Murdered For Gold Ornaments: దారుణం… బంగారు నగల కోసం 80 ఏళ్ల వృద్ధురాలి హత్య
Medak District Crime News: మెదక్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. బంగారు ఆభరణాల కోసం 80 ఏళ్ల వృద్ధురాలిని ఓ వ్యక్తి హత్య చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Old Woman Murdered For Gold Ornaments: ఆమె వయస్సు 80 ఏళ్లు..! ఆమె మెడలో ఉన్న బంగారు నగలు, కాళ్లకు ఉన్న కడియాలపై కన్నేశాడు అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి. ఇందుకోసం పక్కాగా ప్లాన్ వేశాడు. ఎవరూలేని సమయంలో వృద్ధురాలి ఇంటికెళ్లిన అతగాడు.. మాటల్లో పెట్టాడు. ఇదే సమయంలో ఒక్కసారిగా ఆమె మెడలోని బంగారు నగలను అపహరించేందుకు యత్నించాడు. అప్రమత్తమైన వృద్ధురాలు.. అడ్డుకునే ప్రయత్నం చేయగా.. ఇనుప రాడుతో తలపై గట్టిగా కొట్టడంతో వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన మెదక్ జిల్లాలో వెలుగు చూసింది.
ట్రెండింగ్ వార్తలు
పోలీసులు వివరాల ప్రకారం...
మెదక్ జిల్లాలోని చిన్నశంకరంపేట మండల పరిధిలోని చందంపేట గ్రామంలో ఎల్లమ్మ (80) అనే వృద్ధురాలు నివాసం ఉంటోంది. అయితే ఆమె మెడలోని ఉన్నబంగారం, కాళ్ళ కడియాలు దొంగలించాలని అదే గ్రామానికి చెందిన మ్యాకల యాదగిరి పథకం రచించాడు. ఎల్లమ్మ ఇంట్లో ఎవరూ లేని సమయంలో యాదగిరి ఆమె వద్దకు వెళ్లి మాయమాటలు చెప్పాడు. మెడలోని బంగారాన్ని లాగే ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన వృద్ధురాలు ప్రతిఘటించింది. దీంతో అతడు వృద్ధురాలిపై ఇనుప రాడుతో దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.
వృద్ధురాలి హత్య ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. హత్య చేసిన యాదగిరి మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. దర్యాప్తులో మరిన్ని వివరాలు తెలిసే అకాశం ఉంది. హత్యలో కేవలం యాదగిరి మాత్రమే ఉన్నాడా..? లేక ఇంకా ఏవరైనా ఉన్నారా..? అన్న కోణంలో విచారిస్తున్నారు. ప్రస్తుతం యాదగిరి పోలీసులు అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.