింపుగా ఇక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మంత్రి హరీశ్ రావు హర్షం

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు చంద్లాపూర్ గ్రామ పంచాయతీకి, గ్రామ ప్రజలకు అభినందనలు తెలిపారు. సిద్దిపేట పర్యాటక, ఆహ్లాదకరమైన ప్రాంతంగా నెలవు అనడానికి గొప్ప నిదర్శనం నేడు జాతీయ స్థాయిలో పర్యాటక ప్రాంతంగా చంద్లాపూర్ గ్రామం ఎంపిక అని ఆయన అభిప్రాయపడ్డారు. మంత్రి హరీశ్ రావు కృషి , పట్టుదల, వారు అందించిన తోడ్పాటుకు ఈ గుర్తింపు అని జిల్లా పరిషత్ చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ అన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అవార్డును కేంద్ర టూరిజం డిపార్ట్మెంట్ సెప్టెంబర్ 27న న్యూ దిల్లీలోని భారత మంటపంలో అందజేయనున్నారు. కేంద్ర టూరిజం శాఖ పంపిన లేఖలో గ్రామ పంచాయతీ నుంచి ఒక ప్రతినిధిని, రాష్ట్ర టూరిజం శాఖ నుంచి ఒకరిని అవార్డు తీసుకోవడానికి పంపాలని కోరారు.

IPL_Entry_Point