Medaram 2022 | వన దేవతల.. జన జాతర.. ఇవాళ్టితో మెుదలు-medaram sammakka sarakkka jatara 2022 starts from today ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Medaram Sammakka Sarakkka Jatara 2022 Starts From Today

Medaram 2022 | వన దేవతల.. జన జాతర.. ఇవాళ్టితో మెుదలు

HT Telugu Desk HT Telugu
Feb 16, 2022 09:35 AM IST

రెండేళ్లకోసారి జరిగే.. మేడారం వనదేవతల జాతర ఇవాళ్టితో మెుదలైంది. ఇప్పటికే లక్షలాది భక్తులు అమ్మవార్లను దర్శించుకునేందుకు.. వస్తున్నారు. ఇవాళ... సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెకు చేరుకుంటారు. ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా.. ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

మేడారం జాతర
మేడారం జాతర (HT_PRINT)

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరైన.. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నేటితో మెుదలైంది. వన దేవతలను దర్శించుకునేందుకు.. నెలరోజుల నుంచి భక్తులు వస్తూనే ఉన్నారు. సమ్మక్క, సారలమ్మ నామ స్మరణతో మేడారం.. హోరెత్తిపోతోంది. కోరిన కోర్కేలు తీర్చే.. తల్లులను సల్లంగా చూడమని వేడుకుంటున్నారు. విద్యుద్దీపకాంతులతో మేడారం ధగధగలాడుతోంది.

తెలంగాణ కొంగు బంగారం మేడారం.. మహాజాతర. ఈ జాతర కోసం భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. వన జాతరను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. హైదరబాద్ కు 230 కిలోమీటర్ల దూరంలోని ములుగు జిల్లా మేడారంలో మాఘ పౌర్ణమి రోజున అంటే.. ఇవాళ్టితో జాతర ప్రారంభమైంది. 19వ తేదీ వరకు జరగనుంది. 18వ తేదీన సీఎం కేసీఆర్ దర్శనానికి వస్తారు. సుమారు కోటిన్నర మంది భక్తులు ఈ జాతరకు వచ్చి.. వనదేవతలను దర్శించుకుంటారు. మెుత్తం నలభై వేల మంది.. సిబ్బంది.. జాతర కోసం పనిచేస్తున్నారు.

మరోవైపు.. గిరిజన సంస్కృతి సంప్రదాయాల ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి సమ్మక్క భర్త పగిడిద్దరాజును బయలుదేరారు. పూజారులు పాదయాత్రగా.. ఇవాళ గద్దె తీసుకువస్తారు. కన్నెపల్లి నుంచి సారలమ్మ.. ఇవాళే గద్దెను చేరుకుంటారు. చిలుకల గుట్టలో భరిణె రూపంలోని సమ్మక్కను రెండో రోజున గద్దెపై ప్రతిష్టిస్తారు. మూడో రోజు నుంచి భక్తులు మెుక్కులు చెల్లించుకుంటారు. నాలుగో రోజున దేవతలు వన ప్రవేశం చేస్తారు. గోదావరి నదికి ఉపనది అయిన జంపన్న వాగులో భక్తులు స్నానాలు చేసి.. అనంతరం దర్శనాలు చేసుకుంటారు. ఈ ఏడాది పుష్కలంగా నీటిని వదిలారు.

ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. భద్రతా విషయంలో ఎక్కడా రాజీపడలేదు. సుమారు 11 వేల మంది పోలీసులు విధుల్లో ఉన్నారు. అర కిలోమీటరుకు ఒక పోలీసు అవుట్‌పోస్ట్‌ చొప్పున జాతరలో కనిపిస్తుంది. ఇవి.. ప్రభుత్వ కంట్రోల్ రూమ్ తో అనుసంధానించారు. దాదాపు 22 వేల సీసీ కెమెరాలు.. నిరంతంర పర్యవేక్షిస్తూనే ఉంటాయి. డ్రోన్లు సైతం ఉపయోగిస్తున్నారు. మహా జాతరలో తప్పిపోయే వారి కోసం.. 11 ఎల్‌ఈడీ స్క్రీన్స్, పబ్లిక్‌ మైక్‌ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. పది వైఫై కేంద్రాలను తెలంగాణ ఐటీ శాఖ అధికారులు ప్రారంభించారు.

ఈ మహా జాతర కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. పార్కింగ్ చేసేందుకు దాదాపు వెయ్యి ఎకరాలకు పైగానే కేటాయించారు. మరోవైపు సుమారు 32 ఎకరాల్లో బస్‌స్టేషన్‌ ఉంది. జంపన్నవాగు వరకు మినీ బస్సులు నడుస్తాయి. మేడారం జాతరకు ఎప్పుడూ ఉండే ట్రాఫిక్ సమస్యపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. మరోవైపు కరోనా ఉన్న దృష్ట్యా.. ప్రభుత్వం ప్రత్యేకంగా మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేస్తోంది. ఆరోగ్య శిబిరాలను సైతం ఏర్పాటు చేశారు. ఆహారం, నీటి నాణ్యత పరిశీలినకు ఆహారభద్రత అధికారులు సైతం విధుల్లో ఉన్నారు.

హెలికాప్టర్ సేవలు ప్రారంభం

మేడారం జాతరకు వచ్చేవారి కోసం... బేగంపేట ఎయిర్‌పోర్టులో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హెలికాప్టర్‌ సేవలను ప్రారంభించారు. జాయ్‌ రైడ్‌, షటిల్‌ సర్వీస్‌, చార్టర్‌ సర్వీస్‌.. ఇలా మూడు రకలా సేవలు భక్తులు అందనున్నాయి. ఇవాళ 20వ తేదీ వరకు ఈ సేవలు కొనసాగుతాయి. జాయ్‌ రైడ్‌ తో చేస్తూ 7...8 నిమిషాల పాటు మేడారం జాతర చూసేందుకు అవకాశం ఉంది. ఒక్కొక్కరికి టికెట్‌ ధర రూ.3,700గా నిర్ణయించారు. హనుమకొండ నుంచి మేడారం వెళ్లేందుకు షటిల్ సర్వీస్ ఉంది. దీనికి గానూ.. రూ.19,999 చెల్లించాలి. చార్టర్ సర్వీసులో కరీంనగర్‌ నుంచి మేడారానికి రూ.75,000 తీసుకుంటారు. హైదరాబాద్‌ టూ మేడారం రూ.75,000, మహబూబ్‌నగర్‌ టూ మేడారం రూ.1,00,000 టికెట్‌ ధరగా ఉంది. హెలికాప్టర్ లో వెళ్లిన వారికి వీఐపీ దర్శం ఉంటుంది.

IPL_Entry_Point