BJP Counters KCR : కేసీఆర్ కి బీజేపీ కౌంటర్ ! నోటిఫికేషన్ల పేరుతో యువతను మభ్యపెడుతున్నారని ఆరోపణ-telangana bjp leaders counter attacks kcr on various issues and job notifications ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana Bjp Leaders Counter Attacks Kcr On Various Issues And Job Notifications

BJP Counters KCR : కేసీఆర్ కి బీజేపీ కౌంటర్ ! నోటిఫికేషన్ల పేరుతో యువతను మభ్యపెడుతున్నారని ఆరోపణ

HT Telugu Desk HT Telugu
Jan 03, 2023 09:26 PM IST

BJP Counters KCR: ఉద్యోగ నోటిఫికేషన్ల పేరిట కేసీఆర్ నిరుద్యోగులని మభ్య పెడుతున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు. ఖాళీల భర్తీపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఎనిమిదిన్నరేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అధోగతిపాలు చేశారని.. ఇక దేశాన్ని ఏ విధంగా ఉద్ధరిస్తారని ప్రశ్నించారు.

కేసీఆర్ కి బీజేపీ కౌంటర్
కేసీఆర్ కి బీజేపీ కౌంటర్

BJP Counters KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు. దేశ దిశ మార్చేందుకే బీఆర్ఎస్ అంటూ.. సోమవారం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఎనిమిదిన్నరేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అధోగతిపాలు చేశారని.. ఇక దేశాన్ని ఏ విధంగా ఉద్ధరిస్తారని ప్రశ్నించారు. ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని.. యువతను బీజేపీకీ దూరం చేసేందుకే నియామకాల పేరిట డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. పోస్టుల భర్తీ చేయకూడదనే చిల్లర ఆలోచన ప్రభుత్వంలో కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్ ఎన్నికల సమయంలో తెలంగాణ సెంటిమెంట్ ని రాజేసి లబ్ధి పొందుతారని... ఆయనకు నాటకాలు కొత్తకాదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. సోమవారం ఏపీ బీఆర్ఎస్ నేతలు చేరిన సమయంలో దేశానికి సంబంధించి నీటి, విద్యుత్, భూమికి సంబంధించి ఏవేవో లెక్కలు చెప్పారని... అసలు రాష్ట్రంలో ఎక్కడైనా 24 గంటల విద్యుత్‌ ఇస్తున్నారా అని సంజయ్ ప్రశ్నించారు. గతంలో ఏపీ వాళ్లను కేసీఆర్‌ అవమానించలేదా అని నిలదీశారు. ఓట్లు అయిపోయాక నీళ్ల వాటా పేరుతో మళ్లీ రెచ్చగొడతారని.. నమ్మించి అందరి ఓట్లు వేయించుకోవడం కేసీఆర్ కి తెలిసిన విద్య అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ కు ఇప్పటి వరకు జాతీయ అధ్యక్షుడే లేకుండా.. ఏపీ అధ్యక్షుడిని ప్రకటించారని అన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై మాట్లాడిన కేసీఆర్ కి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ముందు నిజాం చక్కర కర్మాగారాన్ని ఎందుకు పునరుద్ధరించలేదని ప్రశ్నించారు. పోలవరం ఎత్తు పెంచాలో, తగ్గించాలో కేసీఆర్ చెప్పాలని నిలదీశారు. మాట్లాడితే చైనా గురించి గొప్పలు చెప్పే కేసీఆర్‌ కు... ఆయన ఫామ్‌హౌజ్‌కు సమీపంలోనే భారత్ బయోటెక్‌ ఉందని... కొవిడ్‌ టీకా భారత్‌ బయోటెక్‌లో ఉత్పత్తి అవుతున్న విషయం తెలుసా ? అని సంజయ్ ప్రశ్నించారు.

"రాష్ట్రంలో ఎక్కడైనా 24 గంటల విద్యుత్‌ ఇస్తున్నారా? రాష్ట్రంలో డిస్కమ్‌లు రూ.60 వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయి. తెలంగాణలో విద్యుత్‌ ఛార్జీలు పెంచింది నిజం కాదా. కేసీఆర్‌ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నీట మునిగింది. కృష్ణా జలాల్లో 570 టీఎంసీల వాటా రావాల్సి ఉంటే 299 టీఎంసీలకే ఒప్పుకున్నారు. ఏపీ సీఎంతో కుమ్మక్కై కేఆర్‌ఎంబీ సమావేశానికి వెళ్లట్లేదు. ప్రభుత్వం సాగు నీరు ఇస్తున్నామని గొప్పగా చెప్పుకుంటోంది. మరి తెలంగాణ ఏర్పాటుకు ముందు 18 లక్షల వ్యవసాయ బోర్లు ఉంటే.. ఇప్పుడు వాటి సంఖ్య 23 లక్షలకు ఎందుకు పెరిగింది ? కేసీఆర్ పరిపాలనలో అన్ని సూచీల్లో తెలంగాణ దారుణంగా ఉంది. పాఠశాల విద్యలో 21వ స్థానంలో.. నిరుద్యోగంలో 4వ స్థానంలో.. రైతుల ఆత్మహత్యలో 5వ స్థానంలో ఉంది. గతంలో మద్యం ద్వారా ప్రభుత్వానికి రూ.10వేల కోట్ల ఆదాయం వచ్చేది. ఇప్పుడు మద్యం ద్వారా రూ.40వేల కోట్ల ఆదాయం వస్తోంది" అని బండి సంజయ్ అన్నారు.

ఉద్యోగాల ప్రకటనల విషయంలో ప్రభుత్వం నిరుద్యోగలను మోసం చేస్తోందని.. బీజేపీ నేత ఈటల రాజేందర్ విమర్శించారు. ఇప్పటివరకు 2 పరీక్షలు నిర్వహించి వాటిని రద్దు చేశారని... మళ్లీ చాలా కాలం తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తున్నారని అన్నారు. నోటిఫికేషన్లు ఇచ్చి ప్రక్రియ సాగుతున్నట్లు చూపుతూ.. యువతను మభ్య పెడుతున్నారని ఆరోపించారు. రూ.లక్షలు ఖర్చుపెట్టి యువత కోచింగ్ తీసుకుంటుంటే.. పోస్టులు భర్తీ చేయకూడదనే చిల్లర ఆలోచన ప్రభుత్వంలో కనిపిస్తోందని ఈటల మండిపడ్డారు.

యువత ఏళ్ల తరబడి కోచింగ్‌ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారని... ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులు మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు ఉద్యోగాల్లో ప్రభుత్వం ఆశావాహులకు తీవ్ర అన్యాయం చేస్తోందని... నాలుగు మీటర్ల లాంగ్‌ జంప్‌ సాధ్యమయ్యే పనికాదన్నారు ఈటల. తగ్గించమని అభ్యర్థులు కోరితే పట్టించుకోవడం లేదన్నారు. ప్రాథమిక పరీక్షలో 22 తప్పులు వచ్చాయని.. ఆ మేరకు మార్కులు కలపాలన్న కోర్టు తీర్పునైనా అమలు చేయమంటే స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని స్పష్టం చేశారు.

IPL_Entry_Point