ASO Death Mystery : కారులో డెడ్ బాడీ… వీడని చిక్కుముడి….-telangana secreteriat aso found dead in car and police suspects whether it is murder or accident ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Aso Death Mystery : కారులో డెడ్ బాడీ… వీడని చిక్కుముడి….

ASO Death Mystery : కారులో డెడ్ బాడీ… వీడని చిక్కుముడి….

HT Telugu Desk HT Telugu
Jan 10, 2023 09:10 AM IST

ASO Death Mystery తెలంగాణ సెక్రటేరియట్‌లో అసిస్టెంట్ సెక్షన్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వ్యక్తి అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోలవడం కలకలం రేపింది. స్నేహితులతో కలిసి బాసర ఆలయానికి వెళుతున్నానని చెప్పిన మనిషి ఊరి శివార్లలో కాలిపోయిన కారులో శవమై కనిపించడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

కారులో కాలిపోయిన ఏఎస్‌ఓ ధర్మనాయక్
కారులో కాలిపోయిన ఏఎస్‌ఓ ధర్మనాయక్

ASO Death Mystery కాలిపోయిన కారులో ఓ డెడ్ బాడీ మెదక్‌ జిల్లాలో కలకం రేపింది. మెదక్‌ జిల్లా టేక్మాల్‌ మండల పరిధి వెంకటాపూర్‌ శివారులో కాలిపోయిన కారులో సచివాలయ ఉద్యోగి శవమై కనిపించాడు. వెంకటాపూర్‌ పంచాయితీ పరిధి భీమ్లా తండాకు చెందిన ధర్మ నాయక్ తెలంగాణ సెక్రటేరియట్‌లో నీటిపారుదల శాఖ సహాయ సెక్షన్‌ అధికారిగా పనిచేస్తున్నారు.

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. ఈ నెల 5న భార్య నీలాతో కలిసి భీమ్లా తండాకు వచ్చారు. శనివారం చేగుంట, హైదరాబాద్‌కు చెందిన మిత్రులతో కలిసి బాసరకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయలు దేరారు. ఆదివారం మధ్యాహ్నం తన భార్యకు ఫోన్‌ చేసి బాసర నుంచి తిరిగి వస్తున్నట్లు చెప్పినా ఇంటికి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు ఫోన్లు చేసినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సోమవారం ఉదయం గ్రామ సమీపంలోని కుంట కట్ట వద్ద కల్వర్టు కిందకు దూసుకుపోయిన స్థితిలో కారు దగ్ధమై కనిపించింది. అందులో అగ్నికి ఆహుతై ఉన్న వ్యక్తి మృత దేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికులు కారును గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో బంధువులు మృతుడిని గుర్తించారు.

కారు పక్కన పడి ఉన్న బ్యాగులో దుస్తులు, కొన్ని పత్రాలు లభించాయి. వాటిలో ఉన్న పత్రాల ఆధారం మృతి చెందిన వ్యక్తిని ధర్మగా గుర్తించారు. వాహనానికి సమీపంలో ఖాళీ పెట్రోల్ సీసా పడిఉండటంతో ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందా, ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి భార్య నీలా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జార్జి తెలిపారు.

పోలీసు జాగిలం సంఘటన స్థలం నుంచి బీంలా తండా వరకు వెళ్లి తిరిగివచ్చింది. ఘటన స్థలానికి కొద్ది దూరంలో పెట్రోల్‌ సీసా ఉండటం, బ్యాగు కారులో కాకుండా పక్కన పడి ఉండటంపై గ్రామస్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబానికి గ్రామంలో ఎవరితోనూ విభేదాలు లేవని ధర్మ భార్య నీలా తెలిపారు. ధర్మకు భార్యతో పాటు ముగ్గురు పిల్లలున్నారు. ధర్మతో పాటు బాసర వెళ్లిన స్నేహితులు ఎవరనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుడి కాల్ డేటా‌పై పోలీసులు దృష్టి సారించారు.

IPL_Entry_Point