Dacoit Police దొంగల ముఠాకు పోలీస్ కానిస్టేబుల్ నాయకత్వం-nalgonda police arrests hyderabad task force constable in theft cases ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Nalgonda Police Arrests Hyderabad Task Force Constable In Theft Cases

Dacoit Police దొంగల ముఠాకు పోలీస్ కానిస్టేబుల్ నాయకత్వం

HT Telugu Desk HT Telugu
Nov 28, 2022 12:19 PM IST

Dacoit Police ఉద్యోగం చేస్తే నెల జీతం తప్ప ఏమొస్తోంది అనుకుని, ఖాకీ యూనిఫాంను అడ్డం పెట్టుకుని చోరీలు ప్రారంభించాడో పోలీస్. వరుస చోరీలు, దోపిడీలతో భారీగా కూడబెట్టాడు.మహిళలు, చిన్నారులతో జరుగుతున్న చోరీలకు పోలీస్ కానిస్టేబుల్ నాయకుడని తెలియడంతో పోలీసులు అవాక్కయ్యారు. డ్యూటీకి డుమ్మా కొట్టి తన గ్యాంగ్‌తో చోరీలు చేయిస్తున్నాడని తెలిసి నిర్ఘాంతపోయారు.

నల్గొండ పోలీసుల అదుపులో టాస్క్‌ఫోర్స్‌ కానిస్టేబుల్
నల్గొండ పోలీసుల అదుపులో టాస్క్‌ఫోర్స్‌ కానిస్టేబుల్

Dacoit Police అతనో కానిస్టేబుల్‌, కానీ కానిస్టేబుల్‌ డ్యూటీలకు డుమ్మా కొట్టి నేరస్థులకు సహకరించటం, వారి నుంచి వాటాలు తీసుకోవడం నుంచి దొంగల ముఠాలను తయారు చేసే స్థాయికి ఎదిగాడు. ఎక్కడైనా దొంగలు పోలీసులకు పట్టుబడితే వారిని బెయిల్‌పై తీసుకురావటం డ్యూటీగా పెట్టుకున్నాడు. ఇటీవల నల్గొండ పోలీసులు హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ కానిస్టేబుల్‌ ఈశ్వర్‌‌ను చోరీ కేసులు అరెస్ట్‌ చేశారు. నల్గొండలో మొబైల్‌ఫోన్‌ చోరీలు పెరగడంతో దృష్టిసారించిన అక్కడి పోలీసులు సీసీ ఫుటేజీలతో అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులకు దొరికిన వాళ్లు తమతో చోరీలు చేయించే బాస్ వేరొకరు ఉన్నారని చెప్పడంతో అతని కోసం కూపీ లాగారు. దీంతో టాస్క్‌ ఫోర్స్‌ కానిస్టేబుల్‌ ఈశ్వర్‌ బండారం బయటపడింది. నల్గొండ పోలీసులు కస్టడీలోకి తీసుకొని మూడు రోజులు విచారించారు. కస్టడీలో ఈశ్వర్‌ నోరు విప్పకపోయినా అతని ఫోన్‌ కాల్‌డేటా, హైదరాబాద్‌ హఫీజ్‌పేట్‌, చీరాలలోని నివాసాల్లో దొంగలకు వసతి కల్పించటంపై సాక్ష్యాలు చూపటంతో విధిలేక నిజాలు బయట పెట్టినట్లు వెల్లడైంది.

ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా స్టూవర్ట్‌పురం గ్రామానికి చెందిన మేకల ఈశ్వర్ కానిస్టేబుల్‌గా హైదరాబాద్‌లోని పలు పోలీస్‌స్టేషన్లలో విధులు నిర్వర్తించాడు. క్రైమ్ విభాగంలో పనిచేయటంతో దొంగలతో పరిచయాలు ఏర్పడ్డాయి. అంతర్రాష్ట్ర ముఠాల ఆచూకీ కోసం ఇన్‌ఫార్మర్ల సహాయం తీసుకునేవాడు.ఈ క్రమంలో చోరీ సొత్తు రికవరీలో చేతివాటం ప్రదర్శించేవాడు. కొందరు ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలకు అందులో భాగాలు పంచేవాడనే ఆరోపణలున్నాయి. ఏపీ, తెలంగాణల్లో దొంగలతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. దొంగలకుటుంబాల్లోని పిల్లలు, మహిళలతో ముఠాలను తయారు చేసి హఫీజ్‌పేట్‌లోని తన నివాసంలో వారికి వసతి కల్పించాడు.

నగరంలో బహిరంగసభలు, జన సమ్మర్థ ప్రాంతాలు, రైతుబజార్లు తదితర చోట్ల పిక్‌పాకెటింగ్‌, చరవాణులు, గొలుసు చోరీలు చేయించాడు. ప్రతినెల ఆయా కుటుంబాలకు రూ.50 వేలు వేతనంగా ఇచ్చేవాడు. ఇలా ఈశ్వర్‌ దగ్గర మొత్తం 7 ముఠాలు పనిచేస్తున్నాయి. ముఠా సభ్యుల సహకారంతో భారీ ఎత్తున బంగారు ఆభరణాలు, చరవాణులు చోరీ చేయిస్తున్నాడు. ఇతని వేధింపులు భరించలేక కొందరు అజ్ఞాతంలోకి, మరికొంతమంది ఇతర రాష్ట్రాల్లో తలదాచుకుంటున్నారు. ఇద్దరు మహిళలను బెదిరించి లైంగికదాడికి పాల్పడినట్టు బాధితులు నల్గొండ పోలీసులకు ‎ఫిర్యాదు చేశారు. దీనిపై ఆధారాలు సేకరిస్తున్నారు.

అపహరించిన సెల్‌ఫోన్లను సెకండ్‌హ్యాండ్‌ మార్కెట్‌లో విక్రయించి సొమ్ము చేసుకునేవాడు. నల్గొండ పోలసులు టాస్క్‌ఫోర్స్‌ కానిస్టేబుల్ నిర్వాకంపై సీపీ సివి.ఆనంద్‌కు సమాచారం ఇచ్చారు. కానిస్టేబుల్ దోపిడీ వ్యవహారం వెలుగు చూడటంతో అతనితో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన అధికారులు, సిబ్బందిలో గుబులు మొదలైంది. ఇతనితో కలిసి దోపిడీల్లో సహకరించిన మరికొందరి ప్రమేయంపై ఆరా తీస్తున్నారు.

IPL_Entry_Point