Terrorist Professor: హైదరాబాద్‌ ఉగ్ర లింకుల్లో ఆ ప్రొఫెసర్‌దే కీలక పాత్ర-professor salim who played a key role in the roots of terrorism in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Terrorist Professor: హైదరాబాద్‌ ఉగ్ర లింకుల్లో ఆ ప్రొఫెసర్‌దే కీలక పాత్ర

Terrorist Professor: హైదరాబాద్‌ ఉగ్ర లింకుల్లో ఆ ప్రొఫెసర్‌దే కీలక పాత్ర

HT Telugu Desk HT Telugu
May 15, 2023 09:25 AM IST

Terrorist Professor: హైదరాబాద్‌లో కలకలం రేపిన ఉగ్రవాదుల వ్యవహారంలో మతం మార్చుకున్న ప్రొఫెసర్ కీలకంగా వ్యవహరించినట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. హైదరాబాద్‌లో ఇతరుల్ని ఉగ్రవాదం వైపు ఆకర్షితులయ్యేలా చేయడంలో ప్రొఫెసర్ సలీం ముఖ్య పాత్ర పోషించినట్లు విచారణలో వెల్లడైంది.

మధ్య ప్రదేశ్‌ ఏటీఎస్‌ అదుపులో అనుమానిత ఉగ్రవాదులు
మధ్య ప్రదేశ్‌ ఏటీఎస్‌ అదుపులో అనుమానిత ఉగ్రవాదులు (PTI)

Terrorist Professor: హైదరాబాద్‌లో వెలుగు చూసిన ఉగ్రవాదుల అరెస్ట్ వ్యవహారంలో పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టారు. ఉగ్రవాద నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడంలో ప్రొఫెసర్ సలీం కీలకంగా పనిచేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న వారంతా సలీం ద్వారా నెట్‌వర్క్‌లో ప్రవేశించిన వారేనని గుర్తించారు. సలీం ఏడాది వ్యవధిలో నాలుగు ఇళ్లు మార్చినట్లు పోలీసులు గుర్తించారు.

మధ్యప్రదేశ్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌, హైదరాబాద్‌ పోలీసులు సంయుక్తంగా జరిపిన దాడుల్లో అరెస్టైన డెక్కన్ కాలేజీ ఫార్మాస్యూటికల్‌ బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్‌ మహ్మద్‌ సలీం టెర్రర్‌ మాడ్యుల్‌లో కీలకంగా పనిచేసినట్లు గుర్తించారు. ఇతడే మిగిలిన వారిని ఉచ్చులోకి లాగినట్లు గుర్తించారు. భోపాల్‌లో చిక్కిన 11 మందితో పాటు నగరంలో అరెస్టు అయిన ఐదుగురినీ ఏటీఎస్‌ కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది.

మహ్మద్‌ సలీంగా మారిన సౌరభ్‌ రాజ్‌ విద్య 2018లో తన భార్యతో కలిసి నగరానికి వచ్చాడు. తొలుత సైదాబాద్‌లో నివసించిన వీళ్లు అక్కడి ఓ పాఠశాలలో టీచర్లుగా పనిచేశారు. కేవలం ఉగ్రవాద కార్యకలాపాల కోసం మాడ్యుల్‌ తయారు చేయడానికే హైదరాబాద్‌ చేరుకున్నట్లు ఏటీఎస్‌ చెప్తోంది.

సైదాబాద్‌ నుంచి సలీం తరచూ మలక్‌పేటలోని ప్రార్థన స్థలానికి వెళ్లేవాడు. అక్కడే ఇతడికి హఫీజ్‌ బాబానగర్‌కు చెందిన మహ్మద్‌ అబ్బాస్‌ అలీతో పరిచయమైంది. కొన్నాళ్లకు ఇద్దరూ మంచి స్నేహితులుగా మారారు.పేదరికంలో ఉన్న అబ్బాస్‌ను తన దారిలోకి తెచ్చుకోవడానికి సలీం అతడి అవసరాలు తెలుసుకుని ఆటో ఖరీదు చేసి, తక్కువ రేటుకు అతడికి అద్దెకు ఇచ్చాడు. తన మీద ఆధారపడిన అబ్బాస్‌ను తన ఇంటికి పిలిచి రెచ్చగొట్టే వీడియోలు చూపించడం, ఆడియోలు వినిపించాడు. ఈ క్రమంలో సలీంతో కలిసి పనిచేయడానికి అబ్బాస్‌ అంగీకరించినట్లు పోలీసులు చెబుతున్నారు.

నగరంలోని ఓ మల్టీ నేషనల్‌ కంపెనీలో క్లౌడ్‌ సర్విస్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్న అబ్దుల్‌ రెహ్మాన్‌తో పాటు అతని భార్య కూడా మతం మార్చుకుంది. రెహ్మాన్‌ ఒడిశా రాష్ట్రానికి చెందిన వాడు కాగా, అతడి భార్య మధ్యప్రదేశ్‌ చెందిన వారు. రెహ్మాన్ భార్యకు, సలీం భార్యకు భోపాల్‌ నుంచి పరిచయం ఉంది. రెహ్మాన్‌ తన భార్య ద్వారా సలీం భార్యకు, ఆమె ద్వారా సలీంకు పరిచయమయ్యాడు. తరచూ సలీం ఇంటికి వచ్చి వెళ్లే రెహ్మాన్‌ మెల్లగా అతడి ఉచ్చులో పడ్డాడని చెబుతున్నారు.

గోల్కొండలో సలీంకు డెంటిస్ట్‌ షేక్‌ జునైద్‌తోపాటు దినసరి కూలీ మహ్మద్‌ హమీద్‌తో పరిచయమైంది. వీరినీ తన దారిలోకి తెచ్చుకున్న సలీం మరికొందరిని తన మాడ్యుల్‌లో చేర్చుకోవాలని భావించాడు. ఈ విషయాన్ని హమీద్‌కు చెప్పడంతో అతని ద్వారా చిన్ననాటి స్నేహితుడైన జవహర్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ సల్మాన్‌ను పరిచయం చేశాడు.

ఈ మాడ్యుల్‌కు ఇప్పటివరకు వేరే ఎవరి నుంచీ ఆర్థిక సాయం అందలేదని ఏటీఎస్‌ అధికారులు చెప్తున్నారు. ఇప్పటివరకు అయిన ఖర్చంతా సలీం, రెహ్మాన్, జునైద్‌ భరించారని ఏటీఎస్ గుర్తించింది. ఏడాది కాలంలో ఇతడు నాలుగు ఇళ్లు మారినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. సలీం సైదాబాద్‌ నుంచి అక్బర్‌బాగ్, అక్కడ నుంచి సీతాఫల్‌మండి.. ఆపై గోల్కొండ ప్రాంతానికి మకాం మార్చాడు. రెహ్మాన్, జునైద్‌ కూడా ఇతడి ప్రోద్బలంతోనే అక్కడే ఇళ్లు అద్దెకు తీసుకున్నారు.

IPL_Entry_Point