IT Raids On Mallareddy : మల్లారెడ్డి సంస్థలపై ఐటీ దాడులు….-political heat in telangana it raids on minister mallareddy and his family members ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Political Heat In Telangana It Raids On Minister Mallareddy And His Family Members

IT Raids On Mallareddy : మల్లారెడ్డి సంస్థలపై ఐటీ దాడులు….

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి నివాసంపై ఐటీ దాడులు
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి నివాసంపై ఐటీ దాడులు

IT Raids On Mallareddy తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి చెందిన కార్యాలయాలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఉదయం ఏడు గంటల నుంచి మంత్రికి చెందిన విద్యా సంస్థలపై ఐటీ సోదాలు మొదలయ్యాయి. మల్లారెడ్డి కుమారుడు, అల్లుడు నివాసాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఏక కాలంలో 30ప్రాంతాల్లో దాడులు చేపట్టారు.

IT Raids On Mallareddy తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ దర్యాప్తులో దూకుడు పెంచిన సమయంలోనే తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడులు ప్రారంభమ్యాయి. సోమవారం సిట్‌ దర్యాప్తుకు బీజేపీ అగ్ర నాయకుడు బిఎల్‌ సంతోష్‌ గైర్హాజరయ్యారు. టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీని ఇరుకున పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రయత్నాలు చేస్తుండటంతో బీజేపీ కూడా స్పీడ్ పెంచినట్లు కనిపిస్తోంది. తెలంగాణకు చెందిన కీలక మంత్రిపై ఐటీ అస్త్రాన్ని ప్రయోగించింది.

ట్రెండింగ్ వార్తలు

టిఆర్ఎస్ నాయకుడు, మంత్రి మల్లారెడ్డికి చెందిన విద్యాాసంస్థల్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న మల్లారెడ్డికి చెందిన యూనివర్శిటీ క్యాంపస్‌లు, మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీల్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. పన్ను ఎగవేతలు, ఆర్ధిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆదాయ పన్ను శాఖ అధికారులు ఏక కాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి విద్యాసంస్థల్లో ఆయన కుటుంబ సభ్యులతో పాటు బంధువులకు పెద్ద ఎత్తున వాటాలున్నాయి.

మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డితో పాటు అల్లుడు రాజశేఖర్‌ రెడ్డి నివాసాల్లో ఐటీ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొంపల్లి పామ్ మిడోస్‌‌లో నివాసం ఉంటున్న మల్లారెడ్డి కుమారుడు ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. మంత్రి మల్లారెడ్డి కాలేజీలకు ఆయన కుమారుడు మహేందర్ రెడ్డి డైరెక్టర్‌గా ఉన్నారు. రియల్‌ ఎస్టేట్ సంస్థల్లో మల్లారెడ్డి కుటుంబ సభ్యులు, ఆయన కొడుకు, అల్లుడు పెట్టుబడులు పెట్టినట్లు అనుమానిస్తున్నారు. అక్రమంగా నగదు లావాదేవీలు నిర్వహిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఐటీ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

రాజకీయ కారణాలేనా…?

మంత్రి మల్లారెడ్డికి చెందిన సంస్థలపై ఐటీ దాడుల వెనుక రాజకీయ కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీని ఇరుకున పెట్టేందుకు టిఆర్‌ఎస్‌ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. మంగళవారం ఉదయం కొంపల్లిలోని గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న మల్లారెడ్డి కుమారుడి ఇంట్లో ఐటీ అధికారులు దాడులు చేయడం వెనుక పక్కా వ్యూహం ఉన్నట్లు కనిపిస్తోంది. బీజేపీలో పెద్దగా బయటకు తెలియని బిఎల్ సంతోష్‌ను టిఆర్‌ఎస్‌ పార్టీ టార్గెట్‌ చేయడంతో కేంద్రం దూకుడుగా స్పందించినట్లు తెలుస్తోంది. సోమవారం సిట్ విచారణకు బిఎల్‌ సంతోష్ హాజరు కావాల్సి ఉంది. ఈ విచారణకు ఆయన హాజరు కాలేదు. సంతోష్‌ను అరెస్ట్‌ చేయొద్దని ఇప్పటికే సుప్రీం కోర్టు ఆదేశించింది. విచారణకు సహకరించాలని కోర్టు సూచించింది. ఈ పరిణామాల నేపథ్యంలో మల్లారెడ్డి ఇంటిపై ఐటీ దాడులు మొదలయ్యాయి.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎదుర్కొవడంలో భాగంగానే మల్లారెడ్డి ఇంటిపై ఐటీ దాడులు జరుగుతున్నట్లు టిఆర్‌ఎస్‌ వర్గాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు టిఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే క్రమంలో మరికొందరు కీలక నాయకులను టార్గెట్ చేస్తారని టిఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర సాయుధ బలగాల పహారాాలో సోదాలను చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో సిబిఐ దర్యాప్తుకు సాధారణ సమ్మతిని తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించడంతో ఐటీ దాడులు చేసినట్లు అనుమానిస్తున్నారు. ఐటీ ఉల్లంఘనలు బయటపడితే వాటి ఆధారంగా కేంద్ర పరిధిలో ఉన్న చట్టాల ఆధారంగా వారిపై చర్యలు తీసుకునేందుకు వీలుగా పావులు కదుపుతున్నట్లు భావిస్తున్నారు.

ఇటీవలి కాలంలో పలువురు వ్యాపారులు, రాజకీయ నాయకులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు నిర్వహిస్తున్నారు. సిబిఐ విచారణకు అవకాశం లేకపోయినా ఎన్‌ఫోర్స్‌మెంట్, ఐటీ చట్టాల ఆధారంగా దర్యాప్తు నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి గ్రూప్‌ ఆఫ్‌ ఇనిస్టిట్యూషన్స్‌లో ఆర్థిక లావాదేవీల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయనే అనుమానాలతో సోదాలు నిర్వహిస్తున్నారు.