Competitive Exams Scoring : ఈ ట్రిక్.. ఉద్యోగ సాధనకు నిచ్చెన !-news papers reading will fetch good marks in tspsc appsc competitive exams ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Competitive Exams Scoring : ఈ ట్రిక్.. ఉద్యోగ సాధనకు నిచ్చెన !

Competitive Exams Scoring : ఈ ట్రిక్.. ఉద్యోగ సాధనకు నిచ్చెన !

Thiru Chilukuri HT Telugu
Jan 23, 2023 02:46 PM IST

Competitive Exams Scoring : 2023, తెలుగు రాష్ట్రాలకు ఉద్యోగ నామ సంవత్సరం అని చెప్పవచ్చు. తెలంగాణలో వరుస నోటిఫికేషన్లు వెలువడుతుండగా.. త్వరలో ఏపీలోనూ ఉద్యోగాల జాతర ఊపందుకోనుంది. ఈ నేపథ్యంలో... లక్షల మంది పోటీ పడే పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలంటే ఏం చేయాలి ? ఏ ట్రిక్స్ పాటించాలి.. ? న్యూస్ పేపర్ రీడింగ్ కి ఉన్న ప్రాముఖ్యత ఏంటి... ?

పోటీ పరీక్షలు - వార్తా పత్రికల ప్రాముఖ్యత
పోటీ పరీక్షలు - వార్తా పత్రికల ప్రాముఖ్యత (facebook)

Competitive Exams Scoring : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏడాది ఉద్యోగాల జాతర సాగనుంది. ఇప్పటికే తెలంగాణలో భారీ సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడ్డాయి. పోలీసులు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, వైద్యులు, నర్సులు, హాస్టల్ వార్డెన్లు సహా... గ్రూప్స్ స్థాయిలో జూనియర్, సీనియర్ అసిస్టెంట్, అకౌంటెంట్ తదితర పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. త్వరలో గురుకులాల్లో 11 వేలకుపైగా పోస్టులతో నోటిఫికేషన్ రానుంది.

మరోవైపు.. ఏపీలోనూ ఉద్యోగాల ప్రకటనలు ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష పూర్తయింది. ఎస్సై పరీక్ష ఫిబ్రవరి 19న జరగనుంది. మరికొన్ని రోజుల్లో.. 14 వేలకుపైగా పోస్టులతో సచివాలయ ఉద్యోగాల నోటిఫికేషన్ రానుందని తెలుస్తోంది. ఆ వెంటనే గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా రానుందన్న సంకేతాలు వస్తున్నాయి. ఉపాధ్యాయ ఖాళీల భర్తీని కూడా ఈ ఏడాదిలోనే చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పూర్తయింది. త్వరలో మెయిన్స్ జరగనుంది.

ఈ నేపథ్యంలో.. లక్షలాది మంది ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారు. కొంత మంది ప్రభుత్వ ఉద్యోగ సాధనే జీవిత ఆశయంగా పెట్టుకొని ఎన్నో ఏళ్ల నుంచి కుటుంబాలకు దూరంగా ఉంటూ నగరాల్లో పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఒక్కో పోస్టుకి వేలల్లో పోటీ ఉన్న పరిస్థితిలో... పరీక్షల్లో సాధించే ఒక్కో మార్కు చాలా కీలకం. అందుకే... పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే సమయంలో ఎంత సేపు చదివామన్న విషయం కన్నా... ఎలాంటి పద్ధతులు, ఏ ట్రిక్స్ పాటించామన్నదే కీలకం. గుట్టల కొద్దీ పుస్తకాల పోగేసి, గంటల కొద్దీ చదివే వారి కన్నా... స్మార్ట్ వర్క్ చేసి ఉద్యోగాలు సాధించిన వారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారందరూ తమ విజయానికి ముఖ్య కారణం ఏంటంటే... మొదట చెప్పే సమాధానం.. న్యూస్ పేపర్ రీడింగ్ అనే.

అవును... పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి వార్తా పత్రికల పఠనం అతి ముఖ్యం. ప్రతి ఒక్కరూ తప్పక పాటించాల్సిన నియమం. ఇప్పటికే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి కోచింగ్ తీసుకున్న వారికి ఈ విషయం తెలుసు. అయితే.. వారిలో కూడా చాలా మంది కేవలం నోటిఫికేషన్లు వచ్చిన సమయంలోనే పేపర్లు పట్టుకుంటారు. ఇక.. కొత్తగా ప్రిపరేషన్ మొదలు పెట్టిన వారిలో చాలా మంది ఏ పుస్తకాలు చదవాలి ? ఏ సీరిస్ కొనాలి అనే అంశాల పైనే ఎక్కువ దృష్టి సారిస్తారు. ఈ క్రమంలో... ప్రతి రోజూ ఇంటికే మార్కులను మోసుకొచ్చే న్యూస్ పేపర్ల ప్రాముఖ్యతను విస్మరిస్తారు. తాము ఏం కోల్పోతున్నామో ఇప్పటికైనా తెలుసుకుని.. న్యూస్ పేపర్ రీడింగ్ ద్వారా ప్రిపరేషన్ విధానాన్ని సరైన ట్రాక్ లోకి తీసుకెళితే... పోటీ పరీక్షల్లో మంచి మార్కులు స్కోర్ చేసేందుకు అవకాశం ఉంటుంది.

గతంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు, ప్రస్తుతం జరుగుతున్న ఎగ్జామ్స్ ను పరిశీలిస్తే... ప్రశ్నాపత్రాల శైలిలో చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. చరిత్ర, జాగ్రఫీ, ఎకనామీ, విదేశీ వ్యవాహారాలు, ప్రభుత్వ పథకాలు, విపత్తు నిర్వహణ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ.. తదితర అంశాల్లో ఎక్కువ ప్రశ్నలు తాజా అంశాలకు సంబంధించిన వాటి నుంచే వస్తున్నాయి. ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలకు... చరిత్రతో ఉన్న సంబంధాన్ని తెలియజేస్తూ పత్రికల్లో ప్రతి రోజు వార్తలు వస్తుంటాయి. పోటీ పరీక్షల్లో ఎంతో కీలకమైన జనరల్ స్టడీస్ పేపర్ లో దాదాపు అన్ని అంశాలు... ఇలా న్యూస్ పేపర్ లో కవర్ అవుతాయి. 5 సంవత్సరాల పాటు న్యూస్ పేపర్ చదువుతూ.. అందులో వచ్చే అంశాలపై పట్టు కలిగి ఉన్న వారు.. ఏ పుస్తకం ముట్టకుండానే నేరుగా పోటీ పరీక్షలకు హాజరైనా... 50 శాతం మార్కులు సాధిస్తారు. దానికి ప్రిపరేషన్ కూడా తోడైతే.. విజయం ఎందుకు దక్కదో ఆలోచించండి !

చాలా మంది న్యూస్ పేపర్లు కేవలం కరెంట్ అఫైర్స్ కోసమే ఉపయోగపడతాయని భావిస్తుంటారు. ఆ కోణంలోనే చదువుతుంటారు. ఈ దృష్ణి కోణాన్ని మార్చుకొని.. ప్రతి రోజు వార్తా పత్రికలను సమగ్రంగా అధ్యయనం చేస్తే.. ఎన్నో కొత్త అంశాలను తెలుసుకోవడమే కాకుండా... గతంలో మనం చదివిన విషయాలను మననం చేసుకున్నట్లు కూడా ఉంటుంది. ఉదాహరణకు... ఇటీవల ఉత్తరాఖండ్ లోని జోషి మఠ్ లో భూమి కుంగుతుందని తెలుపుతూ... వార్తలు వచ్చాయి. ఈ అంశాన్ని పూర్తిగా పరిశీలిస్తే... ఒకే సమయంలో హిస్టరీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, విపత్తు నిర్వహణ, కరెంట్ అఫైర్స్ టాపిక్స్ కి సంబంధించిన సబ్జెక్ట్ పై పట్టు సాధించినట్టు అవుతుంది. పరీక్షలో ఈ అంశం నుంచి ఏ విభాగంలో ప్రశ్న వచ్చినా.... వెంటనే సమాధానం ఇచ్చే వీలు కలుగుతుంది.

బడ్జెట్లు, ఆర్థిక సర్వేలు, ప్రభుత్వ పథకాలు, సుప్రీం కోర్టు కీలక తీర్పులు, ఎన్నికలు - ఫలితాలు, స్పోర్ట్స్, బిజినెస్ తదితర అంశాలను నిరంతరం చదువుతూ... ప్రతి రోజు నోట్స్ తయారు చేసుకుంటే... పోటీ పరీక్షల సమగ్ర మెటీరియల్ మీ చేతిలో ఉన్నట్లే. ఇటీవల పేపర్లలో కాంపిటేటీవ్ పరీక్షలకు సంబంధించిన స్టడీ మెటిరీయల్, ప్రాక్టీసు టెస్టులు కూడా వస్తున్నాయి. ఉద్యోగార్థులకు న్యూస్ పేపర్స్ అందించే అదనపు బెనిఫిట్స్ అవి. విజేతల ఇంటర్వ్యూలు... మనమూ సాధించగలమన్న స్ఫూర్తి ఇస్తాయి. సంపాదకీయంలో వచ్చే ఎస్సే ఆర్టికల్స్... గ్రూప్ 1, సివిల్స్, యూపీఎస్సీ తదితర పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి విషయ పరిజ్ఞానాన్ని పెంపొందిస్తాయి.

అయితే... న్యూస్ పేపర్ రీడింగ్ లో ఒక్క అంశం మాత్రం చాలా కీలకం. ప్రతి రోజు ఫాలో అయ్యేందుకు ఏ పేపర్ ఎంచుకుంటున్నారన్నది ముఖ్యం. ప్రస్తుతం అనేక పేపర్లు ఉన్నందున.. ప్రతి రోజు ఏవైనా రెండు పేపర్లు ఫాలో కావడం తప్పనిసరి. ఒక పేపర్ లో మిస్ అయిన అంశాలు.. మరో పేపర్ లో కవర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంగ్లీష్ మీద పట్టు ఉన్న వారు... ఒక తెలుగు పేపర్, ఒక ఇంగ్లీష్ పేపర్ ఫాలో అయితే... మంచి ఫలితాలు సాధించవచ్చు. సో.... పత్రిక పఠనాన్ని నిరంతర ప్రక్రియగా మార్చుకోండి. అదే ఉద్యోగ సాధనలో మీకు నిచ్చెనగా ఉపయోగపడుతుంది.

IPL_Entry_Point