Medaram Priest Murder: మేడారం పూజారి దారుణ హత్య-medaram forest gods priest was ravi brutally murdered ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Medaram Forest Gods Priest Was Ravi Brutally Murdered

Medaram Priest Murder: మేడారం పూజారి దారుణ హత్య

HT Telugu Desk HT Telugu
Mar 22, 2023 09:33 AM IST

Medaram Priest Murder: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం వనదేవతల పూజారి సోమవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. ఏటూరునాగారం మండలం కొండాయికి చెందిన దబ్బకట్ల రవిని గుర్తు తెలియని వ్యక్తులు బండరాళ్ళతో తపై మోది హత్య చేసినట్లు గుర్తించారు. తెలిసిన వారి పనేనని అనుమానిస్తున్నారు.

హత్యకు గురైన మేడారం పూజారి
హత్యకు గురైన మేడారం పూజారి

Medaram Priest Murder: మేడారం వనదేవతల పూజారిగా ఉన్న దబకట్ల రవి హత్యకు గురయ్యాడు. మేడారానికి చెందిన శ్రీలతను వివాహం చేసుకొని అక్కడే స్థిరపడ్డారు. హతుడు ప్రతి నెలలో వారం పాటు ఆలయ ప్రాంగణంలో గోవిందరాజు గద్దెపై పూజలు నిర్వహిస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. మిగతా రోజుల్లో వ్యవసాయ పనులు చేస్తుంటారు.

ట్రెండింగ్ వార్తలు

తన వంతులో భాగంగా ఈనెల 20 నుంచి రవి గద్దెపై పూజలు చేస్తున్నారు. ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామానికి చెందిన దబ్బగట్ల రవి అత్తగారి గ్రామమైన మేడారంలో స్థిరపడ్డారు. వీరిది గోవిందరాజుల గద్దె పూజారుల కుటుంబం. ఈ కుటుంబీకులు వారానికి ఒకరు చొప్పున గద్దె వద్ద పూజలు నిర్వహిస్తుంటారు. తనవంతు వారంలో రవి భక్తులకు బొట్టు పెట్టి పూజలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే రవి హత్య జరగడం మేడారంలో కలకలం రేపింది.

సిద్దిపేటకు చెందిన ఓ వ్యక్తి వనదేవతల దర్శనానికి వచ్చి రవితో పరిచయం పెంచుకుని బయటికి రావాల్సిందిగా కోరాడని, పూజల బాధ్యతను కుమార్తె నందినికి అప్పగించి అతనితో కలిసి రవి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

మంగళవారం పగిడిద్దరాజు పూజారి పెనక మురళీధర్‌ ఇంటి సమీపంలో రవి మృతదేహాన్ని గ్రామస్థులు గమనించి పోలీసులకు సమాచారమందించారు. బండరాళ్లతో తలపై మోదడంలో ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. రవి కుమార్తె నందిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

మేడారం పూజారి రవి హత్య ఎవరు చేశారు.. ఎందుకు చేశారనేది మిస్టరీగా మారింది. మృతుడి తల్లికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో హనుమకొండలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.రవి తల్లిని చూసుకుంటూ భార్య శ్రీలత అక్కడే ఉండి సపర్యలు చేస్తున్నారు. హత్య జరిగిన ప్రదేశంలో ఇద్దరు పురుషులు, ఒక మహిళ శనివారం నుంచి ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. మద్యం మత్తులో హత్య జరిగిందా.., పథకం ప్రకారం చేశారా అనేది విచారణలో తేలుస్తుందని చెబుతున్నారు.

తెలిసిన వారి పనేనా…

గోవిందరాజుల పూజారి రవి హత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తు లు రవిని ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని సోమవారం మేడారంలో తిరిగారని, మద్యం కూడా సేవించారని స్థానికులు చెబుతున్నారు. వారిలో ఓ మహిళ కూడా ఉందంటున్నారు. తమ పర్సు పోయిందని, దానిని వెతుకుదామంటూ రవిని బైక్‌పై తీసుకెళ్లారని, ఆ పర్సు విషయమై స్థానికంగా పలువురిని వాకబు కూ డా చేశారని చెబుతున్నారు.

మేడారం రోడ్డు పక్కన ఉన్న ఓ షెడ్డు వద్ద రాత్రి వంట కూడా చేసుకున్నారని, మద్యం తాగించిన అనంతరం రవి తలపై బండరాళ్లతో కొట్టి చంపి ఉంటారని భావిస్తున్నారు. మృుడి చెప్పులు ఘటనాస్థలానికి దూరంగా పడి ఉండటంతో అంతకుముందు పెనుగులాట కూడా జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. హత్య చేసిన వ్యక్తులతో పూజారి రవికి ఇంతకుముందే పరిచయముందా అనే విషయంపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. సోమవారం రాత్రి స్థానికంగా కరెంట్‌ సరఫరా లేదని, ఇదే అదనుగా రవిని హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

WhatsApp channel