Munugode By Poll : మునుగోడు ఊపందుకున్న ప్రచారం-munugode by poll nominations started ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Munugode By Poll Nominations Started

Munugode By Poll : మునుగోడు ఊపందుకున్న ప్రచారం

HT Telugu Desk HT Telugu
Oct 08, 2022 11:17 AM IST

Munugode By Poll మూడు పార్టీల అభ్యర్ధులు ఖరారు కావడంతో మునుగోడులో ప్రచారం ఊపందుకుంది. నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. తొలి రోజు ఇద్దరు అభ్యర్ధులు నామినేషన్లు కూడా దాఖలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచిన కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన మునుగోడులో టిఆర్‌ఎస్‌ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్ధిని కూడా కేసీఆర్ ఖరారు చేశారు.

మునుగోడు ఉపఎన్నిక
మునుగోడు ఉపఎన్నిక

Munugode By Poll మునుగోడు ఉప ఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా.. మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని పార్టీ అధినేత సిఎం కెసిఆర్ ప్రకటించారు. ఉద్యమకారుడుగా పార్టీ ఆవిర్భావ కాలం నుంచీ కొనసాగుతూ, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డినే అభ్యర్ధిత్వాన్ని మెజార్టీ మద్దతు లబించడంతో కూసుకుంట్ల పోటీ ఖాయమైంది. స్థానిక నాయకులు కార్యకర్తలు, జిల్లా పార్టీ నాయకత్వం, నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలను, సర్వే రిపోర్టలను పరిశీలించిన మీదట సిఎం కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు ప్రకటించాయి.

మరోవైపు కేసీఆర్‌ ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ బలోపేతం కోసమే తీసుకుంటారని, కూసుకుంట్లను భారీ మెజార్టీతో గెలిపిస్తాం ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మునుగోడులో ఎలాంటి అసంతృప్తి లేదని కర్నె ప్రభాకర్ చెప్పారు. మునుగోడు కూసుకుంట్లకు టిక్కెట్ కేటాయించడంపై మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ స్పందించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలు పాటిస్తానని చెప్పారు. టికెట్‌ ఆశించడం తప్పుకాదని, తన అవసరం జాతీయ రాజకీయాల్లో ఉందని సీఎం అన్నారని బూర నర్సయ్యగౌడ్ చెప్పారు.

మొదలైన నామినేషన్ల హడావుడి….

గత రెండు నెలలుగా మునుగోడులో రాజకీయ సందడి నెలకొంది. కోమటి రెడ్డి రాజీనామా, ఆ వెంటనే దానిని స్పీకర్ అమోదించడంతో మునుగోడులో ఎన్నికల సందడి మొదలైంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడులో టిఆర్‌ఎస్‌ తరపున కూసుకుంట్ల ప్రభాకర్ పోటీ చేశారు. మునుగోడులో 2,27,101 ఓట్లు ఉన్నాయి. కొత్తగా మరో 8వేల ఓట్లు తాజాగా జత చేరాయి. 2018లో కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డికి 44.51 శాతం ఓట్లు వచ్చాయి. టిఆర్‌ఎస్ అభ్యర్ధి కూసుకుంట్లకు 34.13శాతం ఓట్లు లభించాయి. ఇప్పుడు మరో 8,672 ఓటర్లు కొత్తగా నమోదయ్యారు. 2018లో బీజేపీకి కేవలం 5.81శాతం ఓట్లు మాత్రమే లభించాయి. కోమటిరెడ్డికి పోలైన ఓట్లు ఇప్పుడు బీజేపీకి దక్కుతాయో లేదో చర్చ జరుగుతోంది.

మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ తరపున బరిలో దిగుతున్న పాల్వాయి స్రవంతి రెడ్డి కూడా మునుగోడులో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఇంటింటి ప్రచారానికి స్రవంతి ప్రారంభించారు. మునుగోడులో ప్రధానంగా గౌడ, ముదిరాజ్ ఓటర్లు ఎన్నికల్లో ప్రభావం చూపనున్నారు. దాదాపు 35,150 గౌడ ఓటర్లున్నారు. ముదిరాజ్ వర్గంలో 33,900మంది ఓటర్లున్నారు. ఎస్సీ మాదిక వర్గానికి 9.69శాతంతో 25,650ఓట్లున్నాయి. పద్మశాలిలో 5.30శాతంతో 11,680ఓట్లున్నాయి. ప్రధానంగా నాలుగు కులాలల్లో ఎక్కువ ఓట్లు ఉండటంతో వారిని ఆకట్టుకునేందుకు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

తొలి రోజు నామినేషన్లలో ప్రజా ఏక్త పార్టీ తరపున నాగరాజు, స్వతంత్ర అభ్యర్ధిగా మారం వెంకటరెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. శని, ఆదివారం సెలవు కావడంతో సోమవారం నుంచి మునుగోడు నామినేషన్ల ప్రక్రియ ఊపందుకోనుంది. 12,14 తేదీల్లో ముహుర్తాలు బాగుండటంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులు ఆ రోజుల్లో నామినేషన్లు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

IPL_Entry_Point