విమోచన దినోత్సవాన్నిఅధికారికంగా నిర్వహిస్తాం.. ఢిల్లీలో అమిత్ షా కామెంట్స్-telangana formation day celebrations at dr ambedkar centre in new delhi ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  విమోచన దినోత్సవాన్నిఅధికారికంగా నిర్వహిస్తాం.. ఢిల్లీలో అమిత్ షా కామెంట్స్

విమోచన దినోత్సవాన్నిఅధికారికంగా నిర్వహిస్తాం.. ఢిల్లీలో అమిత్ షా కామెంట్స్

HT Telugu Desk HT Telugu
Jun 02, 2022 10:04 PM IST

తెలంగాణ ఏర్పాటు కోసం చాలా మంది విద్యార్థులు పోరాటాలే కాదు ఆత్మ బలిదానాలు చేశారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు.

హోంశాఖ మంత్రి అమిత్ షా
హోంశాఖ మంత్రి అమిత్ షా (twitter)

ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. తొలిసారిగా కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఉత్సవాలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆజాద్ కి అమృత్ మహోత్సవంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం ఎంతో మంది బలిదానాలు చేశారని గుర్తు చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం తన వంతు సాకారం అందజేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఇలానే కొనసాగాలని ఆకాంక్షించారు.

అమిత్ షా ఇంకా ఏమన్నారంటే...

'2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వలేదు, అనేక సమస్యలతో ఏర్పాటు చేసింది. తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ మద్దుతుగా నిలిచింది. అనేకమంది తెలంగాణ విముక్తి కోసం నిజాంతో పోరాడారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ యాక్షన్ తీసుకోకపోతే తెలంగాణ రాష్ట్రం ఇలా ఉండేది కాదు. ఇవాళ్టి వరకూ భారతదేశంలో తెలంగాణ ఉండేది కాదు. నిజాం నిరంకుశ పాలన నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ విముక్తి చేశారు. తెలంగాణలో త్వరలోనే ప్రభుత్వం మారబోతోంది. బీజేపీ అధికారంలోకి వచ్చాక విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇన్ని సంవత్సరాలైనా కలలుగన్న తెలంగాణ సాధించుకో లేకపోయాం. కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రం పైన పక్షపాతంగా లేదు... ఏ ముఖ్యమంత్రి ఢిల్లీ వచ్చిన వారికి స్వాగతం పలుకుతాం. ప్రతి ఒక్కరికి అపాయింట్మెంట్ ఇస్తాం. రాష్ట్రాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటుంది. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసిందనీ కేసీఆర్ అంటున్నారు. ఇప్పటివరకు తెలంగాణకు కేంద్రం ఎంత ఇచ్చిందో పూర్తి లెక్కలు నా దగ్గర ఉన్నాయి. దీనిపై చర్చకు సిద్ధమా..? ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు నిజాలు చెప్పాలి. ఆజాదీ అమృతం మహోత్సవ కార్యక్రమం లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఈ విషయంలో కూడా కేసీఆర్ సర్కార్ రాజకీయాలు చేస్తోంది. ప్రభుత్వం నుంచి చేయాల్సిన పని చేయలేదు' అని విమర్శించారు.

ఒక కుటుంబం చేతిలో బందీ అయింది - కిషన్ రెడ్డి

కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వమని స్పష్టం చేశారు. తెలంగాణలో కేంద్ర పథకాలు పేరు మార్చి రాష్ట్ర పథకాలుగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ తల్లి ఒక కుటుంబం చేతిలో బందీ అయిందని వ్యాఖ్యానించారు. తప్పకుండా ఆ కుటుంబాలను విముక్తి చేస్తామని.. అదీ బీజేపీతోనే సాధ్యమవుతుందని చెప్పారు. ఒక్కరోజు సెలవు లేకుండా దేశం కోసం ప్రధాని మోదీ శ్రమిస్తున్నారన్న కిషన్ రెడ్డి... సీఎం కేసీఆర్ 18 గంటలు ఫాంహౌస్ లో ఉంటారని ఆరోపించారు. రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని భూమి అడిగినప్పటికీ ఇంతవరకు ఇవ్వలేదన్నారు. రైతు మోటార్లకు మీటర్లు పెడతామంటూ కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

IPL_Entry_Point