BSP First List : 20 మందితో బీఎస్పీ తొలి జాబితా, సిర్పూరు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ
BSP First List : బీఎస్పీ తెలంగాణ తొలి జాబితాను ప్రకటించింది. 20 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
BSP First List : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటికే బీఆర్ఎస్ 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా బహుజన సమాజ్ పార్టీ తమ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తొలి జాబితాలో ఇరవై స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిర్పూరు జనరల్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు.
బీఎస్పీ తొలి జాబితా
1. సిర్పూరు (జనరల్) - ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్
2. జహీరాబాద్ (ఎస్సీ) - జంగం గోపీ
3. పెద్దపల్లి (జనరల్ ) - దాసరి ఉషా
4. తండూరు (జనరల్ ) - చంద్రశేఖర్ ముదిరాజ్
5. దేవరకొండ (ఎస్టీ )- డాక్టర్ ఎం.వెంకటేష్ చౌహాన్
6. చొప్పదండి (ఎస్సీ) - కొంకటి శేఖర్
7. పాలేరు (జనరల్ ) - అల్లిక వెంకటేశ్వర రావు
8. నకిరేకల్ (ఎస్సీ ) - మేడి ప్రియదర్శిని
9. వైరా (ఎస్టీ ) - భానోత్ రాంబాబు నాయక్
10. ధర్మపురి (ఎస్సీ) - నక్కా విజయ్ కుమార్
11. వనపర్తి (జనరల్) - నాగమోని చెన్న రాములు ముదిరాజ్
12. మానకొండూరు (ఎస్సీ) - నిషాని రామచందర్
13. కోదాడ (జనరల్ ) - పిల్లుట్ల శ్రీనివాస్
14. నాగర్ కర్నూల్ (జనరల్) - కొత్తపల్లి కుమార్
15. ఖానాపూర్ (ఎస్టీ) - భన్సీలాల్ రాథోడ్
16. ఆందోల్ (ఎస్సీ) - ముప్పారపు ప్రకాశం
17. సూర్యాపేట (జనరల్) - వట్టె జానయ్య యాదవ్
18. వికారాబాద్ (ఎస్సీ) - గొర్లకొండ క్రాంతికుమార్
19. కొత్తగూడెం (జనరల్) - ఎర్రా కామేష్
20. జుక్కల్ (ఎస్సీ ) - ప్రద్య్నా కుమార్ మాధవరావ్ ఏకాంబర్
నల్గొండ జిల్లాలో నాలుగు స్థానాలకు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు బీఎస్పీ అధ్యక్షుడు నాలుగు చోట్ల తమ అభ్యర్థులను ప్రకటించారు. ఎస్సీ రిజర్వుడు స్థానమైనా నకిరేకల్ లో మేడి ప్రియదర్శిని దాదాపు రెండేళ్లుగా నియోజకవర్గంలో బీఎస్పీ కోసం పనిచేస్తుండగా ఆమెకే టికెట్ దక్కింది. ఎస్టీ రిజర్వుడు స్థానం దేవరకొండకు, జనరల్ స్థానాలైన కోదాడ, సూర్యాపేటలకు తమ అభ్యర్థులను ప్రకటించారు.
సూర్యాపేట వివాదాస్పదం
సూర్యాపేట నియోజకవర్గ అభ్యర్థిగా ఉమ్మడి నల్లగొండ డీసీఎమ్మెస్ ఛైర్మన్ వట్టె జానయ్య యాదవ్ టికెట్ దక్కించుకున్నారు. ఇక, ఆయనను పార్టీలో చేర్చుకోవడంతోనే ముందు నుంచి ఈ నియోజకవర్గంలో బీఎస్పీ కోసం పనిచేస్తున్న నాయకులు, కేడర్ నిరసనగా పార్టీకి రాజీనామాలు చేశారు. సూర్యాపేట ఎమ్మెల్యే, మంత్రి జగదీష్ రెడ్డికి దగ్గరి అనుచరుడిగా పేరున్న వట్టె జానయ్య యాదవ్ పై రాత్రికి రాత్రే 70 కేసులు నమోదయ్యాయి. మంత్రితో వచ్చిన భేదాభిప్రాయాలు, తేడాలతోనే కేసులు పెట్టారని విమర్శలు వచ్చాయి. జానయ్య సూర్యాపేట చుట్టుపక్కల, ముఖ్యంగా మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్ ప్రాంతంలో భూ కబ్జాలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. జానయ్య బాధితుల ఫిర్యాదులతో కేసులు నమోదయ్యాయి. కక్ష పూరితంగానే ఇన్ని కేసులు తనపై పెట్టారని, తన అరెస్టును అడ్డుకోవాలని ఆయన సుప్రీంకోర్టుకెక్కారు. మరోవైపు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ జానయ్యయాదవ్ కుటుంబానికి అండగా నిలిచారు. సూర్యాపేట, గాంధీనగర్ లో జానయ్య ఇంటికి వెళ్లి మద్దతు ప్రకటించారు. అప్పటి నుంచే ఈసారి జానయ్య సూర్యాపేట నుంచి బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ.. మంగళవారం విడుదల చేసిన తొలి జాబితాలోనే జానయ్య యాదవ్ కు చోటు దక్కింది.