MLA Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీ యాక్ట్.. చర్లపల్లి జైలుకు తరలింపు-mla raja singh arrested again hyderabad police filed pd act on him ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీ యాక్ట్.. చర్లపల్లి జైలుకు తరలింపు

MLA Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీ యాక్ట్.. చర్లపల్లి జైలుకు తరలింపు

HT Telugu Desk HT Telugu
Aug 25, 2022 06:21 PM IST

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. ఇటీవలే అరెస్టైన ఆయనకు స్థానిక కోర్టు బెయిల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. రెండు రోజుల తర్వాత రాజాసింగ్‌ను హైదరాబాద్ పోలీసులు గురువారం రెండోసారి అరెస్టు చేశారు.

ఎమ్మెల్యే రాజాసింగ్
ఎమ్మెల్యే రాజాసింగ్

రాజాసింగ్‌ను ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్(పీడీ యాక్ట్) కింద మంగళ్‌హాట్ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. చర్లపల్లిలోని సెంట్రల్ జైలుకు తరలించారు. షా ఇనాయత్‌గంజ్, మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్‌ పోలీసు అధికారుల బృందం గురువారం మధ్యాహ్నం మంగళ్‌హాట్‌లోని ఎమ్మెల్యే రాజాసింగ్ కార్యాలయానికి చేరుకుంది. సెక్షన్ 41 సీఆర్‌పీసీ కింద ఆయనకు పోటీలుసు నోటీసు ఇచ్చారు. అనంతరం అదుపులోకి తీసుకున్నారు.

అరెస్టును అడ్డుకునేందుకు రాజాసింగ్ అనుచరులు నినాదాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంగళ్‌హాట్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజాసింగ్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం, కమ్యూనిటీల మధ్య చీలికను తెచ్చేలా మాట్లాడారని పోలీసు కమిషనర్ ఆనంద్ తెలిపారు. యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసిన వీడియోలో ప్రవక్త మొహమ్మద్ పై వ్యాఖ్యలు చేశారన్నారు.

ఈ అంశం గురించి.. మరిన్ని ప్రసంగాలు, వీడియోలను యూట్యూబ్‌లో పెడతానని ఎమ్మెల్యే అన్నారని కమిషనర్ గుర్తు చేశారు. పోలీసు రికార్డుల ప్రకారం 2004 నుండి రాజాసింగ్ పై మొత్తం 101 క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో 18 మతపరమైన నేరాలకు పాల్పడ్డాడని కమిషనర్ తెలిపారు.

మంగళవారం సాయంత్రం కూడా మహమ్మద్ ప్రవక్తపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై సింగ్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 41-ఎ కింద అతనిని ప్రశ్నించడానికి ముందస్తు నోటీసు జారీ చేయడంతో పాటు పోలీసులు సరైన విధానాన్ని అనుసరించలేదని నాంపల్లి క్రిమినల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కింది కోర్టు ఇచ్చిన బెయిల్‌ను సవాల్ చేస్తూ హైదరాబాద్ పోలీసులు గురువారం హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

మరోవైపు హైదరాబాద్ లోని సున్నిత ప్రాంతాలన్నింటిలో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. హైదరాబాద్ పాతబస్తీ గురువారం ప్రశాంతంగా ఉంది. దుకాణాలు, ఇతర వాణిజ్య సంస్థలు తెరిచి ఉన్నాయి. ముందుజాగ్రత్త చర్యగా పాఠశాలలు, కళాశాలలను వారాంతం వరకు మూసివేశారు.

రాజా సింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శాలీబండాలోని ఆశా టాకీస్ ప్రాంతంలో బుధవారం కొంతమంది నిరసనకారులు ఊరేగింపు చేపట్టారు. బుధవారం అర్థరాత్రి అక్కడక్కడా హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఊరేగింపును అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై రాళ్లు రువ్వారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జి చేసి రాళ్లు రువ్వుతున్న 30 మందిని అదుపులోకి తీసుకున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం